modern love hyderabad review: మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ రివ్యూ..
29 August 2022, 17:03 IST
modern love hyderabad webseries review: ప్రతిభావంతులైన నటీనటులు, అవార్డులు అందుకున్న సాంకేతిక నిపుణుల కలయిక అరుదుగా కుదురుతుంది. అలాంటి రేర్ కాంబినేషన్ లో రూపొందిన వెబ్ సిరీస్ మెడ్రన్ లవ్ హైదరాబాద్. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే...
మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్
modern love hyderabad webseries review: ఇటీవలకాలంలో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన వెబ్‌సిరీస్‌లలో మోడ్రన్ లవ్ హైదరాబాద్( modern love hyderabad review)ఒకటి. స్టార్ కాస్ట్, అగ్ర దర్శకులు, సాంకేతిక నిపుణుల కలయికలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్ ప్రచార చిత్రాలతో ఆసక్తిని రేకెత్తించింది.
ఆరు ఎపిసోడ్స్ తో ఆంథాలజీగా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో నిత్యామీనన్(nityamenon), సుహాసినిమణిరత్నం, రేవతి(revathi), నరేష్, దివ్యవాణి, ఆదిపినిశెట్టి(aadi pinishetty), రీతూవర్మ, అభిజీత్(bigg boss abhijeet), నరేష్ అగస్త్య మాళవికానాయర్, కోమలి ప్రసాద్ కీలక పాత్రలను పోషించారు.
న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కాలమ్స్ ఆధారంగా దర్శకులు నగేష్ కుకునూర్(nagesh kukunoor), ఉదయ్ గుర్రాల, వెంకటేష్ మహా, దేవికా బహుదానం ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్(amazon prime video) ద్వారా ఈ సిరీస్ రిలీజ్ అయ్యింది.
మై అన్ లైక్లీ పాండమిక్ డ్రీమ్ పార్ట్‌నర్- నగేష్ కుకునూర్
ఆచారాలు, మూఢనమ్మకాలకు విలువనిచ్చే మెహరున్నీసా(రేవతి) అనే తల్లి, అభ్యుదయభావాలు కలిగి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం అభిలాషించే కూతురు నూర్ (నిత్యామీనన్) కథ ఇది. ఇతర మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఓ కూతురిపై ప్రేమను చంపుకోలేక ఓ తల్లిపడే ఆరాటాన్ని దర్శకుడు హృద్యంగా మోడ్రన్ లవ్ హైదరాబాద్ ఫస్ట్ ఎపిసోడ్ లో చూపించారు.
ఇష్టమైన వంటకాల ద్వారా తల్లి మంచి మనసును కూతురు ఎలా అర్థం చేసుకుంది, లాక్ డౌన్ వారిని ఏ విధంగా ఒక్కటి చేసిందో దర్శకుడు నగేష్ కుకునూర్ అర్థవంతంగా ఈ ఎపిసోడ్ లో ఆవిష్కరించారు. తల్లీకూతుళ్లుగా రేవతి, నిత్యామీనన్ పోటీపడి నటించారు. తమ నటనతో సింపుల్ కథను రక్తికట్టించారు.
ఫజ్జీ పర్పుల్ అండ్ ఫుల్ ఆఫ్ థ్రోన్-నగేష్ కుకునూర్
నమ్మకం లేని చోట ప్రేమ నిలబడదు...ప్రేమకు పునాది నమ్మకమే..అనుమానం, అసూయద్వేషాలు జీవితంలోకి ప్రవేశిస్తే బంధాలు ఎలా విచ్ఛిన్నమవుతాయనే అంశాన్ని మోడ్రన్ రిలేషన్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ ద్వారా చెప్పారు దర్శకుడు నగేష్ కుకునూర్. పెళ్లిపై నమ్మకం లేని లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న ఉదయ్(ఆది పినిశెట్టి), రేణుక (రీతూవర్మ) అనే యువజంట చెప్పుల కారణంగా ఎలా విడిపోయారు? తమ మధ్య ఉన్న అపార్థాల్ని వీడి ఎలా కలుసుకున్నారో రొమాంటిక్‌గా చూపించారు.
వై డిడ్ షీ లివ్ మీ దేర్-నగేష్ కుకునూర్
జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా మూలాలను మాత్రం మర్చిపోవద్దని ఈ ఎపిసోడ్ ద్వారా చాటిచెప్పారు దర్శకుడు. తల్లి ప్రేమకు దూరమైన రాములు అలియాస్ రోహన్ ను (నరేష్ అగస్త్య) అమ్మమ్మ గంగవ్వ ( సుహాసిని మణిరత్నం )ఏ లోటు రాకుండా పెంచుతుంది.
మనవడికి ఓ మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆమె చేసిన త్యాగం ఏమిటి? అమ్మమ్మ చూపించిన బాటలోనే ఏ విధంగా అడుగులు వేసాడో చాటిచెప్పే కథ ఇది. అమ్మమ్మ మనవడి అనుబంధంతో సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. తెలంగాణ యాసలో సాగే డైలాగ్స్ ఈ సింపుల్ కథకు అందాన్ని తీసుకొచ్చాయి . అమ్మమ్మ పాత్రలో సుహాసిని జీవించింది. నరేష్ అగస్త్య నటన బాగుంది.
ఎబౌట్ దట్ రస్టెల్ ఇన్ ది బుషెస్- దేవికా బహుదానం
పిల్లల పట్ల తల్లిదండ్రులు చూపించే ప్రేమ, బాధ్యతలను ఓవర్ ప్రొటెక్టివ్ నెస్ ను చాలా మంది పిల్లలు అపార్థం చేసుకుంటుంటారు. ఆంక్షలు, బాధ్యతల పేరుతో తనకు నచ్చినట్లుగా జీవితాన్ని గడకుండా అడ్డుపడుతున్నాడని తండ్రి శ్రీధర్ ను ద్వేషిస్తుంటుంది అతడి కూతురు స్నేహ.
తనకు నచ్చిన తోడును వెతుక్కుకోవడానికి స్నేహా వెళ్లిన ప్రతి చోటుకు ఆమెకు తెలియకుండా శ్రీధర్ ఫాలో అవుతుంటాడు. తండ్రిని ద్వేషించిన స్నేహ అతడి ప్రేమను ఎలా అర్థం చేసుకుందో ఈ ఎపిసోడ్ లో చూపించారు. నరేష్, దివ్యవాణి, ఉల్క గుప్తా చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. శివకార్తికేయన్ హీరోగా నటించిన డాన్ సినిమాను గుర్తుకుతెస్తుంది మోడ్రన్ లవ్ హైదరాబాద్ లోని ఈ ఎపిసోడ్.
వాట్ క్లోన్ రోట్ దిస్ స్ట్రిప్ట్- ఉదయ్ గుర్రాల
అశ్విన్ అనే టీవీ షో ప్రొడ్యూసర్, వందన అనే స్టాండప్ కమెడియన్ ప్రేమకథతో దర్శకుడు ఉదయ్ గుర్రాల ఈ ఎపిసోడ్ ను తెరకెక్కించారు. క్రియేటీవ్ గా ఆలోచించే ఓ జంట కలిసి బతకాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే అవరోధాలు, అడ్డంకులతో ఈ ఎపిసోడ్ సాగుతుంది. అశ్విన్ గా బిగ్‌బాస్ విన్నర్ అభిజీత్, వందనగా మాళవికానాయర్ యాక్టింగ్ బాగుంది.
ఫైండింగ్ యువర్ పెంగ్విన్-వెంకటేష్ మహా
జీవితభాగస్వామిని ఎంచుకునే విషయంలో యువతరం ఆలోచనలు, అభిప్రాయాలతో పాటు వారిలో ఉండే కన్ఫ్యూజన్స్ కు యానిమల్ థియరీ అనే కాన్సెప్ట్ ను జోడించి చివరి ఎపిసోడ్ సాగుతుంది. జీవితంపై స్పష్టత లేని అమ్మాయిగా అల్లరి అమ్మాయిగా కోమలి ప్రసాద్ తన నటనతో ఆకట్టుకుంది.
modern love hyderabad webseries review: ఆరు ప్రేమకథలతో
ఆరు ప్రేమకథలతో మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉండే ప్రేమ, ఆప్యాయతలతో పాటు మ్రోడన్ రిలేషన్‌షిప్స్‌లో ఎదురవుతున్న సమస్యలను సున్నితంగా చర్చిస్తూ ఆహ్లాదభరితంగా ఈ వెబ్‌సిరీస్ సాగుతుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వల్ల ఏ ఎపిసోడ్ కూడా బోరింగ్ అనే ఫీల్ కలగలేదు. కీరవాణి సమకూర్చిన థీమ్ సాంగ్ బాగుంది.
కొన్ని మాత్రమే హిట్...
అశ్లీలత, అసభ్యతకు తావులేకుండా ఫ్యామిలీ అంతా కలసి చూసేలా సాగే వెబ్ సిరీస్ ఇది. ఇందులో చర్చించిన అంశాలన్నీ పాతవే. ఇదివరకు ఏదో ఒక సినిమాలోనో, సిరీస్‌లోనో చూసినట్లుగానే అనిపిస్తుంటాయి. మోడ్రన్ లవ్ హైదరాబాద్ లోని ఆరు ఎపిసోడ్స్ లో కొన్ని మాత్రమే ఆకట్టుకుంటాయి.
modern love hyderabad webseries review: రేటింగ్ 2.5/ 5