తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gutar Gu Web Series Review: ఓ క్యూట్ లవ్‌స్టోరీ.. టీనేజర్లు మెచ్చే గుటర్ గు వెబ్ సిరీస్

Gutar Gu Web Series Review: ఓ క్యూట్ లవ్‌స్టోరీ.. టీనేజర్లు మెచ్చే గుటర్ గు వెబ్ సిరీస్

Hari Prasad S HT Telugu

24 April 2023, 15:49 IST

google News
    • Gutar Gu Web Series Review: ఓ క్యూట్ లవ్‌స్టోరీ ఇది. టీనేజ్ ఆడియెన్స్ ను లక్ష్యంగా చేసుకొని అమెజాన్ మినీటీవీ తీసుకొచ్చిన ఈ గుటర్ గు వెబ్ సిరీస్.. ఇద్దరు టీనేజర్ల మధ్య జరిగే ప్రేమకథను అందంగా చూపించింది.
గుటర్ గు వెబ్ సిరీస్ లో ఆశ్లేషా ఠాకూర్, విశేష్ బన్సల్
గుటర్ గు వెబ్ సిరీస్ లో ఆశ్లేషా ఠాకూర్, విశేష్ బన్సల్

గుటర్ గు వెబ్ సిరీస్ లో ఆశ్లేషా ఠాకూర్, విశేష్ బన్సల్

Gutar Gu Web Series Review: గుటర్ గు(Gutar Gu).. ఇదొక హిందీ పదం. దీనర్థం పావురాలు చేసే శబ్దం. ఇదే టైటిల్ తో అమెజాన్ మినీ టీవీ (Amazon Mini TV)లో వచ్చిన వెబ్ సిరీస్ కథ రెండు ప్రేమ పావురాల చుట్టూ తిరుగుతుంది. ఈ టీనేజర్ల లవ్ స్టోరీని చూసిన ప్రతి ఒక్కరికీ తమ తొలి ప్రేమ తాలూకు మధుర జ్ఞాపకాలు తిరిగి రావడం ఖాయం.

అనూజ్, రీతు అనే ఇద్దరు టీనేజర్ల మధ్య కలిగిన ప్రేమను మనసుకు హత్తుకునేలా తీయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక క్యూట్ లవ్ స్టోరీ. ఇంజినీరింగ్ కలలు కంటూ, గొప్ప కాలేజీల్లో సీటు కోసం కోచింగ్ తీసుకోవడానికి వచ్చిన ఈ ఇద్దరూ ఎలా కలుసుకున్నారు? వాళ్ల మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ఆ ప్రేమ ఎక్కడి వరకూ వెళ్లిందన్నది ఈ గుటర్ గు వెబ్ సిరీస్ లో చూడొచ్చు.

గుటర్ గు (Gutar Gu) స్టోరీ ఏంటి?

ప్రతి ఒక్కరి జీవితాల్లో వాళ్ల తొలి ప్రేమ ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణనే ప్రేమగా భావించే వాళ్లే ఈ సొసైటీలో ఎక్కువ మంది. కానీ కొందరు మాత్రం తమ టీనేజీ లవ్ స్టోరీయే కలకాలం ఉండిపోవాలని అనుకుంటారు. ముఖ్యంగా పొద్దున డేటింగ్ మొదలుపెట్టి.. సాయంత్రానికి బ్రేకప్ అంటున్న ఈ కాలంలో అలాంటి టీనేజీ లవ్ స్టోరీలు చాలా చాలా అరుదు.

గుటర్ గు (Gutar Gu) అలాంటి ఓ స్వీట్ లవ్ స్టోరీతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సకీబ్ పండోర్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ఇద్దరు టీనేజర్ల మధ్య సాగే ప్రేమ కథ. అనూజ్ (విశేష్ బన్సల్), రీతూ (ఆశ్లేషా ఠాకూర్) అనే ఇద్దరు టీనేజర్ల చుట్టూ తిరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కథ కోసం ఈ ఇద్దరినీ ఎంచుకోవడంలోనే డైరెక్టర్ సక్సెసయ్యాడు.

ఈ స్టోరీకి కావాల్సిన ఆ అమాయకత్వం, ఆ ఆకర్షణ, ఆ స్వీట్‌నెస్ వీళ్లలో కనిపిస్తుంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్లో ఉండే ఓ కోచింగ్ సెంటర్ బ్యాక్‌డ్రాప్ లో స్టోరీ నడుస్తుంది. గుర్గావ్ నుంచి కొత్తగా భోపాల్ వచ్చిన రీతూ అనే అమ్మాయి.. ఈ కోచింగ్ సెంటర్లోనే అనూజ్ ను కలుస్తుంది. అక్కడి నుంచే వాళ్ల జీవితాల్లో ఆ తొలి అనుభవాలు ప్రారంభమవుతాయి.

ఫస్ట్ కిస్, ఫస్ట్ డేట్, ఫస్ట్ వాలెంటైన్స్ డే.. ఇలా ప్రేమలో పడే ప్రతి జంటా అనుభూతి చెందాలనుకునే అంశాలను ఈ సిరీస్ లో మనసుకు హత్తకునేలా చూపించారు. మరీ సంక్లిష్టంగా కాకుండా వీళ్ల క్యూట్ లవ్ స్టోరీని అంతే సింపుల్ గా మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ప్రతి ఎపిసోడ్ లో వీళ్ల ప్రేమ ఎదుర్కొనే సమస్యను ఎంతో సింపుల్ గా, హాయిగా నవ్వుకునేలా తీసిన తీరు ఆకట్టుకుంటుంది.

ఆరు ఎపిసోడ్ల ఈ సిరీస్ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. ముఖ్యంగా టీనేజర్లు ఈ గుటర్ గు స్టోరీ ఈజీగా కనెక్ట్ అవుతారు. ఈ మధ్య ఆస్కార్ గెలిచిన డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ ను నిర్మించిన గునీత్ మోంగానే ఈ సిరీస్ కు కూడా ప్రొడ్యూసర్. రీతూ పాత్రలో ఆశ్లేషా ఠాకూర్ తన క్యూట్ లుక్స్ తో ఆకర్షించింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ గుటర్ గు మూడు గంటల్లో ముగిసిపోయే ఓ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం