Dhanush and Aishwarya: విడాకులు పక్కన పెట్టి మళ్లీ కలవనున్న ధనుష్, ఐశ్వర్య!
03 October 2022, 20:25 IST
- Dhanush and Aishwarya: విడాకులు పక్కన పెట్టి ధనుష్, ఐశ్వర్య మళ్లీ ఒక్కటవ్వనున్నారన్న వార్త అభిమానుల్లో ఆనందం నింపుతోంది. ఇప్పటికే ఈ విషయంలో ఈ ఇద్దరి కుటుంబాలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
ఐశ్వర్య, ధనుష్ పెళ్లినాటి ఫొటో
Dhanush and Aishwarya: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, అప్పుడప్పుడే సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న ధనుష్ పెళ్లి అప్పట్లో సంచలనమే సృష్టించింది. అయితే 18 ఏళ్ల తమ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతూ విడాకులు తీసుకుంటున్నట్లు ఈ జంట ప్రకటించడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
ఈ ఏడాది జనవరిలో తాము విడిపోతున్నట్లు ధనుష్, ఐశ్వర్య వేర్వేరు ప్రకటనల్లో చెప్పారు. 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న జంట విడిపోవడమేంటన్న ఆశ్చర్యం అందరిలోనూ కలిగింది. "18 ఏళ్లపాటు ఒకరికొకరం స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా కలిసి ఉన్నాం. ఈ ప్రయాణంలో ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. కలిసి ఎదిగాం. అయితే ఇప్పుడు ఇద్దరి దారులు వేరయ్యే సమయం వచ్చింది. నేను, ఐశ్వర్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం" అని ధనుష్ ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేశాడు.
అప్పటి నుంచీ ఈ జంట వేరువేరుగానే ఉంటోంది. ఆ మధ్య తమ కొడుకు యాత్ర రాజు స్కూల్ ఫంక్షన్ సందర్భంగా వీళ్లు కలిశారు. ఈ ఫొటోను ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ ఫొటోలో వీళ్ల చిన్న కొడుకు లింగా కూడా ఉన్నాడు. తమ కొడుకు యాత్ర స్పోర్ట్స్ కెప్టెన్ అయిన సందర్భంగా నిర్వహించిన సెర్మనీకి ఈ ఇద్దరూ హాజరయ్యారు.
అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ధనుష్, ఐశ్వర్య తమ విడాకులను పక్కన పెట్టి మళ్లీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఇద్దరి కుటుంబాలు రజనీకాంత్ ఇంట్లో మాట్లాడుకున్నారని, ఈ సందర్భంగా ఈ జంట మధ్య సయోధ్య కుదిరినట్లు సమాచారం. ఇదే నిజమైతే అభిమానులకు ఇంతకుమించిన ఆనందం ఇంకేం ఉంటుంది.
2004లో 21 ఏళ్ల వయసులోనే ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. తన కంటే రెండేళ్లు పెద్దదైన ఐశ్వర్యను ధనుష్ పెళ్లి చేసుకోవడం అప్పట్లో ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. అప్పుడప్పుడే తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్న ధనుష్.. ఏకంగా సూపర్ స్టార్ ఇంటి అల్లుడు అయిపోయాడు. ఆ తర్వాత తాను కూడా ఇండస్ట్రీలో అత్యుత్తమ నటుల్లో ఒకడిగా ఎదిగాడు.
టాపిక్