తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Cyclone Michaung: వరదల్లో చిక్కుకున్న ఆమిర్ ఖాన్.. కాపాడిన సిబ్బంది.. తమిళ హీరో కూడా..: వైరల్ అవుతున్న ఫొటోలు

Cyclone Michaung: వరదల్లో చిక్కుకున్న ఆమిర్ ఖాన్.. కాపాడిన సిబ్బంది.. తమిళ హీరో కూడా..: వైరల్ అవుతున్న ఫొటోలు

05 December 2023, 18:05 IST

google News
    • Cyclone Michaung: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ చెన్నై వరదల్లో చిక్కుకున్నారు. ఆయనను సహాయక సిబ్బంది బయటికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Cyclone Michaung: వరదల్లో చిక్కుకున్న ఆమిర్ ఖాన్.. కాపాడిన సిబ్బంది
Cyclone Michaung: వరదల్లో చిక్కుకున్న ఆమిర్ ఖాన్.. కాపాడిన సిబ్బంది

Cyclone Michaung: వరదల్లో చిక్కుకున్న ఆమిర్ ఖాన్.. కాపాడిన సిబ్బంది

Cyclone Michaung: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిచౌంగ్ తుపాను ప్రభావంతో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో తమిళనాడు రాజధాని చెన్నై వరదల గుప్పిట్లో ఉంది. ఆ సిటీలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెన్నైలోని చాలాచోట్ల రోడ్లపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేలాది మంది వరదల్లో చిక్కుకున్నారు. అలాగే, కరెంట్ కట్, నీటి సరఫరా లేకపోవటంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.

చెన్నై వరదల్లో బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా చిక్కుకున్నారు. తమిళ హీరో విష్ణు విశాల్ ఇంటికి వెళ్లిన ఆయన అక్కడే చిక్కుకున్నారు. సహాయక సిబ్బంది ఆమిర్ ఖాన్‍ను బోట్ ద్వారా ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చారు. సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమిర్‌తో పాటు విష్ణు విశాల్, అతడి భార్య, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కూడా ఉన్నారు.

కరప్పాకం ప్రాంతంలో తమ ఇంటి చుట్టూ నీరు భారీగా ఉన్న ఫొటోను కూడా విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బయటికి రాలేకున్నామని తెలిపారు. ఇంట్లోకి నీరు వస్తోందంటూ ఫొటోలు పోస్ట్ చేశారు. “నీరు మా ఇంట్లోకి చేరుతోంది. కరప్పాకంలో నీటి స్థాయి పెరుగుతోంది. సాయం కోసం కాల్ చేశా. కరెంట్ లేదు. వైఫై లేదు. ఫోన్ సిగ్నల్ లేదు. ఏమీ లేదు. టెర్రస్‍పై ఓ ప్రాంతంలో మాత్రమే కాస్త సిగ్నల్ లభించింది. నాతో పాటు ఇక్కడ ఉన్న చాలా మందికి సాయం లభిస్తుందని ఆశిస్తున్నా” అని విశాల్ ఫొటోలు పోస్ట్ చేశారు.

విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆయనను రక్షించేందుకు సహాయక సిబ్బంది వెళ్లారు. వారిని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆమిర్ ఖాన్ కూడా ఉన్నారు. తమను బయటికి తీసుకొచ్చిన సహాయ సిబ్బందితో ఆమిర్, విష్ణు విశాల్ ఫొటోలు దిగారు.

తమను కాపాడిన ఫైర్, సహాయక సిబ్బందికి థ్యాంక్స్ చెబుతూ విష్ణు విశాల్ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కరప్పాకం ప్రాంతంలో సహాయక చర్యలు మొదలయ్యాయని తెలిపారు. కష్టకాలంలో తమిళనాడు ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని పేర్కొన్నారు. కాగా, ఇందుకు సంబంధించిన ఫొటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు, చెన్నై వరదల గురించి సినీ, క్రీడా రంగాలకు చెందిన చాలా మంది సెలెబ్రెటీలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చెన్నైలో త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షిస్తున్నారు.

తదుపరి వ్యాసం