Flash Back : బలవంతంగా వ్యభిచారంలోకి స్టార్ నటి.. ఎయిడ్స్‌తో జీవితం నాశనం
13 August 2023, 10:43 IST
- Nisha Noor Life Story : రంగుల జీవితానికి ఒక్కసారి అలవాటుపడితే.. దాని నుంచి బయటపడటం చాలా కష్టంగా మారుతుంది. గ్లామర్ పరిశ్రమలో బయటకు కనిపించేది ఒకటి.. లోపల జరిగేది ఒకటి. అందుకు ఉదాహరణ నటి నిషా నూర్ జీవితం.
నిషా నూర్
చాలా మంది చిత్ర పరిశ్రమలోకి రావాలని కోరుకుంటారు. కొందరు విజయాన్ని చూసిన ఉదాహరణలు ఉన్నాయి. మరికొందరు విఫలమై విషాదకరమైన ముగింపును ఎదుర్కొన్న వారూ ఉన్నారు. సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడే నాలుగు రాళ్లు వెనక వేసుకోవాలి. లేదంటే.. డబ్బులు లేకపోతే.. ఎవరూ తిరిగి కూడా చూడరు. క్రేజ్ ఉన్నప్పుడే.. ఆహా.. ఓహో అని చుట్టూ చేరుతారు. ఒక్కసారి స్టార్ డమ్ పడిపోయి.. చేతులు డబ్బులు లేక ఖాళీగా ఉంటే అంతే సంగతులు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
సినిమా పరిశ్రమలో జీవితాన్ని నాశనం చేసుకున్నవారిలో గ్లామర్ డాల్ నిషా నూర్(Nisha Noor) ఒకరు. ఆమె అంటే ఒకప్పుడు కుర్రాళ్లు పడి చచ్చేవారు. నటనను నమ్ముకుని వచ్చింది. పాపం.. ఓ వ్యక్తి చేసిన పనికి జీవితం పక్కదారి పట్టింది. విషాదంగా ముగిసింది. ఎవరూ గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె జీవితం సినిమా చీకటి కోణాన్ని చూపించింది. నిషా నూర్ 1980లలో ప్రసిద్ధ నటి, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలలో పనిచేసింది.
కమల్ హాసన్(Kamal Haasan)తో కలిసి టిక్ టిక్ టిక్ నటించిన ముగ్గురు నటీమణులలో ఆమె ఒకరు. ఒక సందర్భంలో సినిమాలో భాగంగా.. కమల్ చుట్టూ స్విమ్‌సూట్‌లో మాధవి, రాధ, నిషా ఉన్న ఫోటో అప్పట్లో ఓ సెన్సేషన్. రజనీకాంత్(Rajinikanth), కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులతో కలిసి నటించిన ఈ భామ విమర్శకులను మెప్పించింది. గ్లామర్ పాత్రలు నటించేందుకు కూడా సిద్ధంగా ఉండేది.
నిషా నూర్ తన గ్లామర్, బోల్డ్ పాత్రలతో బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఆమెకు చాలా మంది అభిమానులు ఉండేవారు. నిషా నూర్ కెరీర్ చాలా బాగా ఉండేది. ప్రముఖ దర్శకులు బాలచంద్రన్, విసు, చంద్రశేఖర్‌లతో కలిసి పనిచేసింది. కానీ క్రమంగా నిషా నూర్‌కి సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఆమె చిత్ర పరిశ్రమలో మంచి స్థానం కోసం చాలా సవాళ్లను ఎదుర్కొంది. ఓ నిర్మాతను నమ్మితే.. వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టేశాడని గతంలో వార్తలు వచ్చాయి. పని దొరకకపోవడంతో నిషా నూర్ వ్యభిచారంలోకి వెళ్లింది.
ఓ నిర్మాత బలవంతంగా వ్యభిచారం చేయించడంతో ఆమె సినీ పరిశ్రమ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. నిషా నూర్ కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంది. కష్టకాలంలో ఆమెకు తన కుటుంబం లేదా స్నేహితుల నుండి ఎటువంటి మద్దతు లభించలేదు.
చివరకు నిషా నూర్ ఓ దర్గా బయట వీధిలో నిద్రపోయే పరిస్థితి వచ్చిందంటే.. అర్థం చేసుకోవచ్చు.. ఎలాంటి దారుణంలోకి వెళ్లిందోనని. ఓ NGO నిషా నూర్ ను గుర్తించింది. కానీ ఆమెను గుర్తుపట్టే స్థితిలో లేదు. ఆమెను నిషా నూర్ అంటే ఎవరూ నమ్మే పరిస్థితులో లేరు. అలా తయారైంది తన జీవితం. ఆ తర్వాత నిషా నూర్ ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. నిషా నూర్ 2007లో మరణించింది.