తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naa Saami Ranga 7 Days Collections: ‘నా సామిరంగ’కు కలెక్షన్ల జోరు.. లాభాల్లోకి.. ఏడు రోజుల్లో ఎంతంటే..

Naa Saami Ranga 7 Days Collections: ‘నా సామిరంగ’కు కలెక్షన్ల జోరు.. లాభాల్లోకి.. ఏడు రోజుల్లో ఎంతంటే..

21 January 2024, 14:11 IST

google News
    •  Naa Saami Ranga 7 Days Collections: ‘నా సామిరంగ’ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకెళుతోంది. తొలి వారం అంచనాలకు తగ్టట్టు వసూళ్లను రాబట్టింది. లాభాల్లో అడుగుపెట్టింది.
Naa Saami Ranga 7 Days Collections: ‘నా సామిరంగ’కు కలెక్షన్ల జోరు
Naa Saami Ranga 7 Days Collections: ‘నా సామిరంగ’కు కలెక్షన్ల జోరు

Naa Saami Ranga 7 Days Collections: ‘నా సామిరంగ’కు కలెక్షన్ల జోరు

Naa Saami Ranga 7 Days Collections: నా సామిరంగ సినిమా అంచనాలను నిలబెట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. కింగ్ నాగార్జున నటించిన ఈ పీరియడ్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ‘నా సామిరంగ’ రిలీజైంది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్‍తో పాటు ఎంటర్‌టైన్‍మెంట్‍తో ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు విజయ్ బిన్నీ. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. మంచి వసూళ్లను సాధిస్తోంది.

నా సామిరంగ సినిమాకు ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.41.3 కోట్ల గ్రాస్ వసూళ్లు (సుమారు రూ.21కోట్ల నెట్) వచ్చాయి. సంక్రాంతికి సరిపోయేలా విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో పక్కా కమర్షియల్ ఎలిమెంట్లతో రావడంతో ఈ మూవీకి మంచి ఆదరణ దక్కింది. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కూడా కీలకపాత్రల్లో నటించారు.

నా సామిరంగ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.19కోట్ల వరకు జరిగింది. అయితే, ఇప్పటికే నెట్ కలెక్షన్లు రూ.20 కోట్లు దాటేసింది. దీంతో చాలా ప్రాంతాల్లో ఈ మూవీని కొన్న బయ్యర్లు లాభాల్లోకి వచ్చేశారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా హిట్ స్టేటస్‍లోకి వచ్చేసింది.

కొరియోగ్రాఫర్‌గా ఫేమస్ అయిన విజయ్ బిన్నీ.. ‘నా సామిరంగ’ మూవీతో దర్శకుడిగా మారాడు. ఫస్ట్ మూవీతోనే మెప్పించారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఆయన మ్యూజిక్ కూడా ఈ మూవీకి బాగా ప్లస్ అయింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీకి తగ్గట్టుగా సాగింది.

సా సామిరంగ మూవీలో నాగార్జునకు జోడీగా నటించిన హీరోయిన్ అషిక రంగనాథ్‍కు మంచి పేరు వచ్చింది. ఈ మూవీలో అల్లరి నరేశ్ సరసన మిర్మా మీనన్, రాజ్ తరుణ్‍కు జోడీగా రుక్సర్ ధిల్లాన్ నటించారు. నాజర్, షబీర్ కల్లరకల్, రవి వర్మ, రావు రమేశ్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా 1980ల బ్యాక్‍డ్రాప్‍లో సాగుతుంది.

నా సామిరంగ సినిమా తన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుందని సక్సెస్ మీట్‍లో నాగార్జున చెప్పారు. చాలా మంది తనకు ఫోన్లు, మెసేజ్‍లు చేసి ఈ మాట చెబుతున్నారని తెలిపారు. ఈ సినిమా గురించి కొందరు చిట్టీలు రాసి గోడపై నుంచి తమ ఇంట్లో వేస్తున్నారని నాగార్జున అన్నారు. ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని చెబుతున్నారని చెప్పారు. సంక్రాంతి సీజన్‍లో మంచి కమర్షియల్ అంశాలతో రావడం, విలేజ్ బ్యాక్‍డ్రాప్, సాధారణ టికెట్ రేట్లు ఉండడం నా సామిరంగ మూవీకి బాగా కలిసి వచ్చాయి.

బ్లాక్‍బాస్టర్‌ను సెలెబ్రేట్ చేసుకునేందుకు భారీగా సక్సెస్ ఈవెంట్ నిర్వహించాలనే ప్లాన్‍లో కూడా నా సామిరంగ మూవీ టీమ్ ఉన్నట్టు తెలుస్తోంది. జనవరి 25వ తేదీలోగా ఏదో ఒక రోజు ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటోంది. అయితే, ఇంకా తేదీ, వేదిక ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం