Krishna mukunda murari serial february 9th episode: మురారితో బిడ్డని కనాలని ఆశపడిన ముకుంద.. కృష్ణ ముందు మరో ప్రమాద ఘంటిక
09 February 2024, 7:26 IST
- Krishna mukunda murari serial february 9th episode: భవానీ అనుమానిస్తున్నట్టుగా నిజంగానే ముకుంద మారలేదా అని కృష్ణ డౌట్ పడుతుంది. ఆదర్శ్, ముకుందని సరిగా పరిశీలించాలని మురారితో చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 9వ తేదీ ఎపిసోడ్
Krishna mukunda murari serial february 9th episode: అందరూ ముకుంద మారిందని నమ్ముతారు కానీ భవానీ మాత్రం నమ్మదు. ఇదే విషయం గురించి కృష్ణ కూడ ఆలోచిస్తుంది. నిజంగానే ముకుంద మారిందా అని అనుమానపడుతుంది. ఆ అనుమానం తీర్చుకోవడం కోసం ఆదర్శ్, ముకుందని బయటకి రమ్మని పిలుస్తారు. ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో ఏముందంటే.. రెండు జంటలు గుడికి వెళతారు. ఆ తర్వాత రెస్టారెంట్ కి వెళతారు. ఆదర్శ్ చేతికి దెబ్బ తగలడంతో ఫుడ్ తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. మురారి అది చూసి తాను తినిపిస్తానని అంటాడు. అయితే కృష్ణ ముకుంద ఫీల్ అవుతుంది తను ఉంది కదాచూసుకుంటుందని అంటుంది. ముకుంద ఆదర్శ్ కి తినిపించమని చెప్తుంది. కానీ ముకుంద మాత్రం ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది.
ముకుంద మీద కృష్ణ అనుమానం
ముకుంద ఆదర్శ్ నిజంగా సరిగా ఉంటున్నారా?అని కృష్ణ మురారిని అడుగుతుంది. సడెన్ గా ఆ అనుమానం ఎందుకు వచ్చిందని అంటాడు. నాకు కాదు పెద్దత్తయ్యకి వచ్చిన అనుమానం నిజమేనని నా అనుమానం లేకపోతే ఊరికే పెద్దత్తయ్యకి అంత అనుమానం ఎలా వస్తుందని అడుగుతుంది. నిజమే కానీ మనకి అలా అనిపించడం లేదుగా. మనం సరిగా పరిశీలించడం లేదేమో ఇప్పుడు బయటకి వెళ్తున్నాం కదా అక్కడ అబ్జర్వ్ చేద్దాం క్లారిటీ వస్తుందని అంటుంది.
రెండు జంటలు బయటకి బయల్దేరతాయి. కారులో ముకుంద, ఆదర్శ్ సైలెంట్ గా ఉండటం చూసి కృష్ణ డౌట్ పడుతుంది. ఇద్దరూ ఏ సంబంధం లేనట్టు ఎవరికి వాళ్ళు ఉన్నారు. పెద్దత్తయ్య అనుమానం నిజమేనా? ముకుంద మారలేదా? మరి ఆదర్శ్ కి ఏమైంది తనైనా మాట్లాడొచ్చు కదా అనుకుంటుంది. కారు ఇంటికి పోనివ్వండి సరదాగా మాట్లాడుకోకుండా మూతులు ముడుచుకుని కూర్చున్నారని కృష్ణ ఆదర్శ్ వాళ్ళని అంటుంది. కృష్ణ సైగ చేయడంతో మురారి కూడా అవును ఏం మాట్లాడరు ఏంటని అంటాడు. మనం ఏదో పార్టీ అని గోల చేయడం వల్ల బలవంతంగా బయటకి వచ్చారు మనతో రావడం ఇష్టం లేదని అర్థం అయ్యిందని అంటుంది. అదేం లేదని ఆదర్శ్ చెప్తాడు. ఏదో ఒకటి మ్యానేజ్ చేయాలి లేదంటే డౌట్ వస్తుందని ముకుంద మనసులో అనుకుంటుంది.
మురారి నేను ఒకటేనన్న ముకుంద
ఏసీపీ సర్ క్యాబ్ డ్రైవర్ అయినట్టు మీరేదో క్యాబ్ షేర్ చేసుకున్నట్టు కూర్చున్నారని కౌంటర్ వేస్తుంది. కారులో పాత పాట ప్లే అవుతూ ఉంటుంది. మాట్లాడటానికి ఏం లేదు నా ఫేవరెట్ సాంగ్ వస్తుంటే వింటున్నానని ముకుంద కవర్ చేస్తుంది. యవ్వనంలో ఉన్న రెండు జంటలు షికారుకి వెళ్తుంటే ఎవరైనా ఈ పాత పెట్టుకుంటారా? మంచి ఊపున్న పాట పెట్టుకోవాలని చెప్పి సాంగ్ మారుస్తుంది. మురారి వెంటనే పాట మార్చేస్తాడు. మీకు పాట ఇష్టం అయితే ఒక్కరే ఉన్నప్పుడు వినమని చెప్తుంది. పర్లేదు కృష్ణ ఆ పాట అంటే నాకు ఇష్టం. ఆది మీరు ఏమంటారు ఆ సాంగ్ బాగుంటుంది కదా అని అడుగుతుంది. నువ్వు అన్న మాట కాదనలేను కానీ ఇప్పుడు ఆ పాట కాదు కృష్ణ పెట్టిన పాట కరెక్ట్ అంటాడు. అంటే మీరు కృష్ణ ఒక పార్టీ నేను మురారి ఒక పార్టీ మేమిద్దరం ఒకటని అనేసరికి కృష్ణ ఫేస్ మాడిపోతుంది.
సాంగ్స్ లో మా ఇద్దరి టేస్ట్ ఒకటే అంటున్నానని కవర్ చేస్తుంది. గుడికి వస్తారు. ముకుంద ఆదర్శ్ ముందు వెళ్లిపోతారు. ఏసీపీ సర్ ఏం జరుగుతుంది. ముకుంద ఏంటి మీరిద్దరూ ఒకటి అంటుందని కృష్ణ అడుగుతుంది. తను పాట గురించి అన్నది ముకుంద మారిపోయింది తనకు నామీద అప్పుడున్న ఫీలింగ్స్ ఇప్పుడు లేవని చెప్తాడు. నేను అలా అనడం లేదు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఒకరికి నచ్చిన మరొకరు నచ్చిందని చెప్పవచ్చు కదా ఇలాంటి బేధాభిప్రాయాలు ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుందని చెప్తుంది. ఇష్టాలు వేరుగా ఉన్నంత మాత్రాన అలా అనుకోవడం కరెక్ట్ కాదని అంటాడు.
మురారి బిడ్డకి తల్లి కావాలని ఆశపడుతున్న ముకుంద
ముకుంద కృష్ణ వాళ్ళు రావడం లేదు ఏంటని ఆగుతుంది. కావాలని రాలేదేమో మన ఇద్దరికీ ఏకాంతం కలిగించడం కోసమని ఆదర్శ్ అంటాడు. కృష్ణ వాళ్ళు మన కోసం చాలా ఆలోచిస్తున్నారు. మన ఇద్దరిని ఒకటి చేయడం కోసం చాలా కష్టపడుతున్నారు కానీ మనమే ఎందుకో దగ్గర కాలేకపోతున్నాం. నేను నిన్నేమి తప్పు పట్టడం లేదు ఇప్పుడు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావ్ లేకపోతే కృష్ణ వాళ్ళని కశ్మీర్ ఎందుకు పంపిస్తావ్. అలాగని నేను రాగానే నాతో కలిసిపోవాలని ఏం లేదు కదా దూరం దగ్గర అవడానికి కాస్త టైమ్ పడుతుంది నో ప్రాబ్లం నేను నీకోసం వెయిట్ చేస్తానని అంటాడు. ఇక కృష్ణ వాళ్ళు కూడా వస్తారు.
రెండు జంటలు దేవుడిని దర్శించుకోవడానికి వెళతారు. పూజారి వాళ్ళ క్షేమసమాచారాలు అడుగుతాడు. ఆదర్శ్ ని చూసి ముకుంద జీవితంలోకి సంతోషం వచ్చినట్టేనని పంతులు అంటాడు. నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండమని ఆదర్శ్ వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దీంతో ఇద్దరూ మొహాలు చూసుకుంటారు. కృష్ణని కూడా పిల్లాపాపలతో కలిసి రావాలని చెప్తాడు. మా ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే మురారి బిడ్డకు తల్లి కాగలం. అయ్యో ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. కృష్ణకి నావల్ల అన్యాయం జరగకూడదు. కలలో కూడా నాకు ఇలాంటి ఆలోచనలు రాకుండా కృష్ణకి అన్యాయం జరగకుండా చూడమని ముకుంద వెంటనే మనసులోనే అమ్మవారిని వేడుకుంటుంది.
ఊడిపడిన గంట.. మరో ప్రమాద ఘంటిక
ఇరు జంటలు ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగిస్తే మనసులో కోరిక తీరుతుందని పంతులు చెప్తాడు. దీంతో కృష్ణ, ముకుంద దీపం వెలిగించి దణ్ణం పెట్టుకుంటారు. నా మనసు చంపుకుని బతకలేను. అలా అని కృష్ణకి అన్యాయం చేయలేను. ఏ దారిలోనూ వెళ్లలేను నువ్వే ఒక దారి చూపించమని ముకుంద మనసులో అనుకుంటుంది. కొన్ని రోజులుగా పూజలో అపశృతి జరుగుతుంది. అది నా జీవితంలో జరిగే నష్టానికి సూచనలు కాదు కదా అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నా ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ఎన్నో బాధలు కష్టాలు అనుభవించిన తర్వాత వచ్చిన సంతోషం ఇది. మళ్ళీ గతాన్ని తీసుకురావద్దు భరించే శక్తి తనకి లేదని కృష్ణ అనుకుంటుంది. అప్పుడే ధ్వజ స్తంభం నుంచి గంట ఊదీ కృష్ణ వెనుక పడి మురారి కాళ్ళ ముందు ఆగిపోతుంది.
ఈ ఘటనతో కృష్ణ మరింత కంగారుపడుతుంది. పంతులు వచ్చి ఏమైందని అడుగుతాడు. గంట ఊడి పడిందని అంటే అది మనకే కాదు దేవాలయానికి కీడు అనేసరికి కృష్ణ గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటుంది. ఇది ఏ అరిష్టానికి దారి తీస్తుందోనని కృష్ణ మరింత భయపడుతుంది. జరిగేది మన చేతుల్లో లేదు ఏం జరిగినా కీడు అది దేవత చేతిలోనే ఉంటుందని అంటాడు. నా కాపురం బాగుండాలని కోరుకున్న ప్రతిసారి ఏదో ఒక అపశృతి జరుగుతుంది. ఇంకా ఏం చిక్కులు నాకోసం దాచి ఉంచావని కృష్ణ బాధ పడుతుంది. ఏం కాదని మురారి కృష్ణకి సర్ది చెప్పడానికి చూస్తాడు.
ఆదర్శ్ చేతికి గాయం పట్టించుకోని ముకుంద
నా కోరికలు తీరవా ఊహించనిది ఏదో జరగబోతుందా అని ముకుంద కూడా టెన్షన్ పడుతుంది. కృష్ణ బాధపడుతూ ఉంటే ఆదర్శ్ వచ్చి తనకి సర్ది చెప్తాడు. కొబ్బరి కాయ తీసుకుని ప్రసాదం కోసం కొట్టబోతుంటే తన చెయ్యి నలిగిపోతుంది. ఆదర్శ్ బాధతో విలవిలాడుతుంటే ముకుంద మాత్రం ఏం పట్టనట్టు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ ముకుందని పిలిచి ఆదర్శ్ కి దెబ్బ తగిలిందని చెప్తుంది. ముకుంద ఆదర్శ్ కి బదులు మురారిని ఊహించుకుని వెంటనే తన చేతిని పట్టుకుంటుంది.