Lust Stories 2 Review: లస్ట్ స్టోరీస్ -2 రివ్యూ - తమన్నా, విజయ్ వర్మ బోల్డ్ సిరీస్ ఎలా ఉందంటే?
30 June 2023, 13:19 IST
Lust Stories 2 Review: తమన్నా, విజయ్ వర్మ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీ సిరీస్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందంటే...
లస్ట్ స్టోరీస్ 2
Lust Stories 2 Review: బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన ఆంథాలజీ సిరీస్‌లలో 2018లో రిలీజైన లస్ట్ స్టోరీస్ ఎక్కువగా పాపులరైంది. తాజాగా ఈ ఆంథాలజీ సిరీస్‌కు కొనసాగింపుగా లస్ట్ స్టోరీస్ -2 తెరకెక్కింది. తమన్నా (Tamannaah), విజయ్ వర్మ(Vijay varma), కాజోల్, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించారు. నాలుగు కథల సమాహారంగా తెరకెక్కిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. రొమాంటిక్ అంశాలతో తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందంటే…
పెళ్లికి ముందే సెక్స్...
వేద తో (మృణాల్ ఠాకూర్), అర్జున్ (అంగద్‌బేడీ) పెళ్లి ఫిక్సవుతుంది. కుటుంబసభ్యులు పెళ్లి ఏర్పాట్లలో ఉంటారు. పెళ్లికి ముందు శృంగార అనుభవం ఉంటేనే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని వేద బామ్మ (నీనా గుప్తా) సలహా ఇస్తుంది. ఆ సలహా కాబోయే జంట జీవితంలో ఎలాంటి కల్లోలాన్ని రేపిందన్నదే ఈ కథలో చూపించారు.
మోడ్రన్ కల్చర్‌తో ప్రభావితమైన నేటితరం యువత పెళ్లికి ముందే కొన్ని సార్లు ఎలా హద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు?ఈ క్రమంలో వారికి ఎదురయ్యే పరిణామాలకు రొమాంటిక్ టచ్ ఇస్తూ దర్శకుడు ఆర్ బాల్కి ఈ ఎపిసోడ్‌ను తెరకెక్కించారు. కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తాం. పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా? అంటూ ఈ ఎపిసోడ్‌లోని డైలాగ్ టీజర్స్, ట్రైలర్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. కానీ ఆ డైలాగ్‌లో ఉన్న క్యూరియాసిటీ ఎపిసోడ్‌లో మిస్సయింది. ఈ ఏపిసోడ్‌లో నీనా గుప్తా ఎక్కువగా హైలైట్ అయ్యింది. మృణాల్ ఠాకూర్ గ్లామర్‌తో ఈ సిరీస్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
సీక్రెట్ రొమాన్స్…
ఇషిత (తిలోత్తమా షోమ్) ముంబయిలో ఒంటరిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వస్తుంది. ఆ సమయంలో ఆమె బెడ్ రూమ్‌లో పనిమనిషి సీమ ఆమె భర్త శృంగారంలో చేస్తుంటారు. వారి రొమాన్స్‌ను సీక్రెట్‌గా చూస్తుంది ఇషిత. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ పనిమనిషికి ఇషిత వార్నింగ్ ఇచ్చిందా? ఆ తర్వాత ఏమైందన్నది ఈ సిరీస్ కథ.
ముంబయి మురికివాడల కథ...
ముంబయి మురికివాడల జీవితాలతో పాటు సమాజంలో ఒంటరి మహిళలకు ఎదురయ్యే పరిస్థితులను డిఫరెంట్ యాంగిల్‌లో బోల్డ్‌గా ఈ సిరీస్‌లో ప్రజెంట్ చేశారు దర్శకురాలు కొంకణాసేన్ శర్మ. ఈ ఎపిసోడ్‌లో తిలోత్తమ షోమ్, అమృతా సుభాష్ యాక్టింగ్ బాగుంది.
మాజీ ప్రేయసి మళ్లీ కనిపిస్తే...
విజయ్ చౌహాన్ (విజయ్ వర్మ) ఓ ఉమెనైజర్. డబ్బు, హోదా కోసం స్నేహితురాలు అనును పెళ్లిచేసుకుంటాడు. పెళ్లి తర్వాత కూడా ఎఫైర్స్ కొనసాగిస్తుంటాడు. ఓ ఊరిలో అతడి కారు బ్రేక్‌డౌన్ అవుతుంది. అక్కడ అనుకోకుండా పదేళ్ల క్రితం అతడికి దూరమైన మాజీ ప్రియురాలు శాంతి (తమన్నా) కనిపిస్తుంది. ఆమెను అక్కడ చూసి విజయ్ చౌహాన్ ఎలా ఫీలయ్యాడు? అతడికి దూరంగా శాంతి వెళ్లిపోవడానికి కారణం ఏమిటన్నది ఈ ఎపిసోడ్ కథ.
ఈ ఎపిసోడ్‌లో కథ కంటే తమన్నా, విజయ్ వర్మ కెమిస్ట్రీ మీదనే ఫోకస్ చేశాడు దర్శకుడు సుజయ్ ఘోష్. వారి లిప్‌లాక్ సీన్ ఆకట్టుకుంటుంది. తమన్నా గ్లామర్‌ను ఎక్కువగా హైలైట్ చేస్తూ చివరలో ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. అదొక్కటి సర్‌ప్రైజ్ చేస్తుంది.
సంపన్నకుటుంబం కథ…
చందా (కాజోల్) వైవాహిక జీవితం అనేక సమస్యలతో సాగుతుంది.మరోవైపు ఆమె భర్త ఇంటి పనిమనిషిపై కన్నేస్తాడు. భర్తకు బుద్ది చెప్పాలనే ప్రయత్నంలో చందా ఎలా ఇబ్బందుల్లో పడిందన్నది ఈ కథలో సాగుతుంది. సమాజంలో ఉన్నత హోదాల్లో చెలమణి అయ్యే వారి జీవితాల్లోని మరో కోణాన్ని ఈ కథలో చూపించారు డైరెక్టర్. ఈ ఎపిసోడ్‌కు కాజోల్ యాక్టింగ్ ప్లస్సయింది.
Lust Stories 2 Review -రొమాన్స్ మాత్రమే...
లస్ట్ స్టోరీస్ లోని నాలుగు కథల్లో పాత్రలు, కథాంశాలు వేరయినా కామన్ పాయింట్ మాత్రం శృంగారం మాత్రమే. సమాజంలో శృంగార పరంగా ఎదురయ్యే సమస్యల్ని, సంఘర్షణను బయటపెట్టడానికి చాలా మంది ఇష్టపడరు.ఆ అంశాలను బోల్డ్‌గా నాలుగు కథలో లస్ట్ స్టోరీస్ 2లో చెప్పే ప్రయత్నం చేశారు.
కానీ ఏ ఒక్క ఎపిసోడ్ నాచురల్‌గా లేదు. ప్రతి కథలో బలవంతంగా రొమాన్స్‌ను ఇరికించి బోల్డ్‌నెస్‌ను అద్దిన ఫీలింగ్ కలుగుతుంది. గ్లామర్, రొమాంటిక్ డైలాగ్స్, కిస్ సీన్స్ పై పెట్టిన దృష్టి కాస్తంతైనా కథపై పెడితే బాగుండేది. ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్ కాదని ముందుగానే యూనిట్ హింట్ ఇచ్చారు. దానిని ఫాలో కావడం బెటర్.
రేటింగ్ : 2.5 /5