Krishna Mukunda Murari October 17th Episode: కృష్ణకు ఐ లవ్ యూ చెప్పిన మురారి - ప్రభాకర్‌కు అవమానం
17 October 2023, 10:14 IST
Krishna Mukunda Murari October 17th Episode: భవానీ తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో కృష్ణ బాధపడుతుంది. కృష్ణకు మురారి దగ్గర నుంచి లెటర్ వస్తుంది. కృష్ణను ప్రేమిస్తోన్నట్లుగా ఆ లెటర్‌లో రాస్తాడు మురారి. ఆ తర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో ఏం జరిగిందంటే...
కృష్ణ ముకుంద మురారి సీరియల్
Krishna Mukunda Murari October 17th Episode: అగ్రిమెంట్ మ్యారేజీ విషయాన్ని దాచి మురారి, కృష్ణ తనను మోసం చేశారని భవానీ కోపగించుకుంటుంది. కృష్ణను ఇంట్లో నుంచి వెళ్లగొడుతుంది. కన్నీళ్లలో మునిగిపోయిన కృష్ణకు లెటర్ వస్తుంది. ఆ లెటర్ మురారి ఆమెకు రాస్తాడు.
కృష్ణకు మురారి లెటర్...
ప్రియాతిప్రియమైన నా తింగరి భార్య కృష్ణకు అంటూ లెటర్‌లోని ప్రారంభ అక్షరాలు చూసి కృష్ణ ఆనందపడుతుంది. తాను ఇంటికి దూరమవ్వడానికి కారణం ముకుంద అని లెటర్‌లో రాస్తాడు మురారి. ఒకప్పుడు ముకుందను ప్రేమించానని, కానీ అనుకోని పరిస్థితుల్లో ముకుందకు వేరొకరితో పెళ్లైయిందని, ఇప్పుడు నా మనసంతా నువ్వే నిండిపోయావని లెటర్‌లో రాస్తాడు మురారి. ఐ లవ్ యూ అని కృష్ణ పట్ల తనకు ఉన్న ప్రేమను లెటర్ ద్వారా బయటపెడతాడు. మురారి తనను ప్రేమిస్తున్నాడని తెలియగానే కృష్ణ ఆనందాన్ని పట్టలేకపోతుంది. ముకుంద మనసులో ఇంకా తాను ఉండటంతో నిన్ను నాకు దూరం చేయాలని అనుకుంటుందని మురారి బాధపడతాడు.
అందరికి దూరంగా...
నీతోనే నా జీవితం అనుకున్నానని, ఇంట్లో ఉంటే సాధ్యం కాదనిపిస్తోందని, అందుకే అందరికి దూరంగా వెళ్లిపోదామని లెటర్ ద్వారా తన మనసులో ఉన్న మాటను బయటపెడతాడు మురారి . నీకు ఇష్టమైతే మనం రెగ్యులర్‌గా కలిసే కాఫీ డే దగ్గర వెయిట్ చేస్తూ ఉంటానని లెటర్‌లో రాస్తాడు మురారి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మురారిని కలవడానికి వెళ్లాలని కృష్ణ బయలుదేరబోతుంది.
కృష్ణ గంతులు...
భవానీ ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో కృష్ణ బాధ పడుతుంటుందని భావిస్తుంది రేవతి. కృష్ణను ఓదార్చడానికి వస్తుంది. కానీ కృష్ణ మాత్రం ఆనందంతో గంతులు వేస్తూ కనిపిస్తుంది. నేను చాలా అదృష్టవంతురాలినని పొంగిపోతుంది. మురారి రాసిన లెటర్‌ను రేవతికి చూపిస్తుంది. ఏసీపీ సార్ మనసులో నేను ఉన్నానని మీరు చెప్పినా నా కోసం అబద్ధం చెప్పారని ఇన్నాళ్లు భ్రమపడ్డానని, కానీ ఈ రోజు అది నిజం అని తేలిందని సంతోషపడుతుంది కృష్ణ. మురారి రాసిన లెటర్ చూసి...ఇక నువ్వు ఇళ్లు విడిచి ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదని, భవానీకి మీ ప్రేమ విషయం చెబితే తనే అర్థం చేసుకుంటుందని అంటుంది.
ముకుందకు షాక్...
కృష్ణను భవానీ ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో ముకుంద ఆనందంలో మునిగిపోతుంది. తన ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లుగా జరగడంతో హ్యాఫీగా ఫీలవుతుంది. కృష్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో రేవతి దుఃఖంలో మునిగిపోతుందని ముకుంద భావిస్తుంది. కానీ రేవతి మాత్రం చాలా హ్యాఫీగా కనిపించడంతో ముకుంద షాక్ అవుతుంది. తన అనందానికి కారణం ఏమిటో నీకే తెలుస్తుందని ముకుందతో చెప్పి ఆమెను ఏడిపిస్తుంది రేవతి. కృష్ణ ను ఇంటి నుంచి పంపించడంలో అలేఖ్య పాత్ర కూడా ఉండటంతో మధుకర్ కోపగించుకుంటాడు. ఆమె చెంపలు వాయిస్తాడు. ఇంకోసారి ముకుందతో కనబడితే తాటతీస్తా అంటూ వార్నింగ్ ఇస్తాడు.
ఆరిపోయిన దీపాలు...
తన కొడుకు, కోడలిని దేవుడు కలిపాడంటూ సంతోషపడుతుంది రేవతి. కృష్ణకు మురారి రాసిన లవ్ లెటర్ సంగతి మధుకర్‌తో చెప్పి ఆనందపడుతుంది రేవతి. పూజ చేస్తోండగా దేవుడి దీపాలు ఆరిపోవడంతో రేవతి కంగారు పడుతుంది.
భవానీ కోపం...
మురారి తనను మోసం చేయడం భవానీ సహించలేకపోతుంది. రేవతి ఆమెకు కాఫీ తీసుకొని వస్తుంది. కానీ రేవతితో మాట్లాడటానికి భవానీ ఇష్టపడదు. మనుషులు అంటేనే అసహ్యం వేస్తుందని అంటుంది. అప్పుడే ప్రభాకర్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు.
రేవతి రిక్వెస్ట్...
కృష్ణ కోసం ఇళ్లంతా వెతుకుతాడు ప్రభాకర్. తన కూతురు ఎక్కడ కనిపించకపోవడంతో కంగారు పడుతాడు. కృష్ణ, మురారి ఎక్కడికి వెళ్లారని ఎవరిని అడిగినా సమాధానం చెప్పరు. మురారి గదిలోకి ప్రభాకర్ వెళ్లబోతాడు. అతడిని ముకుంద ఆపేస్తుంది. అసలైన వాళ్లే లేనప్పుడు కొసరులకు మర్యాద ఇవ్వడం అవసరమా అని ప్రభాకర్‌తో అంటుంది. కృష్ణను మెడ పట్టుకొని బయటకు గెంటేశామని చెబుతుంది. . ముకుంద మాటలను భవానీ సమర్థిస్తుంది. ముకుంద చెప్పింది నిజమేనని అంటుంది.
ప్రభాకర్‌కు అవమానం...
మీరు ఇక్కడ అవమానాలు పడటం నాకు ఇష్టం లేదని, ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని ప్రభాకర్‌ను బతిమిలాడుతుంది రేవతి. నా బిడ్డను ఇంట్లో నుంచి వెళ్లగొడితే నోరు మూసుకొని ఎలా ఉంటానని ప్రభాకర్ అంటాడు. నీ కూతురు అసలు మా ఇంటి కోడలు కాదని, నువ్వు మాకు వియ్యంకుడికి కాదని ప్రభాకర్‌తో అంటుంది భవానీ. కృష్ణ ఎక్కడికి వెళ్లింది, ఈ ఇంటి కోడలు ఎందుకు కాదో చెప్పమని భవానీని నిలదీస్తాడు ప్రభాకర్. ప్రభాకర్‌ను డ్రైవర్ అంటూ అవమానిస్తుంది భవానీ. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ముగిసింది.