Devara Song Copy: దేవర సాంగ్ కాపీ వివాదంపై స్పందించిన ఆ ఒరిజినల్ పాట కంపోజర్.. ఏమన్నాడంటే?
07 August 2024, 15:22 IST
- Devara Song Copy: దేవర సెకండ్ సింగిల్ చుట్టమల్లె అంటూ వచ్చిన పాటపై కాపీ ఆరోపణల నేపథ్యంలో ఆ ఒరిజినల్ సాంగ్ కంపోజర్ స్పందించాడు. అతని రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
దేవర సాంగ్ కాపీ వివాదంపై స్పందించిన ఆ ఒరిజినల్ పాట కంపోజర్.. ఏమన్నాడంటే?
Devara Song Copy: దేవర మూవీ నుంచి ఈ మధ్యే వచ్చిన సెకండ్ సింగిల్ చుట్టమల్లే పాటపై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్న విషయం తెలుసు కదా. ఈ పాట శ్రీలంకన్ సాంగ్ మనికె మాగె హితె పాటకు కాపీ అని నెటిజన్లు విమర్శించారు. అయితే ఇప్పుడా ఒరిజినల్ సాంగ్ కంపోజర్ అయిన చమత్ సంగీతే ఈ వివాదంపై స్పందించడం విశేషం.
దేవర సాంగ్ వివాదంపై చమత్ ఏమన్నాడంటే?
కొన్నాళ్ల కిందట వచ్చిన శ్రీలంకన్ సాంగ్ మనికె మాగె హితె సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ఈ పాటను చమత్ సంగీత్ కంపోజ్ చేయగా.. యొహానీ పాడింది. ఈ సాంగ్ భాషలు, దేశాలకు అతీతంగా కోట్లాది మంది మ్యూజిక్ లవర్స్ ను అలరించింది. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ నుంచి వచ్చిన చుట్టమల్లే సాంగ్ కూడా అచ్చూ ఇలాగే ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి.
అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించడంతో అతడు కాపీ కొట్టాడంటూ ట్రోల్ చేస్తున్నారు. అలాంటి ఓ ట్రోల్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ఈ వివాదంపై చమత్ స్పందించాడు. "అనిరుధ్ మ్యూజిక్ ను నేను ఎప్పుడూ ఆరాధిస్తాను. ఇప్పుడు నా పాట మనికె మాగె హితె అతనికి ప్రేరణగా నిలిచి అలాంటిదే మరొకటి కంపోజ్ చేయడం నాకు ఆనందంగా ఉంది" అని చమత్ అన్నాడు.
దేవర సాంగ్‌పై విమర్శలు
2021లో వచ్చిన మనికె మాగె హితె సాంగ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాంటి పాటలాగే అనిపించేలా దేవర మూవీలో చుట్టమల్లే సాంగ్ ను అనిరుధ్ కంపోజ్ చేయడాన్ని ఎత్తి చూపుతూ.. రెండు పాటల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా పేరుగాంచిన అనిరుధ్ నుంచి ఇలాంటివి ఊహించలేదన్న విమర్శలూ వచ్చాయి.
దీనిపై ఇప్పటి వరకూ అనిరుధ్ గానీ, మూవీ మేకర్స్ నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు. అయితే సాంగ్ ఒరిజినల్ కంపోజర్ స్పందించడం మాత్రం నిజంగా విశేషమే. అతడు కూడా ఇది అచ్చూ తన పాటలాగే ఉందన్నట్లుగా కామెంట్ చేయడం అనిరుధ్ ను మరింత ఇరకాటంలో పడేసింది.
దేవర ఫస్ట్ సింగిల్ సమయంలోనూ అతనిపై విమర్శలు వచ్చాయి. పాటలో లిరిక్స్ కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువగా ఉందని, పాట సరిగా అర్థం కాలేదని కొందరు అతన్ని విమర్శించారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ పై ఏకంగా కాపీ ఆరోపణలతో అనిరుధ్ కాస్త ఒత్తిడిలో ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న దేవర మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుండగా.. ఫస్ట్ పార్ట్ వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెకండ్ పార్ట్ లో మరో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా విలన్ గా ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి.