Box Office Report 2023: రూ.10 వేల కోట్లు.. 2023లో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన ఇండియన్ సినిమాలు
27 December 2023, 10:39 IST
- Box Office Report 2023: ఈ ఏడాది ఇండియన్ సినిమాలు దుమ్ము దులిపాయి. 2023లో అన్ని భాషల సినిమాలు కలిపి ఏకంగా రూ.10 వేల కోట్లు వసూలు చేయడం నిజంగా విశేషమే.
ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన జవాన్
Box Office Report 2023: కరోనాతో అల్లకల్లోలంగా మారిపోయిన సినిమా ఇండస్ట్రీ వరుసగా రెండో ఏడాది కూడా సక్సెస్ చూసింది. 2023లో బాక్సాఫీస్ దుమ్ముదులిపాయి ఇండియన్ సినిమాలు. ఈ ఏడాది అన్ని భాషల సినిమాలు కలిపి రూ.10 వేల కోట్ల వరకూ వసూళ్లు సాధించడం విశేషం. పఠాన్, జవాన్, లియో, జైలర్, సలార్, యానిమల్, గదర్ 2లాంటి సినిమాలు వందలు, వేల కోట్లు వసూలు చేశాయి.
బాక్సాఫీస్ రిపోర్ట్ 2023 ఇదీ..
ఇండియన్ సినిమాల బాక్సాఫీస్ వసూళ్లను ట్రాక్ చేసే sacnilk.com ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 213 ఇండియన్ సినిమాలు కలిపి రూ.11183.02 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. ఇక నెట్ కలెక్షన్ల విషయానికి వస్తే ఈ 213 సినిమాలు రూ.9526.18 కోట్లు వసూలు చేశాయి. సలార్, డంకీలాంటి సినిమాలు ప్రస్తుతం ఆడుతుండటంతో ఏడాది ముగిసేలోపు నెట్ కలెక్షన్లు రూ.10 వేల కోట్లు అందుకోవడం ఖాయం.
హిందీయే టాప్..
గతేడాది వరుసగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, కాంతారాలాంటి సౌత్ సినిమాల దెబ్బకు కుదేలైన హిందీ మూవీ.. 2023లో బలంగా పుంజుకుంది. ఈ ఏడాది మొత్తం వసూళ్లలో మెజార్టీ హిందీ సినిమాలదే. ఆ ఇండస్ట్రీ వసూళ్లు రూ.4708 కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది 101 సినిమాలు రిలీజయ్యాయి. ఇక తర్వాతి స్థానం మన తెలుగు సినిమాది కావడం విశేషం.
2023లో రిలీజైన 103 తెలుగు సినిమాలు కలిపి రూ.1832 కోట్లు వసూలు చేశాయి. సలార్, వాల్తేర్ వీరయ్య, ఆదిపురుష్, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి, బ్రో, దసరా, జైలర్, బేబీ, విరూపాక్షలాంటి సినిమాలు తెలుగు సినిమా వసూళ్లను అమాంతం పెంచేశాయి. తెలుగులో డిసెంబర్ 26 వరకూ సలార్ రూ.176 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ లో ఉంది. తర్వాత వాల్తేర్ వీరయ్య 159 కోట్లు, ఆదిపురుష్ 133 కోట్లు వసూలు చేశాయి.
టాప్ మూవీస్ ఇవే
ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా షారుక్ ఖాన్ నటించిన జవాన్ నిలిచింది. ఈ సినిమా రూ.1160 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇక రెండో స్థానంలో మరో షారుక్ మూవీ పఠాన్ ఉంది. జనవరి 25, 2023లో రిలీజైన ఈ సినిమా రూ.1050 కోట్లు సాధించింది.
మూడో స్థానంలో రూ.869 కోట్లతో యానిమల్ నిలవడం విశేషం. నాలుగో స్థానంలో గదర్ 2 (రూ.691 కోట్లు) ఉంది. ఇక జైలర్, లియో సినిమాలు కూడా రూ.600 కోట్లకుపైగా వసూళ్లు సాధించాయి.