Godfather Trailer: అన్నయ్య ఒచ్చేసినాడు.. అన్నీ ఒగ్గేసి వెళ్లిపోండి.. గాడ్‌ఫాదర్ ట్రైలర్ అదుర్స్
28 September 2022, 21:35 IST
- Godfather Trailer: అన్నయ్య ఒచ్చేసినాడు.. అన్నీ ఒగ్గేసి వెళ్లిపోండి అనే డైలాగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంటే గంభీరంగా నడుచుకుంటూ వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. అతని లేటెస్ట్ మూవీ గాడ్‌ఫాదర్ ట్రైలర్ బుధవారం (సెప్టెంబర్ 28) రిలీజైంది.
గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి పవర్ ఫుల్ లుక్
Godfather Trailer: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్‌ఫాదర్. ఈ సినిమా అక్టోబర్ 5న దసరా పండుగ సందర్భంగా రిలీజ్ కానుండగా.. బుధవారం (సెప్టెంబర్ 28) ట్రైలర్ లాంచ్ చేశారు. మెగాస్టార్ ఇమేజ్‌కు తగినట్లుగా పక్కా పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌తోనే అంచనాలు భారీగా పెంచేసింది.
పవర్‌ఫుల్ డైలాగులు, పవర్ పంచ్‌లు, యాక్షన్ సీన్స్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ స్పెషల్ ఎంట్రీ.. ఇలా ట్రైలర్‌తోనే సినిమా చూపించేశారు. ఈ ట్రైలర్‌ను చిరంజీవి తన ట్విటర్‌లో షేర్ చేశాడు. విజయదశమికి గాడ్‌ఫాదర్ వస్తున్నాడు అనే క్యాప్షన్‌తో ఈ ట్రైలర్‌ను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. మంగళవారమే (సెప్టెంబర్ 27) ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ట్రైలర్ మొదట్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఖాళీ అయినట్లుగా చూపిస్తారు. ఆ కుర్చీ కోసం జరిగే త్రిముఖ పోరులో ఓవైపు మెగాస్టార్, మరోవైపు నయనతార, ఇంకోవైపు సత్యదేవ్‌లు పోటీపడుతుంటారు. ఈ ట్రైలర్‌లో ఖైదీ నంబర్ 786తో కనిపించే చిరంజీవి.. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు అనే డైలాగ్ హైలైట్.
ఈ డైలాగ్‌ను ఈ మధ్యే చిరు తన ట్విటర్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడిది మూవీలో డైలాగ్ అని చెప్పకుండా కేవలం ఆడియో మాత్రమే రిలీజ్ చేసి సంచలనం రేపాడు. ఇక గాడ్‌ఫాదర్ ట్రైలర్‌లో సల్మాన్ స్పెషల్ అప్పియరెన్స్‌ను కూడా పవర్‌ఫుల్‌గా చూపించారు. ఇది నీ సమస్య కాదు.. నా సమస్య కాదు.. ఫ్యామిలీ సమస్య.. ఇది నీ పెద్దన్నకు పెద్దన్న అయిన గాడ్‌ఫాదర్ సమస్య అనే డైలాగ్‌తో సల్మాన్ ఎంట్రీ ఇస్తాడు.
2019లో మలయాళంలో వచ్చిన లూసిఫర్ మూవీకి ఈ గాడ్‌ఫాదర్ రీమేక్ కావడం విశేషం. మోహన్ రాజా ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. లూసిఫర్ మూవీలో సల్మాన్ పాత్రను పృథ్విరాజ్ పోషించాడు. దసరా సందర్భంగా రిలీజ్ కానున్న గాడ్‌ఫాదర్‌కు నాగార్జున ఘోస్ట్ మూవీ నుంచి పోటీ ఉంది. మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా తలపడతాయో చూడాలి.