Karthikeya 2 Box Office Collection :100 కోట్ల క్లబ్‌లో కార్తికేయ..తెలుగు సినిమా విజయమని నిఖిల్ ఎమోషనల్
27 August 2022, 8:56 IST
- టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ 2 సినిమా వంద కోట్ల క్లబ్‌లో జాయిన్ అయింది. ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది. వంద కోట్ల క్లబ్‌లో చేరిన సందర్భంగా చిత్రబృందం కర్నూలులో విజయోత్సవ సభను ఏర్పాటు చేసింది.
నిఖిల్ ప్రసంగం
నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు నిరాజనాలు పడుతున్నారు. ఫలితంగా ఈ చిత్రం కొద్ది రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ సందర్భంగా చిత్రబృందం కర్నూలులో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భాజపా నేత టీజీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో మాట్లాడిన నిఖిల్ సినిమా విజయంపై ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
"బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారు. కార్తికేయ 2 హిందీలో డబ్ అయి ఉత్తరాదిన విడుదలవుతుందంటే నాకు భయమేసింది. నిఖిల్ ఏంటి బాలీవుడ్‌కు వెళ్లడమేంటని నాలాగే మీరూ అనుకున్నారు కదా. కానీ విడుదలయ్యాక పరిస్థితి మారింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా 1200 స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. ఇది కార్తికేయ 2 విజయం కాదు.. తెలుగు సినిమా విజయం. సినిమా అంటే బాక్సాఫీస్ నెంబర్లు కాదని, ఓ ఎమోషన్. మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నాకు రూ.100 కోట్లతో సమానం." అని నిఖిల్ ఎమోషనల్ అయ్యారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ 2 తో తనకు గుర్తుండిపోయే పాత్రగా నిలిచిందని స్పష్టం చేసింది. "2014లో నా స్నేహితురాలు నా ఫొటోలను ఆడిషన్‌కు పంపింది. అనుకోకుండా ఆ సినిమాకి ఎంపికయ్యాను. ఆ చిత్రమే ప్రేమమ్. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. 2017లో శతమానం భవతి సినిమాతో మళ్లీ నన్ను ఆదరించారు. వాటి తర్వాత నా సినిమా కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర కార్తికేయ 2 చిత్రంతో దక్కింది. ఇందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా" అని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది.
చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో నటించారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చారు. ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం పాన్ఇండియా రేంజ్‌లో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.