Naga Chaitanya: సోషల్ మీడియా ప్రమాదకరం.. ఇలా హ్యాపీగా ఉన్నా అదే చాలు: చై వ్యాఖ్య
23 August 2022, 22:02 IST
- నాగచైతన్య ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని, ఇంటర్నెట్‌లో దుష్ప్రభావాలు కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు.
నాగచైతన్య
నాగచైతన్య-సమంత విడిపోయి దాదాపు పది నెలలు కావస్తోంది. గతేడాది అక్టోబరులో వీరిద్దరూ తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తాము విడిపోతున్నట్లు స్పష్టం చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి విడాకులు హాట్ టాపిక్‌గా మారింది. లక్షల మంది వీరి విడాకులపై విపరీతంగా స్పందించారు. తమ వ్యక్తిగత జీవితాలను వీరిద్దరూ పెద్దగా స్పందించని వీరు.. ఇటీవల కాలంలో ఓపెన్ అయ్యారు. అయితే సోషల్ మీడియా విషయంలో మాత్రం నాగచైతన్య దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
“నేను సోషల్ మీడియాతో ఎక్కువగా డిస్ కనెక్ట్ అవుతూ ఉంటాను. ఇలా చాలా హ్యాపీగా ఉన్నాను. నిజాయితీగా చెప్పాలంటే ఆన్‌లైన్‌లో నేను చాలా బోరింగ్ వ్యక్తిని. అయితే నా సినిమా విడుదలకు, పోస్టింగ్స్‌కు ఇంటర్వ్యూలు, రివ్యూలు, రియాక్షన్ల వరకు ఓకే. కానీ అతిగా సోషల్ మీడియాతో కనెక్ట్ అవ్వలేను. ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రభావాలను కలిగించే విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఏది మంచి, ఏది చెడో తెలుసుకోలేం. మీకు మంచిది కానిది ఎంచుకుంటే చెడ్డ దారిలో వెళ్లే ప్రమాదముంది." అని నాగచైతన్య స్పష్టం చేశారు.
ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో సమంత తన విడాకులపై స్పందించింది. "చైతన్య, నీకు మధ్య ఇంకా హార్డ్ ఫీలింగ్స్ ఉన్నాయా? అని ప్రశ్నించగా.. మా ఇద్దరినీ ఒక రూంలో ఉంచినట్లయితే.. తప్పనిసరిగా పదునైన వస్తువులను దూరంగా ఉంచాల్సి ఉంటుంది అని సంచలన వ్యాఖ్యలు చేసింది సామ్. ప్రస్తుతానికైతే పరిస్థితులు సరిగ్గా లేవని, భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేనని తెలిపింది.
టాపిక్