Kangana Ranaut Review on Sita Ramam: సీతా రామం చిత్రంపై కంగనా ప్రశంసల వర్షం.. మృణాల్‌పై సంచలన వ్యాఖ్యలు
21 September 2022, 12:49 IST
- Kangana Praises Sita Ramam: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. సీతా రామం మూవీ చూసింది. దీంతో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో మృణాల్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయింది.
సీతా రామంపై కంగనా ప్రశంసలు
Kangana Ranaut Review on Sita Ramam: హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన చిత్రం సీతా రామం. ఈ సినిమా గత నెల 5వ తేదీన విడుదలై ప్రేక్షకుల మనన్నలను అందుకుంది. అంతేకాకుండా వసూళ్ల పరంగానూ అదిరిపోయే కలెక్షన్లతో ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రముఖులను సైతం ఆకర్షించింది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రశంసల వర్షం కురిపించింది. దర్శకుడితో పాటు ఇందులో హీరోయిన్‌గా చేసిన మృణాల్ ఠాకూర్‌ను కొనియాడింది.
"ఎట్టకేలకు సీతా రామం సినిమా చూశాను. అద్భుతమైన అనుభూతిని పొందిన నేను ఈ సినిమా గురించి తప్పకుండా చెప్పే తీరాలి. ఎపిక్ లవ్ స్టోరీ. అద్భుతమైన స్క్రీన్ ప్లే, డైరెక్షన్. హను రాఘవపూడికి అభినందనలు. అన్ని విభాగాల్లో పనితనం బాగుంది. ఈ సినిమాలో నటించిన నటీ, నటులందరూ అదిరిపోయేలా చేశారు." అని కంగానా తన ఇన్‌స్టా వేదికగా స్పందించింది.
మరో ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో మృణాల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. "ఇందులో నటించన వారంతా అద్బుతంగా చేశారు. అయితే నాకు మృణాల్ నటన ప్రత్యేకంగా నచ్చింది. ఆమె భావోద్వేగాలు, ప్రవర్తన, హుందాతనం ఇతర ఏ నటికి సాధ్యం కాదు. ఎంతో అద్భుతమైన క్యాస్టింగ్. నిజంగా క్వీన్ మాదిరిగా ఉంది. ఠాకూర్ సాబ్(మేడమ్) మీకు జిందాబాద్. ఇక్కడ మీ పాలన ప్రారంభమవుతుంది." అని కంగనా క్వీన్ ఎమోజీని కూడా ఈ పోస్టుకు జత చేసింది.
దుల్కర్ సల్మాన్ ఇందులో లెఫ్టినెంట్ రామ్ పాత్రను పోషించారు. దుల్కర్ సరసన మృణాల్ ఠాకూర్ సీతా మహాలక్ష్మీ పాత్రలో నటించింది. రష్మిక మందన్నా కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా.. వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకాలపై అశ్విని దత్ నిర్మించారు. సుమంత్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. దక్షిణాదిన సీతా రామం ఆగస్టు 5న విడుదల కాగా.. ఉత్తరాదిన మాత్రం సెప్టెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.