Oscars 2025: ఆస్కార్ రేసులో ఈ బాలీవుడ్ మూవీ ఉండడంపై కన్‍ఫ్యూజన్! ఎఫ్ఎఫ్‍ఐ ప్రెసిడెంట్ ఏం చెప్పారంటే..
25 September 2024, 9:13 IST
- Swatantrya Veer Savarkar - Oscars 2025: స్వాతంత్య్ర వీర్ సావర్కర్ సినిమా ఆస్కార్ రేసులో ఉందా లేదా అనే విషయంపై తికమక ఏర్పడింది. మూవీ టీమ్ ఓ విధంగా చెబితే.. ఎఫ్‍ఎఫ్‍ఐ అధ్యక్షుడు మరో మాట చెప్పారు. దీంతో ఇది హాట్‍టాపిక్‍గా మారింది.
Oscars 2025: ఆస్కార్ రేసులో ఈ బాలీవుడ్ మూవీ ఉండడంపై కన్‍ఫ్యూజన్! ఎఫ్ఎఫ్‍ఐ ప్రెసిడెంట్ ఏం చెప్పారంటే..
రణ్‍దీప్ హుడా లీడ్ రోల్ చేసిన బయోపిక్ మూవీ స్వాతంత్య్ర వీర్ సావర్కర్ చిత్రం ఆస్కార్ ఎంట్రీ విషయంలో కన్‍ఫ్యూజన్ నెలకొంది. తమ చిత్రం ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్ రేసులోకి వెళుతోందని మూవీ టీమ్ ప్రకటించింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంతోషం వ్యక్తం చేసింది. దీంతో అకాడమీ అవార్డులకు ఇండియా అఫీషియల్ ఎంట్రీగా స్వాతంత్య్ర వీర్ సావర్కర్ వెళుతోందని చాలా మంది భావించారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ వచ్చింది.
అది నిజం కాదు
స్వాతంత్య్ర వీర్ సావర్కర్ సినిమా ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్ ఎంట్రీలో లేదని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) అధ్యక్షుడు రవి కొట్టకర స్పష్టం చేశారు. తాము ఆ మూవీకి ఆస్కార్ ఎంట్రీ ఇచ్చామని వస్తున్న విషయం నిజం కాదని హెచ్‍టీ సిటీకి చెప్పారు.
స్వాతంత్య్ర వీర్ సావర్కర్ చిత్రాన్ని తాను అధికారికంగా ఆస్కార్ ప్రతిపాదనకు పంపలేదని, లాపతా లేడీస్ మూవీని మాత్రమే ఎంపిక చేశామని రవి స్పష్టం చేశారు. “వారికి (స్వాతంత్య్ర వీర్ సావర్కర్ మూవీ టీమ్) తప్పుడు సమాచారం వెళ్లినట్టు ఉంది. దీనిపై మేం ప్రకటన విడుదల చేస్తాం. ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్‌కు లాపతా లేడీస్ మాత్రమే వెళ్లింది” అని రవి క్లారిటీ ఇచ్చారు.
మూవీ టీమ్ ఇలా..
స్వాతంత్య్ర వీర్ సావర్కర్ ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్ బరిలో నిలిచిందని, ఎఫ్‍ఎఫ్‍ఐకు ధన్యవాదాలు ఉంటూ మూవీ టీమ్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్టులు చేసింది. ఆస్కార్ రేసులో తమ మూవీ ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ నిర్మాతలు ఆనంద్ పండిట్, సందీప్ సింగ్ కూడా చెప్పారు. చాలా గర్వంగా ఉందని అన్నారు. అయితే, ఈ చిత్రాన్ని ఆస్కార్ రేసుకు పంపలేదని ఎఫ్‍ఎఫ్‍ఐ ప్రెసిడెంట్ చెప్పేశారు.
స్వాతంత్య్ర వీర్ సావర్కర్ చిత్రానికి దర్శకత్వం వహించి ప్రధాన పాత్ర పోషించిన రణ్‍దీప్ హుడా మాత్రం సోషల్ మీడియాలో ఆస్కార్ ఎంట్రీ గురించి ఎలాంటి పోస్ట్ షేర్ చేయలేదు. మొత్తంగా కన్‍ఫ్యూజన్ నెలకొంది.
హిందుత్వవాది, ఆర్ఎస్‍ఎస్‍లో కీలకపాత్ర పోషించిన వినాయక దామోదర్ సావర్కర్ (వీర్ సావర్కర్) జీవితంపై ఈ చిత్రం రూపొందింది. ఈ ఏడాది మార్చి 22వ తేదీన ఈ మూవీ రిలీజ్ అయింది. రణ్‍దీప్ హుడాతో పాటు అంకిత లోఖండే, అమిత్ సియాల్, తీర్థ ముబాద్కర్ కీలకపాత్రలు పోషించారు. రణ్‍దీప్ హుడా ఫిల్మ్స్, లెజెండ్ స్టూడియోస్, అవాక్ ఫిల్మ్స్, ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశాయి.
ఆస్కార్ బరిలో లాపతా లేడీస్
భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ 2025 బరిలో నిలిచింది ‘లాపతా లేడీస్’ చిత్రం. సమాజంలో మహిళల పరిస్థితులను చూపిస్తూ తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా మూవీపై చాలా ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించారు. నితాన్షి గోయెల్, స్పర్శ్ శ్రీవాత్సవ, ప్రతిభ రంటా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది మార్చి 1న థియేటర్లలో రిలీజైన లాపతా లేడీస్ మంచి హిట్ అయింది. ఓటీటీలోకి వచ్చాక మరింత పాపులర్ అయింది. ఇప్పుడు ఇండియా నుంచి ఆస్కార్ రేసుకు వెళ్లింది. రూ.5కోట్ల లోపు బడ్జెట్‍తోనే ఈ మూవీ రూపొందింది. ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతి దేశ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మించారు.