Farah Khan about RRR: రామ్ చరణ్-ఎన్‌టీఆర్ డ్యాన్స్ చూసి స్పెషల్ ఎఫెక్ట్స్ అనుకున్నా.. ఆర్ఆర్ఆర్‌పై బాలీవుడ్ దర్శకురాలు
21 January 2023, 11:06 IST
- Farah Khan about RRR: ఆర్ఆర్ఆర్ చిత్రపై బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ ప్రశంసల వర్షం కురిపించింది. ఈ సినిమాలో నాటు నాటు పాటకు రామ్ చరణ్-ఎన్‌టీఆర్ డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయానని స్పష్టం చేశారు.
ఫరా ఖాన్
Farah Khan about RRR: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కంచిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం అంతర్జాతీయ వేదికగా పలు అవార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ సహా క్రిటిక్స్ ఛాయిస్, న్యూయార్క్ క్రిటిక్స్ సర్కిల్ ఇలా పలు పురస్కారాలను రాబట్టుకుంది. దీంతో సర్వత్రా సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ దర్శకురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ కూడా ఈ జాబితాలో చేరారు. ఆర్ఆర్ఆర్ సినిమాపై పొగడ్తల వర్షాన్ని కురిపించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ డ్యాన్స్ చూసి తాను ఫిదా అయ్యానని చెప్పుకొచ్చారు.
ఓ బాలీవుడ్ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫరా మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్‌పై సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా నాటు నాటు పాటలో రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ డ్యాన్స్ తనకు తెగ నచ్చిందని తెలిపారు.
"కొరియోగ్రఫీకి ప్రైజ్ ఉంటే తప్పకుండా వారికి ఆ అవార్డు వస్తుంది. ఎవరు అలా డ్యాన్స్ చేయగలరు. ఎంత పర్ఫెక్టుగా వేశారో. నేను చూసి స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమోనని అనుకున్నాను. ఆ పాటకు కొరియోగ్రాఫర్ అద్భుతంగా పనిచేశారు. ఇద్దరూ తమ డ్యాన్స్‌తో అదరగొట్టారు." అని ఫరా ఖాన్ స్పష్టం చేశారు.
ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఇటీవలే పలు అంతర్జాతీయ అవార్డుల వచ్చాయి. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారం వచ్చిది. ఇది కాకుండా నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు లభించాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.