Kantara Satellite Rights: భారీ మొత్తానికి కాంతారా శాటిలైట్ హక్కులు కొనుగోలు చేసిన స్టార్ మా!
16 November 2022, 20:52 IST
- Kantara Satellite Rights: భారీ మొత్తానికి కాంతారా శాటిలైట్ హక్కులను స్టార్ మా కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కన్నడ మూవీ తెలుగులోనూ ప్రభంజనం సృష్టించడంతో టీవీ ప్రీమియర్ కోసం పెద్ద మొత్తమే చెల్లించాల్సి వచ్చింది.
కాంతారా మూవీ
Kantara Satellite Rights: కాంతారా.. కాంతారా.. కాంతారా.. సుమారు 50 రోజులుగా ఈ సినిమా గురించి జరిగినంత చర్చ మరే ఇతర సినిమాపై జరగలేదు. ఓ సాధారణ చిన్న కన్నడ సినిమాగా రిలీజై ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూవీ ఇది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.365 కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్తోంది.
థియేటర్లలో కలెక్షన్ల పరంపర కొనసాగుతుండటంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ను మేకర్స్ వాయిదా వేస్తూ వెళ్తున్నారు. నిజానికి నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. ఇప్పటికీ కన్నడ, తెలుగు, హిందీల్లో ఈ మూవీ కలెక్షన్లు తగ్గడం లేదు. దీంతో మరికొన్ని రోజులు వాయిదా వేయాలని నిర్ణయించారు. బహుశా ఈ నెల చివర్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
అయితే ఆలోపు శాటిలైట్ హక్కుల రూపంలోనూ కాంతారా రికార్డు సృష్టిస్తోంది. కాంతారా మూవీ తెలుగులోనూ ఇప్పటికే రూ.50 కోట్లకుపైగా వసూలు చేసింది. అటు హిందీలో సుమారు రూ.90 కోట్ల వరకూ వసూళ్లు వచ్చాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం స్టార్ మా రూ.4.5 కోట్లు చెల్లించాల్సి వచ్చినట్లు సమాచారం. ఇంత భారీ మొత్తం ఓ కన్నడ డబ్బింగ్ మూవీకి పెట్టడం విశేషమే.
ఈ మొత్తం ఆ ఛానెల్‌కు రావాలంటే టీవీ ప్రీమియర్ షోకు కనీసం 10 టీఆర్పీ రేటింగ్ అయినా తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. అయితే థియేటర్లలో ఇంతకాలం నడిచిన తర్వాత ఓటీటీలోకి వచ్చి, ఆ తర్వాత టీవీల్లోకి వచ్చే సమయానికి అంత క్రేజ్ ఉంటుందో లేదో అన్నది సందేహంగా మారింది. సాధారణంగా ఈ మధ్య కాలంలో థియేటర్లలో ఎక్కువ రోజులు నడిచిన సినిమాలకు అంతగా టీఆర్పీలు రావడం లేదు.
కేజీఎఫ్‌లాంటి భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించిన హోంబలె ఫిల్మ్స్ కేవలం రూ.16 కోట్లతో ఈ కాంతారా మూవీని తెరకెక్కించడం విశేషం. ఆ లెక్కన ఇప్పటికే ఈ సినిమాకు ఎన్నో రెట్ల లాభాలు వచ్చాయి. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన ఈ సినిమా.. ఇంతటి సంచలన విజయం సాధిస్తుందని మొదట్లో ఎవరూ ఊహించలేకపోయారు.
టాపిక్