Guntur Kaaram Tickets: టికెట్ ధరల పెంపు కోసం దరఖాస్తు చేసిన 'గుంటూరు కారం’ మేకర్స్.. ఎంతంటే!
31 December 2023, 23:51 IST
- Guntur Kaaram Tickets: గుంటూరు కారం సినిమా కోసం టికెట్ ధరల పెంపునకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు దరఖాస్తు చేశారు మేకర్స్. ఒక్కో టికెట్‍పై ఎంత ధర పెంచాలని కోరారో ఇక్కడ తెలుసుకోండి.
గుంటూరు కారంలో మహేశ్ బాబు
Guntur Kaaram Tickets: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంపై హైప్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సూపర్ స్టార్ అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన గుంటూరు కారం థియేటర్లలో రిలీజ్ కానుంది. పాటలతో ప్రమోషన్లలో ఇప్పటికే జోరు పెంచింది మూవీ యూనిట్. కాగా, గుంటూరు కారం సినిమా టికెట్ రేట్ల విషయంలో మేకర్స్.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.
తమ సినిమా కోసం టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని గుంటూరు కారం మేకర్స్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు దరఖాస్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‍లోని సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‍పై రూ.75 అదనంగా ధర పెంచేందుకు కోరారు. తెలంగాణలో సింగిల్స్ స్క్రీన్స్‌లో రూ.65, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 ధరను పెంచేందుకు పర్మిషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. వీటిపై ఆయా ప్రభుత్వాలు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదనపు షోల కోసం కూడా గుంటూరు కారం మూవీ యూనిట్ అడిగినట్టు తెలుస్తోంది.
గుంటూరు కారం చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు వచ్చాయి. తాజాగా రిలీజ్ అయిన కుర్చీ మడతపెట్టి సాంగ్ అదిరిపోయింది. మహేశ్ బాబు, హీరోయిన్ శ్రీలీల మాస్ డ్యాన్స్ దద్దరిల్లింది. కాగా, న్యూఇయర్ కోసం విదేశాలకు వికేషన్‍కు వెళ్లారు మహేశ్. తిరిగి వచ్చిన తర్వాత మూవీ ప్రోమోషన్లలో పాల్గొననున్నారు. అప్పటి నుంచి గుంటూరు కారం ప్రోమోషన్లు మరింత దూకుడుగా జరగనున్నాయి. ప్రీ-రిలీజ్ ఈవెంట్ గురించి కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గుంటూరు కారం టీజర్, ట్రైలర్ కూడా రావాల్సి ఉంది.
గుంటూరు కారం సినిమాలో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, ఈశ్వరిరావు, ప్రకాశ్ రాజ్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు ఇతర చిత్రాలు సంక్రాంతికి పోటీలో ఉన్నా రికార్డు థియేటర్లలో గుంటూరు కారం చిత్రం రిలీజ్ అయ్యేలా చేస్తామని నిర్మాత నాగవంశీ తాజాగా చెప్పారు.