తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vikram Movie Review: విక్రమ్ మూవీ రివ్యూ.. యాక్షన్ లవర్స్ కు పండగే..

Vikram Movie Review: విక్రమ్ మూవీ రివ్యూ.. యాక్షన్ లవర్స్ కు పండగే..

HT Telugu Desk HT Telugu

03 June 2022, 13:49 IST

google News
  • Vikram Movie Review: దాదాపు నాలుగేళ్ల విరామం అనంత‌రం క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా న‌టించిన చిత్రం విక్ర‌మ్‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే....

విక్ర‌మ్‌
విక్ర‌మ్‌ (twitter)

విక్ర‌మ్‌

వైవిధ్య‌మైన క‌థాంశాల‌కు, ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల‌కు ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో చిరునామాగా నిలుస్తుంటారు క‌మ‌ల్‌హాస‌న్‌. ఆయ‌న సినిమా అంటేనే తెలుగు, త‌మిళం అనే భేదాలు లేకుండా అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంటుంది. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా తాను న‌మ్మిన సిద్ధాంతాల‌తోనే సినిమాలు చేస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు క‌మ‌ల్‌హాస‌న్‌.  

 విశ్వ‌రూపం 2 త‌ర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం అనంత‌రం విక్ర‌మ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారాయ‌న‌.  ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఖైదీ చిత్రంతో ప్ర‌తిభ‌ను చాటుకున్న లోకేష్ క‌న‌క‌రాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అగ్ర హీరో సూర్య అతిథి పాత్ర‌లో క‌నిపించ‌డంతో ద‌క్షిణాదిన ఈ సినిమాపై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. హీరో నితిన్ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ముందుకొచ్చింది.

విక్రమ్ కథ

ప్రభంజన్ అనే పోలీస్ ఆఫీస‌ర్‌తో అత‌డి  తండ్రి క‌ర్ణ‌ణ్ (కమల్ హాసన్)ను,  మ‌రో నార్కోటిక్ అధికారిని ముసుగు మ‌నుషులు హ‌త్య చేస్తారు. ఆ హ‌త్య‌లకు సంబంధించి ఎలాంటి  క్లూస్ పోలీసుల‌కు ల‌భించ‌వు. పోలీస్ క‌మీష‌న‌ర్ ఆ కేసును బ్లాక్ స్క్వాడ్ ఆఫీస‌ర్ అమ‌ర్ (ఫహాద్ ఫాజిల్) కు అప్ప‌గిస్తాడు.  ఆ ముసుగు మ‌నుషులు సిటీలో ఉన్న డ్ర‌గ్ డీల‌ర్స్ ఒక్కొక్క‌రిని చంపేస్తుంటారు.  అమర్ తో పాటు వారిని  ప‌ట్టుకోవ‌డానికి డ్ర‌గ్ డీల‌ర్ సంతానం (విజయ్ సేతుపతి) కూడా ప్ర‌య‌త్నిస్తుంటాడు. అమ‌ర్ ప‌రిశోధ‌న‌లో ఆ ముసుగు మ‌నిషి 1987 బ్లాక్ స్వ్కాడ్ లీడ‌ర్ విక్ర‌మ్ (కమల్ హాసన్) అనే నిజం తెలుస్తుంది . తానేవ‌రో ప్ర‌పంచానికి తెలియ‌కుండా ముసుగు ధ‌రించి అత‌డు ఎందుకు హ‌త్య‌లు చేస్తుంటాడు. క‌ర్ణ‌న్ అనే మారుపేరుతో అత‌డు బ‌త‌క‌డానికి కార‌ణ‌మేమిటి? ప్ర‌భంజ‌న్‌తో అత‌డికి ఉన్న సంబంధ‌మేమిటి? విక్ర‌మ్ తో పాటు అత‌డి మ‌న‌వ‌డిని సంతానం ఎందుకు చంపాల‌ని అనుకుంటాడు?  తాను ప్రాణంగా ప్రేమించిన గాయ‌త్రిని అమ‌ర్ ఎలా దూరం చేసుకున్నాడు? ప‌గ ప్ర‌తీకారాల‌తో కూడిన ఈ పోరాటంలో గెలుపు ఎవ‌రిద‌న్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం. 

ఖైదీకి కొనసాగింపుగా...

త‌న గ‌త చిత్రం ఖైదీతో ముడిపెడుతూ లోకేష్ క‌న‌క‌రాజ్ విక్ర‌మ్ క‌థ‌ను రాసుకున్నారు. ఓ పోలీస్ ఆఫీస‌ర్ ర‌హ‌స్యంగా దాచిపెట్టిన కోట్లాది రూపాయ‌ల విలువైన డ్ర‌గ్స్‌ను చేజిక్కించుకోవ‌డానికి సంతానం వేసే ఎత్తులు, అత‌డిని అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే విక్రమ్.. మ‌ధ్య‌లో ఓ అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్‌ అమర్.. ఈ ముగ్గురు  చుట్టూ విక్ర‌మ్  సినిమా సాగుతుంది. డ్ర‌గ్ మాఫియా క‌థాంశానికి ఫ్యామిలీ ఎమోష‌న్స్ మేళ‌విస్తూ యాక్ష‌న్ ప్ర‌ధానంగా లోకేష్  క‌న‌క‌రాజ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. 

మలుపులు బలం

క‌మ‌ల్‌హాస‌న్ చ‌నిపోయే సీన్‌తో సినిమా ఆస‌క్తిక‌రంగా మొద‌ల‌వుతుంది. అత‌డి హ‌త్య వెనుకున్న కార‌ణాల్ని ఫ‌హాద్ ఫాజిల్ అన్వేషించే సీన్స్ తో ఆస‌క్తిక‌రంగా ముందుకు సాగుతుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ క‌థ‌లో ప్రేక్ష‌కుల్ని లీనం అయ్యేలా చేశాడు దర్శకుడు. విరామ స‌న్నివేశాల్లో వ‌చ్చే ట్విస్ట్ తో ద్వితీయార్థం కోసం ప్రేక్షకుల్ని ఆసక్తికరంగా ఎదురుచూసేలా చేశారు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో క‌మ‌ల్‌హాస‌న్ ఎవ‌రో, అత‌డి పోరాటం ఎందుకోస‌మో చూపిస్తూనే సంతానంపై అత‌డు ప్ర‌తీకారం తీర్చుకోవ‌డాన్ని యాక్షన్ ప్ర‌ధానంగా ఆవిష్క‌రించారు. 

మూడు పాత్రలు హైలైట్

క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్ క్యారెక్ట‌రైజేష‌న్స్ ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. ఈ మూడు  పాత్ర‌లు పోటాపోటీగా సాగుతాయి.  వారి నటనకు ఎక్కడ వంక పెట్టలేము. అంతగా పాత్రల్లో ఒదిగిపోయారు. క‌మ‌ల్‌హాస‌న్ పాత్ర డిఫ‌రెంట్ షేడ్స్ తో సాగుతుంది. కమల్ పాత్ర  ను పూర్తిగా ఎక్క‌డ రివీల్ చేయ‌కుండా ఎండ్ వ‌ర‌కు ఒక్కో షేడ్ చూపిస్తూ నడిపించడం ఆకట్టుకుంటుంది.  

అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్‌గా ఫ‌హాద్ ఫాజిల్ క్యారెక్ట‌ర్ న‌వ్విస్తూనే  ఉత్కంఠ‌ను పంచుతుంది. సీరియ‌స్ సీన్‌లో అత‌డు వేసే పంచ్‌లు అలరిస్తాయి. సెటిల్డ్ గా అత‌డి క్యారెక్ట‌ర్‌ను ద‌ర్శ‌కుడు రాసుకున్నారు. విల‌న్ పాత్ర‌లో మ‌రోసారి విజ‌య్ సేతుప‌తి త‌న విశ్వ‌రూపాన్ని చూపించారు. ఎంట్రీ సీన్ తోనే అత‌డి క్యారెక్ట‌ర్ సినిమాలో ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుందో ద‌ర్శ‌కుడు చూపించారు. డ్ర‌గ్ డీల‌ర్‌, అడిక్ట‌ర్‌గా ప్ర‌తి సీన్ లో త‌న న‌ట‌న‌తో విజ‌య్ సేతుప‌తి ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తుంటారు. క‌మ‌ల్ హాస‌న్‌కు ధీటుగా అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుంది. ముగ్గురి న‌ట‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది.

చివ‌ర‌లో హీరో సూర్య‌ను అతిథిగా చూపించి విక్ర‌మ్ సినిమాకు కొన‌సాగింపుగా మ‌రో భాగం ఉంటుంద‌ని లోకేష్ క‌న‌క‌రాజ్  ప్రకటించారు. అందులో  కార్తి, క‌మ‌ల్‌హాస‌న్‌, ఫ‌హాద్ ఫాజిల్ పాత్ర‌లు ఉండ‌బోతున్న‌ట్లుగా చూపించారు. 

రొటీన్ రివేంజ్ డ్రామా

ఖైదీ తో విక్రమ్ కథను క‌నెక్ట్ చేసి చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించ‌డంలో ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ కొంత క‌న్ఫ్యూజ‌న్ కు లోనైన‌ట్లుగా అనిపిస్తుంది. ఆ పాయింట్  కార‌ణంగా కొత్త పాత్ర‌లు ఎంట‌ర్ అవుతూ తిక‌మ‌క పెడుతుంటాయి. ముసుగు ధ‌రించి చేసే హ‌త్య‌ల తాలూకు ఎపిసోడ్ లెంగ్త్ ఎక్కువ‌గా అనిపిస్తుంది.  ప్ర‌థ‌మార్థంలో స‌స్పెన్స్ ను హోల్డ్ చేస్తూ వ‌చ్చిన ద‌ర్శ‌కుడు ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ రీజ‌న్ తో ముడిపెట్టి ట్విస్ట్ ను రివీల్ చేయడం క‌న్వీన్సింగ్ అనిపించ‌దు. ద్వితీయార్థం పూర్తిగా రొటీన్ రివేంజ్ డ్రామాగా సినిమా మారిపోతుంది. క్లైమాక్స్ పూర్తిగా ఖైదీ సినిమాను పోలి సాగుతుంది. 

అనిరుధ్ మరో హీరో..

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ సినిమాకు మరో హీరోగా నిలిచాడు. సినిమాలోని ప్రతి సీన్ కు అతడి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తోడ‌వ‌డంతో ప్రేక్ష‌కుడికి హై మూవ్‌మెంట్ ను ఇస్తుంది. ఈ సినిమాకు క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాత‌. త‌న సొంత సినిమా కావ‌డంతో బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డ కాంప్ర‌మైజ్ కాలేదు. తెలుగు డ‌బ్బింగ్‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నది శ్రేష్ట్ మూవీస్ సంస్థ. తెలుగులో త‌న పాత్ర‌కు క‌మ‌ల్‌హాస‌న్ స్వ‌యంగా డ‌బ్బింగ్ చెబుతున్నారు. 

విజువల్ ఫీస్ట్

యాక్ష‌న్ సినిమా ల‌వ‌ర్స్ ఫుల్ ఐ ఫీస్ట్ లా  సినిమా ఉంటుంది. క‌మ‌ల్‌హాస‌న్‌, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్ యాక్టింగ్ కోసం ఈ మూవీ చూడొచ్చు. 

రేటింగ్ : 2.5/5

 

తదుపరి వ్యాసం