Actor Govinda: బాలీవుడ్ సీనియర్ నటుడి కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్.. ప్రమాదం ఎలా జరిగిందంటే..
01 October 2024, 10:45 IST
- Actor Govinda buller Injury: బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద కాలికి బుల్లెట్ గాయమైంది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలను ఆయన మేనేజర్ వివరించారు.
Actor Govinda: బాలీవుడ్ సీనియర్ నటుడి కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్.. ప్రమాదం ఎలా జరిగిందంటే..
బాలీవుడ్ సీనియర్ నటుడు, శివసేన పార్టీ నేత గోవింద కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ముంబైలోని జుహులో ఉన్న ఆయన ఇంట్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. నేటి (అక్టోబర్ 1) తెల్లవారుజామున 4.45 గంటల సమయంలో ఇది జరిగింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుత పరిస్థితేంటి..
ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి గోవిందను కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వైద్యులు ఆయన మోకాలులోని బుల్లెట్‍ను బయటికి తీశారు. గోవింద పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు ఆయన మేనేజర్ శశి సిన్హా వెల్లడించారు.
ప్రమాదం జరిగిందిలా..
గోవిందకు బుల్లెట్ గాయం ఎలా జరిగిందో మేనేజర్ శశి వివరించారు. కోల్‍కతాకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. చేతిలో నుంచి రివాల్వర్ జారిపడి పేలిందని వెల్లడించారు. దీంతో బుల్లెట్ ఆయన కాలులోకి వెళ్లిందని తెలిపారు.
గోవింద ప్రస్తుతం బాగానే ఉన్నారని మేనేజర్ శశి సిన్హా వెల్లడించారు. “కోల్‍కతాకు వెళ్లేందుకు గోవింద రెడీ అయ్యారు. తన లైసెన్స్డ్ రివాల్వర్‌ను కబోర్డ్‌లో ఆయన పెట్టారు. ఆ సమయంలో రివాల్వర్ ఆయన చేతి నుంచి జారి కిందపడింది. అప్పుడు అది పేలి బుల్లెట్ ఆయన కాలిని తగిలింది. డాకర్లు ఆ బుల్లెట్ తొలగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగుంది. చికిత్స తీసుకుంటున్నారు” అని శశి వెల్లడించారు. గోవింద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పీటీఐ వెల్లడించింది.
బాలీవుడ్‍లో గోవింద చాలా పాపులర్ యాక్టర్. 1980, 1990 దశకాల్లో చాలా సినిమాలు చేశారు. ముందుగా 80ల్లో యాక్షన్ హీరోగా బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత 90ల్లో కామెడీ సినిమాల వైపు ఫోకస్ చేశారు. ఆయన చేసిన చాలా సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‍లుగా నిలిచాయి. రాజాబాబు, దివానా మస్తానా, కూలీ నంబర్ 1, షోాలా ఔట్ షబ్నం, పార్ట్‌నర్, హమ్ సహా చాలా చిత్రాలు బ్లాక్‍బస్టర్లుగా నిలిచాయి. రెండు దశాబ్దాలు ఆయన స్టార్‌డమ్ బాగా సాగింది.
గోవింద యాక్షన్, కామెడీతో పాటు డ్యాన్స్ స్టెప్‍లకు కూడా పాపులర్ అయ్యారు. ఆ కాలంలో కొత్త రకం స్టెప్‍లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కాగా, 2007 తర్వాతి నుంచి ఆయనకు పెద్దగా సక్సెస్‍లు రాలేదు. దీంతో క్రమంగా సినిమాలను తగ్గించేశారు. గత పదేళ్లుగా ఆయన ఎక్కువ చిత్రాలు చేయలేదు. చివరగా 2019లో రంగీలా రాజా మూవీలో కనిపించారు.
సినిమాలు తగ్గించేశాక రాజకీయాల వైపు గోవింద నడిచారు. 2004లోనే కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు. ఓసారి పార్లమెంట్ సభ్యుడిగానూ పని చేశారు. ఈ ఏడాదిలోనే శివసేన పార్టీలో చేరారు గోవింద.