Krishnam raju:తాండ్రపాపారాయుడిగా గర్జించి - భక్తకన్నప్పగా అలరించి - వైవిధ్యతకు కేరాఫ్ అడ్రస్ కృష్ణంరాజు
11 September 2022, 7:58 IST
Krishnam raju: టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. కృష్ణంరాజు మరణంతో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. తెలుగు తెరపై విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కృష్ణంరాజు దాదాపు రెండు వందల సినిమాల్లో నటించాడు.
ప్రభాస్, కృష్ణంరాజు
Krishnam raju: తెలుగు తెరపై రౌద్రరసంతో కూడిన విలక్షణ పాత్రలకు కృష్ణంరాజు పెట్టింది పేరు. గంభీరమైన కంఠం, నిండైన విగ్రహంతో పలు విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు.మాస్, చారిత్రకం, పౌరాణికం భిన్న కథాంశాలతో సినిమాలు చేశారు. 1970 80 దశకంలో కృష్ణ, శోభన్ బాబులతో పాటుగా టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకరిగా కృష్ణంరాజు పేరుతెచ్చుకున్నాడు. అతడి మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.
హీరోగా ప్రారంభం విలన్ గా గుర్తింపు...
1966 లో చిలకా గోరింక సినిమాతో హీరోగా కృష్ణంరాజు సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఈసినిమా పరాజయం పాలవ్వడంతో ఆయన కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. హీరో నుంచి విలన్ గా మారాడు కృష్ణంరాజు. అవేకళ్లు సినిమాలో సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించాడు.. ఈ క్యారెక్టర్ కు మంచి పేరు రావడంతో దాదాపు ముప్పై సినిమాల్లో విలన్ గా నటించాడు. విలన్ పాత్రల ద్వారా మంచి పేరు తెచ్చుకొని తిరిగి ఇంటి దొంగలు సినిమాతో హీరోగా మారాడు. హీరో గా ఎంట్రీ ఇచ్చి విలన్ గా మారి మరలా హీరోగా మారిన కొద్ది మందే ఉన్నారు. వారిలో కృష్ణంరాజు ఒకరు.
భక్త కన్నప్ప తో రికార్డులు
కృష్ణంరాజు హీరోగా బాపు దర్శకత్వంలో రూపొందిన భక్త కన్నప్ప చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. శివపురాణంలో భక్త కన్నప్ప కథను తీసుకొని చేసిన ఈ సినిమాలో కన్నప్ప పాత్రలో కృష్ణంరాజు అసమాన నటనను కనబరిచాడు. ఆ రోజుల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమాగా భక్త కన్నప్ప చర్చనీయాంశంగా మారింది.
ఆ తర్వాత యాక్షన్ పంథాకు భిన్నంగా అమరదీపం సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యాడు. కటకటాల రుద్రయ్య, మనవూరి పాండవులు లాంటి సినిమాలతో అగ్ర హీరోగా మారిపోయాడు. కృష్ణంరాజు ద్విపాత్రాభినయంలో నటించిన బొబ్బిలి బ్రహ్మన్న చిత్రం ఆ రోజుల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. పర్పంటేజ్ విధానాన్ని రద్ధు చేస్తూ శ్లాబ్ సిస్టమ్ లో రిలీజ్ చేసిన మొదటి సినిమా ఇదే.
హిస్టారికల్ కథాంశంతో
మొఘల్ అజం, టెన్ కమాండ్ మెంట్స్ సినిమాల స్ఫూర్తితో హిస్టారికల్ కథాంశంతో కృష్ణంరాజు చేసిన తాండ్ర పాపారాయుడు సినిమా టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచింది. భారీబడ్జెట్ కారణంగా కమర్షియల్ గా మాత్రం కృష్ణంరాజుకు డబ్బులు తెచ్చిపెట్టలేదు. పైరసీ బారిన పడిన తొలి సినిమాల్లో ఒకటిగా తాండ్రపాపారాయుడు నిలిచింది. యమధర్మరాజు సినిమాతో నిర్మాతగా తీవ్రంగా నష్టపోయారు. ఈ సినిమాతో హీరో పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కృష్ణంరాజు మారిపోయారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో
సెకండ్ ఇన్నింగ్స్ లో గ్యాంగ్ మాస్టర్, పల్నాటి పౌరుషం, బావ బావమరిది, జైలర్ గారి అబ్బాయి మొదలుకొని ఈ ఏడాది విడుదలైన రాధేశ్యామ్ వరకు పలు సినిమాల్లో విలక్షణ పాత్రలతో మెప్పించారు.
కృష్ణంరాజు నటవారసుడిగా ప్రభాస్
కృష్ణంరాజుకు కుమారులు లేరు. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కృష్ణంరాజు నట వారసుడిగా ఆయన సోదరుడి కుమారుడు ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నాడు. కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి రెబెల్, బిల్లాతో పాటు రాధేశ్యామ్ సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు చివరగా నటించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాకు కృష్ణంరాజు కుమార్తె ప్రసీద ఓ నిర్మాతగా వ్యవహరించింది.