mehreen | ఇండస్ట్రీలో భవిష్యత్తుపై భరోసా ఉండదు... సినీ కెరీర్ పై మెహరీన్ ఎమోషనల్ పోస్ట్
20 March 2022, 15:57 IST
సినీ పరిశ్రమలో భవిష్యత్తుపై ఏ మాత్రం భరోసా ఉండదని అంటోంది మెహరీన్. సినీ కళాకారులు జీవితం అనిశ్చితితో కూడి ఉంటుందని పేర్కొన్నది. ఆదివారం తన నట ప్రయాణంపై మెహరీన్ ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
మెహరీన్
‘కృష్ణగాడివీరప్రేమగాథ’ సినిమాతో తెలుగులో తొలి అడుగు వేసింది పంజాబీసుందరి మెహరీన్. ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించడంలో టాలీవుడ్‌లో మెహరీన్ చక్కటి అవకాశాలను అందుకున్నది. మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్-2 లాంటి సినిమాలతో కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాలు చేసింది. నటిగా బిజీగా ఉన్న తరుణంలోనే హర్యానా ముఖ్యమంత్రి మనవడు భవ్య భిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరిని సర్‌ప్రైజ్ చేసింది. అయితే ఈ అనుబంధానికి కొద్ది రోజుల్లోనే ముగింపు పడింది. మనస్పర్థలతో ఇద్దరు విడిపోయారు. తిరిగి సినీ కెరీర్‌పై దృష్టిపెట్టిన మెహరీన్ ప్రస్తుతం వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటిస్తున్న ‘ఎఫ్-3’తో ఈ వేసవిలో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది.
ఆదివారం తన సినీ కెరీర్‌పై ఇన్ స్టాగ్రామ్ లో మెహరీన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. సినీ నటుల జీవితాలు అనిశ్చితితో కూడి ఉంటాయని, ఇండస్ట్రీలో భవిష్యత్తుపై ఏ మాత్రం భరోసా ఉండదని పేర్కొన్నది. కెరీర్ మొత్తంఎత్తుపల్లాలతో సాగుతుంటుందని, కొన్నిసార్లు శూన్యం ఆవరించి ఏం చేయాలో తెలియని అయోమయం చుట్టుముడుతుందని చెప్పింది. ‘గొప్ప విజయం వచ్చిందని సంతోషపడేలోపు అపజయం ఎదురై బాధపెడుతుంది. క్రమబద్దంగా లేని షెడ్యూల్స్ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుంటాయి. కాలంతో సంబంధం లేకుండా సినిమాల కోసం నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు పనిచేయాల్సి ఉంటుంది. ఆకలితో అలమటించాల్సివస్తుంది. కుటుంబానికి, స్నేహితులకు రోజుల పాటు దూరంగా ఉండాల్సివస్తుంది. ఓ మంచి సినిమా కోసం ఈ కష్టాలన్నీ ఇష్టంగా భరిస్తూ ముందుకు సాగాల్సిందే’ అని పేర్కొన్నది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎఫ్-3’ చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాలో మెహరీన్ తో పాటు తమన్నా, సోనాల్ చౌహౌన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.