Happy Birthday review: హ్యాపీ బర్త్ డే రివ్యూ…కొత్తదనమే కానీ కండీషన్స్ అప్లై
08 July 2022, 12:32 IST
కెరీర్ లో తొలిసారి యాక్షన్ ప్రధాన కథాంశంతో లావణ్య త్రిపాఠి చేసిన చిత్రం హ్యాపీబర్త్‌డే. మత్తు వదలరా ఫేమ్ రీతేష్ రానా దర్శకత్వంలో రూపొందిన ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాటలు, ప్రచార చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన హ్యాపీ బర్త్ డే సినిమా ఎలా ఉందంటే....
హ్యాపీ బర్త్ డే
రొటీన్ కమర్షియల్ దారుల్లో అడుగులు వేయకుండా ప్రయోగాత్మక కథాంశాలతో సినిమాల్ని తెరకెక్కిస్తూ ప్రతిభను చాటుకుంటున్నారు నవతరం దర్శకులు. ఆ జాబితాలో రితేష్ రానా నిలుస్తాడు. మత్తు వదలరా సినిమాతో తొలి అడుగులోనే తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. రితేష్ రానా దర్శకత్వం వహించిన తాజా చిత్రం హ్యాపీ బర్త్‌డే. సర్రెల్ కామెడీ అనే కొత్త జోనర్ లో టాలీవుడ్ కు పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రను పోషించింది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో భాగం కావడంతో ఈ చిన్న సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వారం బాక్సాఫీస్ బరిలో నిలిచిన సినిమాల్లో హ్యాపీబర్త్‌డేపైనే అంచనాలు ఎక్కువగా నెలకొన్నాయి. ఆ అంచనాల్ని ఈ సినిమా ఏ మేరకు అందుకుందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
ఆయుధాల సవరణ చట్టంలో మార్పులు చేసిన మినిస్టర్ రిత్విక్ సోది (వెన్నెల కిషోర్) సామాన్య ప్రజలందరికి గన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తాడు. ఆచరణ రిత్విక్ సోదీదే అయినా ఆలోచన మొత్తం బేబీ (లావణ్య త్రిపాఠి) అనే యువతిది. కానీ బేబీని మోసం చేసిన రిత్విక్ ఆమెను జైలుకుపంపిస్తాడు. అతడిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం బేబీ ఎదురుచూస్తుంటుంది. ఆ ఆలోచనతోనే రిత్విక్ సోదీ ఉంటున్న హోటల్ లోకి అడుగుపెడుతుంది. జీవితంలో ఒక్కసారైనా సర్‌ప్రైజ్ బర్త్‌డే ను సెలబ్రేట్ చేసుకోవాలన్నది హ్యాపీ (లావణ్య త్రిపాఠి) కల.
తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి ఆమె కూడా బేబీ ఉండే హోటల్ లోకి వస్తుంది. లక్కీ (నరేష్ అగస్త్య) అనే రూమ్ బాయ్ హ్యాపీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతడి భారీ నుండి తప్పించుకోవడానికి హ్యాపీ ప్రయత్నాలు చేస్తుంటుంది. తాను ఒప్పుకున్న ఓ పనిని పూర్తిచేయడానికి మాక్స్ పైన్ (సత్య) అనే కిల్లర్ తో పాటు ఓ గూఢచార బృందం కూడా ఆ హోటల్ లోకి వస్తారు. భిన్న రకాల వ్యక్తుల వల్ల ఆ హోటల్ లో ఎలాంటి గందరగోళం చోటుచేసుకున్నది. బేబీతో హ్యాపీకి ఉన్న సంబంధమేమిటి? రిత్విక్ సోదిపై బేబీ ఎలా ప్రతీకారం తీర్చుకుంది? హ్యాపీ ని కిడ్నాప్ చేయడానికి లక్కీ ఎందుకు ప్రయత్నించాడు అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
సర్రెల్ కామెడీ జోనర్...
సర్రెల్ కామెడీ అనే కొత్త జోనర్‌లో దర్శకుడు రితేష్ రానా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ పదానికి తగినట్లుగానే సినిమా కూడా వింతవింతగా సాగుతుంటుంది. ఇందులో ఎలాంటి లాజిక్స్ ఉండవు. సినిమా రూపకల్పనలో ఉండే అన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ను పూర్తిగా పక్కనపెట్టి హ్యాపీ బర్త్ డేను తెరకెక్కించారు దర్శకుడు రితేష్ రానా. కథాపరంగా చెప్పుకుంటే ఇదొక రొటీన్ రివేంజ్ డ్రామా. ఈ పాయింట్ కు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ లాంటివి జోడిస్తూ ద వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు.
వింత పేర్లు...
పాత్రల పేరు, సీన్స్, యాక్షన్, సినిమాలో కనిపించే లొకేషన్స్ అన్ని కొత్తగా ఉంటాయి. వాటి నుండే వినోదాన్ని రాబట్టుకుంటూ సినిమాను నడిపించారు. మాక్స్ పెయిన్, రిత్విక్ సోది, యూరినోవ్ అంటూ ప్రతి క్యారెక్టర్ కు వింత పేరు పెట్టారు దర్శకుడు. వారి ప్రవర్తన,చెప్పై డైలాగ్స్ అన్ని నవ్విస్తుంటాయి.
మలుపులు కుదిరినా...
పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి హ్యాపీ హోటల్ లో అడుగుపెట్టే సీన్‌తో సినిమా మొదలవుతుంది. అక్కడి నుండి ఒక్కో క్యారెక్టర్ ఎంటర్ అవుతూ అందరు ఒకే చోటకు ఎలా చేరారనే అంశాన్ని ఆసక్తికరంగా చూపించారు. హ్యాపీ పోలికలతోనే బేబీ ఉండటం అనే ట్విస్ట్ తో ద్వితీయార్థం కోసం ఉత్కంఠగా ఎదురుచూసేలా చేశాడు దర్శకుడు. హ్యాపీ, బేబీ ఇద్దరు ఒకే పోలికలతో ఎందుకు ఉన్నారు? వారి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఏ ప్లాన్ తో వారు హోటల్ లోకి వచ్చారన్నది ఉత్కంఠ, కామెడీ జోడిస్తూ సెకండ్ హాఫ్ లో ఆవిష్కరించారు. లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ తో నరేష్ అగస్త్య, సత్య పాత్రలను ముడిపెడుతూ కథలోనే వాటిని అంతర్భాగం చేసిన తీరు ఆకట్టుకుంటుంది.
నో లాజిక్స్...
సినిమాలో భూతద్దం పెట్టి వెతికినా ఒక్క లాజిక్ కనిపించదు. దర్శకుడు కూడా వాటిని ఈ సినిమాలో వెతకవద్దని ఫస్ట్ సీన్ తోనే చెబుతాడు. గన్ కల్చర్ తో ఇమాజినేషన్ వరల్డ్ లో సినిమా సాగుతుంది. సడెన్ గా కొత్త పాత్రలు ఎంటర్ అవుతూనే ఉంటాయి. అవి ఎందుకు వస్తాయో అర్థం కాదు. నవ్వించడానికే వాటిని ప్రవేశపెట్టినట్లు గా దర్శకుడు సింబాలిక్ గా చెబుతుంటారు. క సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ క్యారెక్టర్స్ తప్పితే చాలా మిగిలిన క్యారెక్టర్స్ కామెడీ వర్కవుట్ కాలేదు. , హ్యాపీ, బేబీ రిలేషన్ షిప్, రిత్విక్ పై వారికి ఉన్న పగ కన్ఫ్యూజన్ కు గురిచేస్తుంది. రెండింటిలో ఏ క్యారెక్టర్ ఎప్పుడూ వస్తుందో అర్థం కాదు. నరేష్ అగస్త్య కామెడీ ట్రాక్ రిపీటెడ్ గా వచ్చి చికాకును తెప్పిస్తుంది.
డ్యూయల్ షేడ్ క్యారెక్టర్ లో లావణ్య...
హ్యాపీ బర్త్ డేలో రెండు డిఫరెంట్ షేడ్స్ తో కూడిన క్యారెక్టర్‌లో లావణ్య త్రిపాఠి కనిపించింది. ఇప్పటివరకు ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లోనే నటించింది. ఈ సినిమాతో నటనాపరంగా తనలోని కొత్త కోణాన్ని చూపించే అవకాశం దొరికింది. ఫన్ తో పాటు నెగెటివ్ షేడ్స్ చక్కగా పండించింది. సత్య, వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. రిత్విక్ సోదిగా తన క్యారెక్టరైజేషన్స్, డైలాగ్ డెలివరీతో వెన్నెల కిషోర్ ఆద్యంతం నవ్వులను పంచారు. అమాయకుడైన కిల్లర్ గా సత్య క్యారెక్టర్, అతడి మేనరిజమ్స్ ఆకట్టుకుంటాయి. సుదర్శన్, నరేష్ అగస్త్య, రాహుల్ రామకృష్ణ పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయారు.
సింగిల్ లొకేషన్...
సినిమా చాలా వరకు ఒకే లొకేషన్ లో సాగుతుంది. అయినా ఆ ఫీల్ రాకుండా చేయడంలో సాంకేతిక నిపుణుల ప్రతిభ కనిపిస్తుంది. కాలభైరవ నేపథ్య సంగీతం, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి.
కథ, కథనాలు, నటన లాంటివి ఆశించి ఈ సినిమా చూడకపోవడం మంచిది. జస్ట్ టైమ్ పాస్ కోసమే చేసిన ప్రయత్నం ఇది. అయితే ఈ నవ్వులు కొంత వరకు పరిమితమయ్యాయి.
రేటింగ్: 2 /5
టాపిక్