Custody Movie Review: కస్టడీ మూవీ రివ్యూ - నాగచైతన్య సినిమా ఎలా ఉందంటే
12 May 2023, 13:05 IST
Custody Movie Review: నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ మూవీ ఈ శుక్రవారం (నేడు) రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే....
కస్టడీ మూవీ
Custody Movie Review: కెరీర్‌లో ఎక్కువగా ప్రేమకథలు, ఫ్యామిలీ సినిమాల్లోనే నటించాడు నాగచైతన్య (Naga Chaitanya). తన పంథాకు భిన్నంగా క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఆయన చేసిన తాజా సినిమా కస్టడీ. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన కస్టడీ ఈ శుక్రవారం (నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. కృతిశెట్టి (Kriti Shetty) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అరవింద్ స్వామి (Arvind Swamy), శరత్‌కుమార్, ప్రియమణి కీలక పాత్రలను పోషించారు. కస్టడీతోనే నాగచైతన్య హీరోగా తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండు భాషల్లో అతడికి విజయం దక్కిందా? వెంకట్ ప్రభు తనదైన మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల్ని మెప్పించాడా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
Custody Movie Story -కానిస్టేబుల్ జర్నీ...
శివ (నాగచైతన్య) ఓ పోలీస్ కానిస్టేబుల్. సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తోంటాడు. డ్యూటీ కోసం ఎంతటివారినైనా ఎదురిస్తాడు. రేవతిని (కృతిశెట్టి) ప్రాణంగా ప్రేమిస్తాడు శివ. కులాలు వేరు కావడంతో రేవతి తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. రేవతికి వేరే అబ్బాయితో పెళ్లిని నిశ్చయంచేస్తాడు. దాంతో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిచేసుకోవాలని శివ, రేవతి అనుకుంటారు.
డ్యూటీలో ఉన్న శివ డ్రంకెన్ డ్రైవ్ కేసులో రాజు (అరవింద్ స్వామి), జార్జ్(సంపత్‌రాజ్)లను అరెస్ట్ చేస్తాడు. రాజు పెద్ద క్రిమినల్ అని, ముఖ్యమంత్రి దాక్షాయణి (ప్రియమణి) చేసిన అవినీతి, అక్రమాలకు అతడు ప్రత్యక్ష సాక్షి అనే నిజం జార్జ్ ద్వారా శివకు తెలుస్తుంది. శివను బెంగళూరు కోర్టులో హాజరుపరిచే బాధ్యతను జార్జ్‌తో పాటుశివ చేపడతాడు.
ఈ ప్రయాణంలో శివకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? రాజును చంపడానికి పోలీస్ కమీషనర్ నటరాజన్‌తో (శరత్ కుమార్) పాటు ముఖ్యమంత్రి మనుషులు చేసిన ప్రయత్నాల్ని శివ ఎలా ఎదుర్కొన్నాడు? రాజును ప్రాణాలతో బెంగళూరు చేర్చాడా? రేవతి శివ పెళ్లి చేసుకున్నారా అన్నదే కస్టడీ సినిమా కథ.
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ...
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో సాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీగా కస్టడీని తెరకెక్కించారు దర్శకుడు వెంకట్ ప్రభు. సాధారణంగా కమర్షియల్ సినిమాలు చాలా వరకు హీరో, విలన్ పోరాటం నేపథ్యంలో సాగుతుంటాయి.
కానీ కస్టడీ మాత్రం విలన్‌ను కాపాడటమే హీరో లక్ష్యంగా ఓ డ్రామా సెట్ చేస్తూ దాని చుట్టూ కథను అల్లుకున్నారు దర్శకుడు వెంకట్ ప్రభు. ముఖ్యమంత్రి, పోలీస్ కమీషనర్‌తో పాటు రౌడీలను ఎదురిస్తూ ఓ సాధారణ కానిస్టేబుల్ సాగించే జర్నీకి యాక్షన్, భారీ ఛేజింగ్స్ జోడిస్తూ థ్రిల్లింగ్‌గా ఈ సినిమాను నడిపించారు.
రేసీ స్క్రీన్ ప్లే…
ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్ని టైట్ స్క్రీన్‌ప్లేతో రేసీగా నడపడం చాలా ముఖ్యం. కానీ ఆ స్పీడ్‌నెస్ ఈ సినిమాలో లోపించింది. సినిమా మొదలైన ముప్పై నిమిషాల్లోనే కథేమిటి, క్లైమాక్స్ ఎలా ఉండబోతుందన్నది దర్శకుడు హింట్ ఇచ్చేశాడు. ట్విస్ట్‌లు పెద్దగా వర్కవుట్ కాలేదు.
అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్, రాంకీ గన్ ఫైట్ సీన్ లాంటి హై మూవ్‌మెంట్స్ కొన్ని ఉన్నా ఆ టెంపో చివరి వరకు కొనసాగించలేకపోయారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ప్రేమ కథ సరిగా ఇమడలేదు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు పెద్ద మైనస్‌గా మారాయి.
అరవింద్ స్వామి ప్లస్...
కస్టడీ కథలో నాగచైతన్య, కృతిశెట్టితో పాటు చాలా మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. ప్రతి క్యారెక్టర్స్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చారు డైరెక్టర్. శివ అనే కానిస్టేబుల్‌గా నాగచైతన్య యాక్టింగ్ బాగుంది. నిజాయితీపరుడైన కానిస్టేబుల్ పాత్రలో చక్కటి ఎమోషన్స్ పడించాడు. యాక్షన్ సన్నివేశాల్లో ఈజ్‌తో కనిపించాడు. నాగచైతన్య తర్వాత ఈ సినిమాలో అరవింద్ స్వామి పాత్రే ఎక్కువగా హైలైట్ అయ్యింది.
హావభావాలతోనే విలనిజాన్ని పండిస్తూనే కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు అరవింద్ స్వామి. శరత్‌కుమార్, సంపత్‌రాజ్, ప్రియమణి , ప్రేమీ విశ్వనాథ్ తమ పరిధుల మేర ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. కృతిశెట్టి క్యారెక్టర్ రొటీన్‌గా ఉంది. దర్శకుడిగా, రైటర్‌గా పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు వెంకట్ ప్రభు.
Custody Movie Review- నాగచైతన్యకు కొత్త సినిమా కానీ...
కస్టడీ నటుడిగా నాగచైతన్యకు కొత్త సినిమా కానీ ప్రేక్షకులకు మాత్రం కాదు. ప్రేమ, ఫ్యామిలీ కథల్లోనే ఎక్కువగా కనిపించిన నాగచైతన్య క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు న్యాయం చేయగలడని కస్టడీతో నిరూపించుకున్నాడు. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడంలో వెంకట్ ప్రభు గురి కాస్త తప్పింది.
రేటింగ్: 3/5