Jabardasth New Anchor: జబర్దస్త్‌కు కొత్త యాంకర్.. కామెడీ షోలో అడుగుపెట్టిన బిగ్‍బాస్ బ్యూటీ
06 November 2023, 14:12 IST
- Jabardasth New Anchor: జబర్దస్త్ కామెడీ షోకు కొత్త యాంకర్ వచ్చేశారు. సౌమ్యరావు స్థానంలో ఓ బిగ్‍బాగ్ బ్యూటీ అడుగుపెడుతున్నారు.
సిరి హన్మంత్
Jabardasth New Anchor: జబర్దస్త్ కామెడీ షో చాలా పాపులర్ అయింది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. జబర్దస్త్ తర్వాత అదనంగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ కూడా వస్తోంది. ముందుగా జబర్దస్త్‌కు అనసూయ యాంకరింగ్ చేశారు. ఆ తర్వాత రష్మీ ఎంటర్ అయ్యారు. అనంతరం ఎక్స్ ట్రా జబర్దస్త్‌ను ఈటీవీ తీసుకొచ్చింది. దీంతో జబర్దస్త్‌కు అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు రష్మీ యాంకరింగ్ చేశారు. వీరిద్దరూ ఈ షోల్లో చాలా సక్సెస్ అయ్యారు. మంచి పాపులర్ అయ్యారు. అయితే, కొంతకాలం క్రితమే జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకున్నారు. ఆ స్థానంలో సౌమ్య రావు వచ్చారు. ఇప్పుడు సౌమ్య కూడా జబర్దస్త్ నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది.
జబర్దస్త్ షోకు తాజాగా సౌమ్య రావు గుడ్‍బై చెప్పినట్టు సమాచారం. దీంతో కొత్త యాంకర్ వచ్చేశారు. జబర్దస్త్ షోకు కొత్త యాంకర్‌గా యూట్యూబ్ సెన్సేషన్, బిగ్‍బాస్ ఫేమ్ సిరి హన్మంత్ వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. నవంబర్ 9వ తేదీ జబర్దస్త్ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో యాంకర్‌గా సిరి హన్మంత్ వచ్చారు.
సిరికి వెల్‍కమ్ చెప్పారు సీనియర్ నటి, జబర్దస్త్ షో జడ్జి ఇంద్రజ. ముందే ఎందుకు వచ్చారని మరో జడ్జి కృష్ణ భగవాన్‍ను ఇంద్రజ ప్రశ్నించారు. దీంతో కొత్త యాంకర్ వచ్చిందని చెప్పటంతో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ముందే వచ్చానని తన స్టైల్‍లో చెప్పారు కృష్ణ భగవాన్. దీంతో జబర్దస్త్ షోకు సిరి హన్మంత్ కొత్త యాంకర్ అని అర్థమైపోయింది. వెల్‍కమ్ టూ జబర్దస్త్.. సిరి అని కృష్ణ భగవాన్ ఆమెకు స్వాగతం పలికారు. ఈ ప్రోమోలో నవ్వులు కురిపిస్తూ అందంగా మెరిశారు సిరి.
జబర్దస్త్ నుంచి తప్పుకున్నాక అనసూయ సినిమాల్లో బిజీ అయ్యారు. దీంతో సీరియల్ నటిగా ఉన్న సౌమ్యరావును తీసుకొచ్చారు. ఇప్పుడు సౌమ్య కూడా వైదొలగడంతో జబర్దస్త్ యాంకర్‌గా సిరి హన్మంత్‍ను తీసుకొచ్చారు. మరోవైపు ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు రష్మీనే యాంకర్‌గా కొనసాగుతున్నారు.
యూట్యూబర్‌గా సిరి హన్మంత్ బాగా పాపులర్ అయ్యారు. కొన్ని టీవీ సీరియళ్లలోనూ నటించారు. ఆ తర్వాత బిగ్‍బాస్ తెలుగు 5వ సీజన్ ద్వారా ఆమె బాగా ఫేమస్ అయ్యారు. ఇక ఇప్పుడు జబర్దస్త్ యాంకర్‌గా అడుగుపెట్టారు.