Ghost Review: ఘోస్ట్ రివ్యూ - శివరాజ్ కుమార్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ ఎలా ఉందంటే?
06 November 2023, 5:57 IST
Ghost Review: శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఘోస్ట్ ఇటీవల థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు ఎమ్ జీ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు
ఘోస్ట్ మూవీ
Ghost Review: కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన డబ్బింగ్ మూవీ ఘోస్ట్ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఎమ్ జీ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. జయరాం కీలక పాత్ర పోషించాడు.ఘోస్ట్ సినిమాతో శివరాజ్‌కుమార్ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడా? లేదా? అన్నది చూద్ధాం...
గ్యాంగ్‌స్టర్ పెద్దన్నయ్య...
పెద్దన్నయ్య (శివరాజ్‌కుమార్) అనే గ్యాంగ్‌స్టర్ తో పాటు అతడి అనుచరులు జైలును హైజాక్ చేస్తారు. వామన్ అనే సీబీఐ మాజీ సీబీఐ ఆఫీసర్, జైలర్‌తో పాటు చాలా మంది ఖైదీలను బందీలుగా చేస్తారు. పెద్దన్నయ్యను పట్టుకోవడానికి ప్రభుత్వం చరణ్‌రాజ్ (జయరాం) అనే స్పెషల్ ఆఫీసర్‌ను రంగంలోకి దించుతుంది. తనకు అడ్డొచ్చిన వారిని ఆనవాళ్లు లేకుండా చంపేయడం చరణ్‌రాజ్ స్పెషాలిటీ.
అలాంటి చరణ్‌రాజ్‌కు పెద్దన్నయ్య కేసు సవాల్‌గా మారుతుంది. పెద్దన్నయ్య హైజాక్ చేసిన జైలులోనే సీబీఐ ఆఫీసర్ వామన్ అక్రమంగా దాచిపెట్టిన వెయ్యి కేజీల బంగారం ఉంటుంది. ఆబంగారం కోసమే పెద్దన్నయ్య జైలును హైజాక్ చేశాడనే నిజం చరణ్ రాజ్ అన్వేషణలో తేలుతుంది. ఆ బంగారాన్ని జైలు నుంచి దాటించడానికి వామన్ నియమించిన వందలాది మంది రౌడీలు అదే జైలు ఖైదీలుగా ఉంటారు. చరణ్‌రాజ్‌తో పాటు ఆ ఖైదీలను ఎదుర్కొని పెద్దన్నయ్య ఆ బంగారాన్ని జైలు నుంచి ఎలా కొట్టేశాడు?
చాలా ఏళ్ల క్రితమే చనిపోయిన గ్యాంగ్‌స్టర్ పెద్దన్నయ్య మళ్లీ ఎలా బతికి వచ్చాడు? జైలును హైజాక్ చేసింది నిజంగా పెద్దన్నయ్యనేనా? రాష్ట్రాన్ని గడగడలాండించిన పెద్దన్నయ్య జైలులో ఉన్న బంగారాన్ని కొట్టేయాలని ఎందుకు ప్లాన్ చేశాడు? పెద్దన్నయ్యతో ఆనంద్ అలియాస్ ది ఘోస్ట్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? వామన్ తో పాటు జైలర్ చేసిన కుట్రను ఆనంద్ ఎలా బయటపెట్టాడు? అన్నదే ఈ సినిమా కథ.
కేజీఎఫ్ స్ఫూర్తితో...
కేజీఎఫ్ కన్నడ ఇండస్ట్రీతో పాటు దక్షిణాది సినీ ముఖ చిత్రాన్నే మార్చేసింది. రొటీన్ గ్యాంగ్‌స్టర్ కథల్ని హీరోయిజం, ఎలివేషన్స్‌తో ప్రేక్షకుల్ని అలరించేలా రొమాంచితంగా సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించవచ్చని కేజీఎఫ్ సిరీస్ సినిమాలు నిరూపించాయి. కేజీఎఫ్ సక్సెస్ తర్వాత గ్యాంగ్‌స్టర్ కథల ట్రెండ్ దక్షిణాది భాషల్లో ఎక్కువైంది. ఘోస్ట్ ఆ కోవకు చెందిన సినిమానే.
దొంగ, పోలీస్ కథ...
దొంగ, పోలీస్ కథకు ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామాను ముడిపెడుతూ దర్శకుడు ఎమ్‌జీ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించాడు. రివేంజ్ డ్రామాతో చిన్న ట్విస్ట్ ఇచ్చి సినిమాను ఎండ్ చేశాడు.
జైలు హైజాక్...
హీరో జైలును హైజాక్ చేసే సీన్‌తోనే ఘోస్ట్ మొదలవుతుంది. గ్యాంగ్‌స్టర్ శివరాజ్‌కుమార్‌ను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ జయరాం వేసే ఎత్తులతో ఎండింగ్ వరకు ట్విస్ట్‌లు, టర్న్‌లతో డైరెక్టర్ ఈ సినిమాను నడిపించాడు. జైలులోజయరాం వేసిన ఎత్తులను పెద్దన్నయ్య తన తెలివితేటలతో చిత్తు చేసే సీన్స్ ఆసక్తిని పంచుతాయి.
సీఏంను లేపేసే బ్యాక్‌గ్రౌండ్ పెద్దన్నయ్యకు ఉందని కేవలం రెండు సీన్స్‌లో చూపించారు. చివరలో జైలును హైజాక్ చేసింది అందరూ అనుకుంటున్న పెద్దన్నయ్య కాదంటూ రివేంజ్ బ్యాక్‌డ్రాప్‌లోకి కథను టర్న్ ఇచ్చి ఎండ్ చేశారు డైరెక్టర్.
యాక్షన్ ఎపిసోడ్స్...
సినిమా కథ చాలా వరకు ఒకే జైలులో సాగుతుంది. రిపీటెడ్ సీన్స్ ఇబ్బందిపెడతాయి. జైలులో వచ్చే రెండు యాక్షన్ ఎపిసోడ్స్‌లో శివరాజ్‌కుమార్ ఎలివేషన్స్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. ఆ ఫైట్స్ కంపోజిషన్ బాగుంది. అసలు పెద్దన్నయ్య జైలుకు ఎందుకు వచ్చాడన్నది ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో రన్ చేసి ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ రేకెత్తించాలని దర్శకుడు అనుకున్నాడు ఆ సీన్స్ మొత్తం కన్ఫ్యూజ్ చేస్తాయి.
పెద్ద ఛానెల్‌లో పనిచేసే రిపోర్టర్‌కు పెద్దన్నయ్య సీఏంలా గొంతు మార్చి మాట్లాడితే గుర్తుపట్టకపోవడం, జైలులో ఉన్న పెద్దన్నయ్యను పట్టుకోవడానికి పోలీసులు వేసే ఎత్తులన్నీ లాజిక్‌లకు దూరంగా సాగుతాయి. ఘోస్ట్ చూస్తుంటే గతంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ సినిమాలు చాలా వరకు కళ్లముందు కదలాడుతాయి. ఒక్కో సినిమాలోని ఒక్కో పాయింట్ లేపేసి అన్నింటింని కలిపి సినిమా తీసినట్లుగా ఉంటుంది.
వన్ మెన్ షో...
శివరాజ్‌కుమార్ వన్‌మెన్ షోగా ఘోస్ట్ నిలుస్తుంది. పెద్దన్నయ్యగా పవర్‌ఫుల్ రోల్‌లో మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో చెలరేగిపోయాడు. పోలీస్ ఆఫీసర్‌గా జయరాం పాత్ర శివరాజ్‌కుమార్‌కు ధీటుగా సాగుతుంది. హీరోతో సమానమైన స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న పాత్రలో నటించాడు. అనుపమ్‌ఖేర్ గెస్ట్‌గా కనిపిస్తాడు. అర్జున్ జన్యా బీజీఎమ్ బాగుంది.
రొటీన్ గ్యాంగ్‌స్టర్ మూవీ...
ఘోస్ట్ రొటీన్ గ్యాంగ్‌స్టర్ మూవీ. శివరాజ్‌కుమార్ యాక్టింగ్, ఆయనపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాల కోసం ఓ సారి చూడొచ్చు.
రేటింగ్: 2/5