Hunt Movie Review: హంట్ మూవీ రివ్యూ - సుధీర్‌బాబు రీమేక్ సినిమా ఎలా ఉందంటే
26 January 2023, 14:10 IST
Hunt Movie Review: సుధీర్‌బాబు, శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన హంట్ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం (నేడు) థియేటర్లలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాతో మహేష్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.
సుధీర్‌బాబు,ప్రేమిస్తే భరత్
Hunt Movie Review: టాలీవుడ్‌లో కథ, పాత్రల పరంగా నవ్యతకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తుంటారు యంగ్ హీరో సుధీర్‌బాబు(Sudheer Babu). అతడు హీరోగా నటించిన తాజా చిత్రం హంట్. రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. హంట్ సినిమాలో శ్రీకాంత్(Srikanth), ప్రేమిస్తే భరత్ (Bharath) కీలక పాత్రలు పోషించారు. మహేష్ దర్శకత్వం వహించారు. క్రైమ్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే..
Hunt Movie Story -గతాన్ని మర్చిపోయిన పోలీస్ కథ...
ఐపీఎస్ ఆఫీసర్ ఆర్యన్ (భరత్) హత్యకు గురవుతాడు. అతడిని హత్య చేసింది ఎవరో కనిపెడతాడు అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ అర్జున్ ( సుధీర్‌బాబు). ఆ వివరాల్ని కమీషనర్ మోహన్ భార్గవ్ కు (శ్రీకాంత్)చెబుతున్న సమయంలోనే అతడికి యాక్సిడెంట్ అవుతుంది.
ఆ ప్రమాదంలో అర్జున్ గతాన్ని మర్చిపోతాడు. అర్జున్ తెలివితేటలపై ఉన్న నమ్మకంతో అతడికే ఆర్యన్ మర్డర్ కేసును అప్పగిస్తాడు మోహన్ భార్గవ్. గతాన్ని మర్చిపోయిన అర్జున్ ఆ మర్డర్ కేసు మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు? అర్యన్‌ను చంపింది ఎవరు? అర్జున్‌కు, ఆర్యన్‌కు మధ్య ఎలాంటి అనుబంధం ఉంది? అన్నదే హంట్ సినిమా కథ.
డిఫరెంట్ స్క్రీన్‌ప్లే...
గతాన్ని మర్చిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. దాదాపు తాను సాల్వ్ చేసిన ఓ కేసును గతాన్ని మర్చిపోవడం వలన తిరిగి ఫస్ట్ నుంచి ఎలా టేకాఫ్ చేశాడనే పాయింట్‌తో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా దర్శకుడు మహేష్ ఈ సినిమాను తెరకెక్కించారు.
సింపుల్ పాయింట్‌ను డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు డైరెక్టర్. సినిమా మొత్తం అర్జున్ ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ అంశాలు బాగున్నా వాటిలో వేగం పెరిగితే బాగుండేది. యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు (Hunt Movie Review)హైలైట్‌గా నిలిచాయి.
క్లైమాక్స్ బలం…
క్లైమాక్స్ ట్విస్ట్ ఈ సినిమాకు బలం. ఆ ఒక్క ట్విస్ట్‌ను నమ్ముకుంటూ దాని చుట్టూ హంట్ కథను అల్లుకున్నాడు డైరెక్టర్. టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కొత్త పాయింట్ అది. ఆ పాయింట్‌తో తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు కనెక్ట్ అవుతారన్నదానిపైనే హంట్(Hunt Movie Review) విజయావకాశాలు ఆధారపడ్డాయి.
ఆ ట్విస్ట్ రివీల్ అయ్యే విధానాన్నిఆద్యంతం ఉత్కంఠగా నడిపించడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.మలయాళ సినిమా ముంబై పోలీస్‌కు రీమేక్‌గా హంట్ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ వెర్షన్‌తో పోలిస్తే చాలానే మార్పులు చేశారు.
సుధీర్‌బాబు క్యారెక్టర్ ప్లస్...
పాత్రల పరంగా వైవిధ్యతకు ప్రాధాన్యమిచ్చే సుధీర్ బాబు మరోసారి కొత్తదనాన్ని నమ్మి ఈ సినిమా చేశారు. ఇలాంటి రోల్ చేయాలంటే కాస్తంతా ధైర్యం కావాల్సిందే. పోలీస్ ఆఫీసర్ రోల్‌కు అతడి లుక్, ఫిజిక్ చక్కగా కుదిరాయి. పోలీస్ కమీషనర్‌గా శ్రీకాంత్ నటన బాగుంది. మరో ఇంపార్టెంట్ రోల్‌లో ప్రేమిస్తే భరత్ కనిపించాడు. ఈ ముగ్గురి చుట్టే కథ ఎక్కువగా నడుస్తుంది.
Hunt Movie Review -కొత్తదనం కోరుకునేవారిని...
క్రైమ్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్స్‌లో కొత్త కోణాన్ని టచ్ చేస్తూ రూపొందిన సినిమా ఇది. మలయాళ సినిమా ముంబై పోలీస్ ఆధారంగా హంట్ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ వెర్షన్ చూసిన వారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు.