The Warrior | ‘వారియర్'గా రామ్.. థియేటర్‌ల్లోకి వచ్చేది అప్పుడే
27 March 2022, 11:40 IST
- రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ది వారియర్'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. జులై 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. కృతి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది.
రామ్ పోతినేని
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఈ మధ్య కాస్త్ గ్యాప్ ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ తర్వాత రెడ్ అనే చిత్రంలో నటించాడు. అయితే ఆ సినిమా అనుకున్నంత మేర ప్రేక్షకులను మెప్పించకపోవడంతో విరామం తీసుకున్నాడు. ప్రస్తుతం రామ్ నటిస్తోన్న చిత్రం 'ది వారియర్'. ఈ సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ సినిమాను జులై 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాలో రామ్ శక్తిమంతమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. హీరో ఆది పినిశెట్టి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరిపై కీలకమైన పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. రామ్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మాస్-యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ సినిమాలో రామ్ లుక్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది.
దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళం రెండు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జులై 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు.
టాపిక్