Manjima Mohan Gautham Karthik Wedding: పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న కోలీవుడ్ లవ్ బర్డ్స్
24 November 2022, 11:02 IST
Manjima Mohan Gautham Karthik Wedding: కోలీవుడ్ ప్రేమజంట గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్ పెళ్లికి ముహూర్తం ఫిక్సయింది. ఈ జంట పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగనుందంటే...
గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్
Manjima Mohan Gautham Karthik Wedding: కోలీవుడ్ లవ్ బర్డ్స్ గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్ పెళ్లికి ముహూర్తం కుదిరింది. నవంబర్ 28న చెన్నైలో ఈ జంట వివాహం జరుగనుంది. తమ పెళ్లి తేదీని బుధవారం అధికారంగా వెల్లడించారు గౌతమ్, మంజిమా. మూడేళ్లుగా గౌతమ్ కార్తిక్‌తో ప్రేమలో ఉంది మంజిమా. 2019లో వీరిద్దరు కలిసి దేవరట్టం అనే సినిమా చేశారు. ఆ సినిమా చిత్రీకరణలో గౌతమ్, మంజిమా ప్రేమలో పడ్డారు.
అయితే చాలా కాలం పాటు తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచిన గౌతమ్, మంజిమా ఇటీవలే వెల్లడించారు. మంజిమాతో లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు గౌతమ్ కార్తిక్.
ఫ్రెండ్‌షిప్‌తో తమ ప్రేమ మొదలైందని తెలిపాడు. గత మూడేళ్లుగా కష్టసుఖాల్లో మంజిమా తన వెన్నంటి నిలిచిందని, కఠిన పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేసేలా తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పాడు. మంజిమా తన పక్కన ఉంటే ఏ అవరోధానైన్నా ఎదుర్కోగలననే నమ్మకం ఉందని అన్నాడు గౌతమ్ కార్తిక్.
అతడి పోస్ట్‌కు ఎమోషనల్‌గా మంజిమా మోహన్ రియాక్ట్ అయ్యింది. ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పాత ఫొటోలను డిలీట్ చేసిన ఆమె గౌతమ్‌తో కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మంజిమా మోహన్.
బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. మరోవైపు అలనాటి అగ్ర హీరో కార్తిక్ తనయుడిగా గౌతమ్ కార్తిక్... మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన కడలి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం తమిళంలో శింబుతో ఓ సినిమా చేస్తున్నాడు.