Devi Sri Prasad on Pushpa: పుష్ప ఆస్కార్‌కు వెళ్లాల్సిన సినిమా కానీ ...దేవిశ్రీప్రసాద్ కామెంట్స్ వైరల్
12 September 2023, 14:19 IST
Devi Sri Prasad on Pushpa: పుష్ప సినిమాను ఆస్కార్‌కు పంపిస్తే తప్పకుండా అవార్డును గెలిచేదని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అన్నాడు. అతడి కామెంట్స్ టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
దేవిశ్రీప్రసాద్
Devi Sri Prasad on Pushpa: పుష్ప సినిమాను ఆస్కార్‌కు పంపిస్తే అవార్డు గెలిచే అవకాశం ఉండేదని దేవిశ్రీప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డ్స్‌లో పుష్ప సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీప్రసాద్‌లకు పురస్కారాలను సొంతం చేసుకున్నారు.
పుష్ప సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ అవార్డులకు పంపించాల్సిన సినిమా ఇదని చెప్పాడు. కానీ నిర్మాతలు ఈ సినిమాను ఎందుకు ఆస్కార్ పురస్కారాల పరిశీలన కోసం పంపించలేదో తనకు తెలియదని చెప్పాడు. ఒకవేళ పంపించి ఉంటే తప్పకుండా సెలబ్రేషన్స్ చేసుకునే ఓ మంచి న్యూస్ విని ఉండేవాళ్లమని దేవిశ్రీప్రసాద్ అన్నాడు.
భవిష్యత్తులో ఆస్కార్ అందుకోవాలనే గోల్ పెట్టుకున్నారా అని అడిగిన ప్రశ్నకు అవార్డులు రావాలనే లక్ష్యంతో తాను ఎప్పుడూ మ్యూజిక్ కంపోజ్ చేయనని దేవిశ్రీప్రసాద్ చెప్పాడు. అయితే తెలుగు సినిమా మ్యూజిక్ ఆస్కార్ లెవెల్‌కు చేరుకోవడం ఆనందంగా ఉందని దేవిశ్రీప్రసాద్ పేర్కొన్నాడు.
పుష్ప సినిమాలో దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఊ అంటావా మావ, శ్రీవల్లితో పాటు ప్రతి పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పుష్ప 2 సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కానుంది. పుష్ప నేషనల్ అవార్డ్ గెలవడంతో సీక్వెల్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.