తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vikram Health Bulletin: విక్రమ్‌‌కు గుండెపోటు కాదు.. హెల్త్ బులెటిన్ విడుదల

Vikram Health Bulletin: విక్రమ్‌‌కు గుండెపోటు కాదు.. హెల్త్ బులెటిన్ విడుదల

08 July 2022, 21:23 IST

google News
    • కోలీవుడ్ హీరో విక్రమ్‌ ఆరోగ్య స్థితిపై చెన్నై కావేరి ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనకు గుండెపోటు రాలేదని, ఛాతీలో నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరారని స్పష్టం చేశారు.
విక్రమ్ హెల్త్ బులెటిన్
విక్రమ్ హెల్త్ బులెటిన్ (Twitter)

విక్రమ్ హెల్త్ బులెటిన్

తమిళ హీరో చియాన్ విక్రమ్‌కు గుండెపోటు వచ్చినట్లు సర్వత్రా చర్చనీయాంశమైంది. శుక్రవారం విక్రమ్‌ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. దీంతో విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. తాజాగా ఆ వార్తలపై వైద్యులు స్పష్టతనిచ్చారు. ఈ మేరకు చెన్నై కావేరి ఆసుపత్రి.. విక్రమ్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందని, అంతేకానీ.. గుండెపోటు కాదని అందులో స్పష్టం చేశారు.

పాపులర్ తమిళ యాక్టర్ విక్రమ్.. ఛాతీలో అసౌకర్యంగా ఉండటం వల్ల కావేరి ఆసుపత్రిలో చేరారు. మా స్పెషలిస్టు డాక్టర్లు ఆయనకు చికిత్స అందించారు. ఆయనకు గుండెపోటు రాలేదు. ఛాతి నొప్పి మాత్రమే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిమితంగా ఉంది. త్వరలోనే ఆసుపత్రి నుంచి ఆయనను డిశ్చార్జి చేస్తాం అని కావేరి ఆసుపత్రి వైద్య బృందం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది.

విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందని ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. ఆయనకు నిజంగానే గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు హల్చల్ చేశాయి. విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నారు.

విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా సినిమా ఆగస్ట్ లో రిలీజ్ కానుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు అజ‌య్ జ్ఞాన‌ముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం పొన్నియన్ సెల్వన్ లో విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం