Theatre releases this week: ఈ వారం థియేటర్లలోకి రానున్న 5 సినిమాలు.. డిఫరెంట్ జానర్లతో..
29 April 2024, 14:25 IST
- Theatre releases this week: మే తొలివారంలో తెలుగులో ఐదు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అల్లరి నరేశ్ కామెడీ ఎంటర్‌టైనర్ ఆ ఒక్కటి అడక్క కూడా రానుంది. డిఫెరెంట్ జానర్లతో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Theatre releases this week: ఈ వారం థియేటర్లలోకి రానున్న 5 సినిమాలు.. డిఫరెంట్ జానర్లతో..
Theatre releases this week: ఏప్రిల్ చివరి వారంలో థియేటర్లలో కొత్త సినిమాల సందడి పెద్దగా కనిపించలేదు. కొన్ని చిత్రాలు వాయిదాలు పడ్డాయి. అయితే, ఈ వారం (మే తొలివారం)లో తెలుగులో ఐదు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఒకదానితో పోలిస్తే ఒకటి డిఫరెంట్ జానర్లతో ఈ చిత్రాలు అడుగుపెడుతున్నాయి. కామెడీ, థ్రిల్లర్, ఎమోషనల్, హారర్ కామెడీ ఇలా డిఫరెంట్ చిత్రాలు వస్తున్నాయి. ఈ మే తొలి వారం తెలుగులో థియేటర్లలో రిలీజ్ కానున్న 5 సినిమాలు ఏవంటే..
ప్రసన్న వదనం
కమెడియన్ నుంచి హీరోగా మారిన సుహాస్ ఫుల్ ఫామ్‍లో ఉన్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘ప్రసన్న వదనం’ సినిమా మే 3వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. మనుషుల ముఖాలను మాత్రమే చూడలేని ఫేస్ బ్లైండ్‍నెస్ అనే డిఫెరెంట్ అంశంతో ఈ థ్రిల్లర్ మూవీ వస్తోంది. అరుణ్ వైకే ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. మణికంఠ జేఎస్, ప్రసాద్ రెడ్డి టీఆర్ నిర్మించారు. ప్రసన్నవదనం మూవీలో సుహాస్‍కు జోడీగా రాశీ సింగ్ నటించగా.. నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న కీరోల్స్ చేశారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఆ ఒక్కటి అడక్కు
కొంతకాలంగా సీరియస్ సినిమాలు చేస్తున్న హీరో అల్లరి నరేశ్.. మళ్లీ తన మార్క్ కామెడీతో ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రం చేశారు. పెళ్లి కోసం తంటాలు పడే యువకుడిగా ఈ మూవీలో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఒక్కటి అడక్కు సినిమా మే 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి మల్లి అంకం దర్శకత్వం వహించగా.. రాజీవ్ చిలక నిర్మించారు. ఈ మూవీలో అల్లరి నరేశ్ సరసన హీరోయిన్‍గా చేశారు ఫారియా అబ్దుల్లా.
బాక్
తమిళ హారర్ కామెడీ మూవీ ‘అరణ్మలై 4’లో సుందర్ సీ, స్టార్ హీరోయిన్లు తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో సూపర్ హిట్ ఫ్రాంచైజీ అరణ్మలై నుంచి వస్తున్న నాలుగో చిత్రమిది. ఈ సినిమా తెలుగులో ‘బాక్’ పేరుతో వస్తోంది. ఈ బాక్ చిత్రం మే 3వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేసిన సుందర్ సీ దర్శకత్వం కూడా వహించారు. బాక్ ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ మూవీకి ఖుష్బూ సుందర్, అరుణ్ కుమార్ నిర్మించారు.
శబరి
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో సైకలాజికల్ థ్రిల్లర్ శబరి మూవీ రూపొందింది. తల్లీకూతుళ్ల సెంటిమెంట్‍తో ఈ మూవీ తెరకెక్కింది. కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి చేసే ప్రయత్నాల చుట్టూ ఈ మూవీ ఉంటుంది. శబరి సినిమా మే 3వ తేదీన విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మలయాళం భాషల్లో రిలీజ్ అవుతుంది. శబరి చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ కట్జ్ తెరకెక్కించారు.
జితేందర్ రెడ్డి
1980ల కాలంలో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా జితేందర్ రెడ్డి చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు రాకేశ్ వర్రే. ఉయ్యాల జంపాల ఫేమ్ దర్శకుడు విరించి వర్మ తెరకెక్కించిన జితేందర్ రెడ్డి మూవీ మే 3న థియేటర్లలో రిలీజ్ కానుంది.