తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mansoor Ali Khan: ‘హీరోయిన్లతో పార్టీలు.. రూ.వేలకోట్లు’: చిరంజీవిపై నోరుపారేసుకున్న మన్సూర్

Mansoor Ali Khan: ‘హీరోయిన్లతో పార్టీలు.. రూ.వేలకోట్లు’: చిరంజీవిపై నోరుపారేసుకున్న మన్సూర్

28 November 2023, 19:55 IST

google News
    • Mansoor Ali Khan: మెగాస్టార్ చిరంజీవిపై తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్రిషకు మద్దతుగా మాట్లాడిన చిరూపై నోరు పారేసుకున్నారు.
మన్సూర్ అలీ ఖాన్ - చిరంజీవి
మన్సూర్ అలీ ఖాన్ - చిరంజీవి

మన్సూర్ అలీ ఖాన్ - చిరంజీవి

Mansoor Ali Khan: హీరోయిన్ త్రిష - తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం త్రిషపై అసభ్యకరమైన కామెంట్లు చేసి మరోసారి తన నోటి దురుసు ప్రదర్శించారు మన్సూర్. దీనికి త్రిష కూడా గట్టిగా బదులిచ్చారు. దీంతో ఆమెకు క్షమాపణ చెప్పినట్టే చెప్పి మళ్లీ యూటర్న్ తీసుకున్నారు మన్సూర్. ఈ విషయంలో త్రిషకు మద్దతు తెలిపిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మన్సూర్.

లియో చిత్రంలో త్రిష హీరోయిన్‍గా నటించగా.. మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్ర చేశారు. ఆ సినిమాలో త్రిషతో తనకు ఓ సీన్ ఉండాల్సిందంటూ అభ్యంతర కామెంట్లు చేశారు మన్సూర్. దీనిపై పెద్ద దుమారం రేగింది. త్రిషకు మన్సూర్ క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత కూడా తన నోటి దురుసు కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో త్రిషకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మద్దతునిచ్చారు. మన్సూర్ అలీ ఖాన్ లాంటి వక్రబుద్ధి ఉన్న వారిని దూరంగా పెట్టాలని అన్నారు. అయితే, తాజాగా చిరంజీవిపై మన్సూర్ అలీ ఖాన్ నోరుపారేసుకున్నారు.

తనతో గతంలో నటించిన అలనాటి హీరోయిన్లకు చిరంజీవి గెట్ టూ గెదర్‌లా పార్టీ ఇస్తుంటారు. ఈ విషయంపైనా మన్సూర్ కామెంట్లు చేశారు. అలాగే, రాజకీయాల్లో చిరంజీవి వేల కోట్లు వెనకేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ప్రతీ సంవత్సరం పాత హీరోయిన్లకు ఆయన పార్టీ ఇస్తారు. నేను కూడా గతంలో ఆయనతో నటించాను. కానీ నన్ను ఆయన ఎప్పుడూ ఆహ్వానించలేదు. ఆయన కేవలం అప్పటి హీరోయిన్లనే పిలుస్తారు” అని మన్సూర్ అన్నారు. ఇదంతా అని.. అది ఆయన వ్యక్తిగతమని చెప్పారు. త్రిష విషయంలో స్పందించే ముందు చిరంజీవి కనీసం తనకు ఫోన్ చేయాల్సిందని మన్సూర్ అన్నారు.

“కనీసం చిరంజీవి నాకు ఫోన్ చేయాల్సింది. మన్సూర్ ఎలా జరిగింది అని ఆయన నన్ను అడాగాల్సింది” అని మన్సూర్ అన్నారు. గతంలో రాజకీయ పార్టీ పెట్టి, దాన్ని వేరే వాళ్లకు ఇచ్చి చిరంజీవి రూ.వేలకోట్లు సంపాదించారని మన్సూర్ అలీ ఖాన్ ఆరోపించారు. చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా రాజకీయాల్లో బాగా సంపాదిస్తున్నారనేలా కామెంట్లు చేశారు.

ఇక, తాను త్రిష, చిరంజీవి, కుష్బూపై పరువు నష్టం దావా వేస్తానని కూడా మన్సూర్ ఇటీవల చెప్పారు. మొత్తంగా మన్సూర్ - త్రిష వివాదం నానాటికీ ముదురుతూనే ఉంది. గతంలోనూ కొందరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మన్సూర్ అలీ ఖాన్.

తదుపరి వ్యాసం