Chinna in OTT: ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధార్థ్ చిన్నా.. ఎందులో చూడాలంటే?
28 November 2023, 7:50 IST
- Chinna in OTT: సిద్ధార్థ్ నటించిన చిన్నా మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మంగళవారం (నవంబర్ 28) నుంచి స్ట్రీమ్ అవుతోంది.
చిన్నా మూవీలో సిద్ధార్థ్
Chinna in OTT: ఒకప్పుడు కోలీవుడ్ తోపాటు టాలీవుడ్, బాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ నటించిన సినిమా చిన్నా. చిత్తా పేరుతో తమిళంలో రిలీజైన ఈ సినిమా తెలుగులో చిన్నా పేరుతో వచ్చింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎస్‌యూ అరుణ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఓ మోస్తరు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
ఇప్పుడీ చిన్నా సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ వచ్చింది. చిన్నా మూవీలో నటించడంతోపాటు దీనికి ప్రొడ్యూసర్ గానూ సిద్ధార్థ్ వ్యవహరించాడు. ఈ మూవీలో సిద్ధార్థ్ తోపాటు సహస్ర శ్రీ, నిమిషా విజయన్, అంజలి నాయర్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.
చిన్నా కథేమిటంటే?
చిన్నా సినిమాలో సిద్ధార్థ్ .. ఈశ్వర్ అలియాస్ చిన్నా అనే క్యారెక్టర్‌లో నటించాడు. ఓ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడనే తప్పుడు ఆరోపణలతో ఈశ్వర్ జీవితం ఎలా తల కిందులైంది? ఆ నింద నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? కనిపించకుండా పోయిన తన అన్న కూతురు ఆచూకీని ఈశ్వర్ ఎలా కనిపెట్టాడన్నదే ఈ సినిమా కథ. తమిళంలో సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ తెలుగులో మాత్రం ఓ వారం ఆలస్యంగా అక్టోబర్ 6న థియేటర్లలోకి వచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కర్ణాటక వెళ్లిన సిద్ధార్థ్ కు అప్పట్లో చేదు అనుభవం ఎదురైంది. అప్పట్లో కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జలాల విషయంలో గొడవలు నడుస్తుండటంతో కర్ణాటకలో ఆందోళన నిర్వహిస్తున్న వారు సినిమా ప్రమోషన్లను అడ్డుకున్నారు. సిద్ధార్థ్ మధ్యలోనే ప్రెస్ మీట్ నుంచి బయటకు వెళ్లిపోయాడు.