Hanuman vs Guntur Kaaram: ఐఎండీబీ రేటింగ్, బుక్ మై షోలలో గుంటూరు కారంను మించిన హనుమాన్
12 January 2024, 17:28 IST
- Hanuman vs Guntur Kaaram: భారీ అంచనాల మధ్య సంక్రాంతి సినిమాగా రిలీజైన మహేష్ బాబు గుంటూరు కారంకు పెద్ద షాకే తగిలింది. ఓ చిన్న సినిమా అనుకున్న హనుమాన్ దెబ్బ గట్టిగానే తగిలేలా కనిపిస్తోంది.
హనుమాన్ వెర్సెస్ గుంటూరు కారం
Hanuman vs Guntur Kaaram: ఒకటేమో సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ.. మరొకటి ఓ చిన్న హీరో, చిన్న బడ్జెట్ తో కంటెంట్ నే నమ్ముకొని వచ్చిన హనుమాన్. ఈ రెండింట్లో సంక్రాంతి విజేత ఎవరు అన్నదానికి అప్పుడే సమాధానం తెలిసిపోయింది. గుంటూరు కారం కంటే హనుమాన్ కే ప్రేక్షకులు ఓటేశారు.
ఈ రెండు సినిమాలు రిలీజైన శుక్రవారం (జనవరి 12) ఐఎండీబీ రేటింగ్స్ చూసినా, బుక్ మై షోలో డిమాండ్ చూసినా గుంటూరు కారం కంటే హనుమాన్ చాలా పైన ఉన్నట్లు స్పష్టమవుతోంది. గుంటూరు కారం మూవీకి ఐఎండీబీలో కేవలం 6.8 రేటింగ్ రాగా.. హనుమాన్ మూవీకి 8.2 రేటింగ్ రావడం విశేషం. గురువారం ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్ దూసుకెళ్తోంది.
గుంటూరు కారం.. కాస్త ఎక్కువైంది..
మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం ఏదో మ్యాజిక్ చేస్తుందనుకుంటే ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. మహేష్ ఫ్యాన్స్ కు తప్ప ఇంకెవరికీ ఈ సినిమా నచ్చలేదు. మహేష్ కోసమే ఈ సినిమా ఒక్కసారైనా చూడొచ్చు కానీ.. అసలు త్రివిక్రమ్ కు ఏమైంది అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. గుంటూరు కారం మూవీపై ఇప్పటికే ఎన్నో మీమ్స్ పుట్టుకొచ్చాయి.
మరో అజ్ఞాతవాసి అంటూ తొలి షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో సంక్రాంతి రేసులో గుంటూరు కారం వెనుకబడి పోయింది. అసలు ఎలాంటి కథ లేకుండా, మాస్ మసాలాను నమ్ముకొని సినిమా తీసిన త్రివిక్రమ్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. ఐఎండీబీలో వచ్చిన రేటింగ్స్, బుక్ మై షోలో గుంటూరు కారం కంటే హనుమాన్ కు ఎక్కువ క్రేజ్ ఉండటం ఆ అభిమానులకు అస్సలు రుచించడం లేదు.
హనుమాన్.. సూపర్ హీరో..
ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేస్తూ హనుమాన్ మేకర్స్ పెద్ద రిస్క్ చేస్తున్నారా అని సినిమా పండితులు భావించారు. కానీ సాధారణ సినిమా ప్రేక్షకుల్లో మాత్రం ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలే ఉన్నాయి. ఒక రోజు ముందు ఏర్పాటు చేసిన వందల ప్రీమియర్ షోలన్నీ హౌజ్ ఫుల్ కావడమే దీనికి నిదర్శనం. ఇక ఈ మూవీ కూడా వాళ్ల అంచనాలను అందుకోవడంతో హనుమాన్ నిజంగానే ఓ సూపర్ హీరో అయ్యాడు.
నిజానికి గుంటూరు కారంతో పోలిస్తే ఈ మూవీకి దక్కిన థియేటర్లు చాలా తక్కువ. కానీ ఒక్క రోజులోనే కథ తారుమారైంది. హనుమాన్ కు వస్తున్న టాక్ తో శనివారం (జనవరి 13) నుంచి ఆ మూవీ షోలు మరిన్ని పెరగనున్నాయి. గుంటూరు కారం నెగటివ్ రివ్యూలు కూడా హనుమాన్ కు బాగా కలిసి రానున్నాయి. ఫ్యామిలీ ప్రేక్షకులంతా ఇప్పుడీ సూపర్ హీరోవైపు చూస్తున్నారు.
తెలుగులోనే కాదు.. నార్త్ లోనూ హనుమాన్ మూవీకి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అక్కడ కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి మెర్రీ క్రిస్మస్ రిలీజైనా.. హనుమాన్ కు మాత్రం మంచి డిమాండే కనిపిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో తొలి రోజు హనుమాన్ దే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తోంది. ఇక శనివారం (జనవరి 13) రిలీజ్ కానున్న సైంధవ్, ఆదివారం (జనవరి 14) రిలీజ్ కానున్న నా సామిరంగ టాక్ చూసిన తర్వాత ఈ ఏడాది విజేత ఎవరో తేలనుంది.