Bigg Boss 7 Telugu TRP Rating: దుమ్ము రేపిన బిగ్ బాస్ 7 తెలుగు.. రికార్డు టీఆర్పీ సొంతం
14 September 2023, 20:32 IST
- Bigg Boss 7 Telugu TRP Rating: దుమ్ము రేపింది బిగ్ బాస్ 7 తెలుగు. రికార్డు టీఆర్పీ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని స్టార్ మా ఛానెల్ గురువారం (సెప్టెంబర్ 14) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
బిగ్ బాస్ 7 తెలుగు
Bigg Boss 7 Telugu TRP Rating: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ సెప్టెంబర్ 3న ప్రారంభమైన సంగతి తెలుసు కదా. ప్రస్తుతం రెండో వారం నడుస్తోంది. ఈ సీజన్ లో అంతా ఉల్టాపుల్టా అంటూ చాలా రోజుల ముందు నుంచే కొత్త సీజన్ కోసం స్టార్ మా ఛానెల్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఆరో సీజన్ కు దారుణమైన టీఆర్పీ రేటింగ్స్ నేపథ్యంలో ఏడో సీజన్ ప్రారంభానికి ముందే జాగ్రత్త పడింది.
మొత్తానికి స్టార్ మా ఛానెల్ చేసిన ప్రయత్నం ఫలించినట్లే కనిపిస్తోంది. ఈ సీజన్ లో బిగ్ బాస్ షోకి అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు ఆ ఛానెల్ గురువారం (సెప్టెంబర్ 14) వెల్లడించింది. ఇప్పటి వరకూ అన్ని రికార్డులనూ ఈ షో తిరగరాసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
"బిగ్ బాస్ కళ్లు చెదిరే రీతిలో తిరిగి వచ్చింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన రియాల్టీ షో రికార్డులను తిరగరాసింది. అత్యధిక టీవీఆర్ 18.1 సాధించింది" అని స్టార్ మా ఛానెల్ ఆ ట్వీట్ ద్వారా చెప్పింది.
తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పుడు ఈ షో చూస్తున్నారు. ఇంచుమించు 5. 1 కోట్ల ప్రేక్షకులు మొదటి వారం బిగ్ బాస్ షో చూశారని గణాంకాలు చెబుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఆవిష్కరణ కార్యక్రమాన్ని సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూడడంతో గతంలో క్రికెట్ మ్యాచ్ ల వీక్షణ పరంగా నమోదైన రికార్డు లను కూడా తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 అధిగమించటం విశేషం. ఈ సీజన్ బిగ్ బాస్ ఎంతగా ఉర్రూతలూగించిందో చెప్పాలంటే గత సీజన్ లో సాధించిన రేటింగ్ తో పోలిస్తే 40% అధిక రేటింగ్ నిదర్శనం అని చెప్పాలి.
బిగ్ బాస్ 7 తెలుగు 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన విషయం తెలిసిందే. వీళ్లలో తొలి వారం నటి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది. నామినేషన్స్ లో ఉన్న ఆమెకు తొలి రోజు నుంచే తక్కువ ఓటింగ్స్ రావడంతో ఆదివారం వచ్చేసరికి ఎలిమినేట్ అయిపోయింది. ఇక సోమవారం (సెప్టెంబర్ 11) నుంచి మంగళవారం (సెప్టెంబర్ 12) వరకు నామినేషన్లు హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే. ఇలా బిగ్ బాస్ 7 తెలుగు రెండోవారం 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.
బిగ్ బాస్ 7 తెలుగు రెండో వారం అత్యధిక ఓట్లతో పల్లవి ప్రశాంత్, హీరో శివాజీ, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, , అమర్ దీప్ చౌదరి, రతిక రోజ్, షకీల, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్ నామినేట్ అయ్యారు. వీరిలో అందరితో పల్లవి ప్రశాంత్ ఎక్కువగా టార్గెట్ అయ్యాడు. అతన్ని తొమ్మిది మంది నామినేట్ చేశారు. ప్రశాంత్‍పై స్టార్ మా సీరియల్ బ్యాచ్ అయినా అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి విరుచుకుపడ్డారు. వాళ్లకు ఆట సందీప్, రతిక రోజ్ సపోర్ట్ కూడా చేశారు.
అయితే నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లలో ఉన్న ప్రశాంత్‍కే మళ్లీ ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు పడ్డాయి. పల్లవి ప్రశాంత్ 39.56 శాతంతో టాప్‍లో ఉండగా రెండో స్థానంలో శివాజీ 20.93 శాతం ఓట్లతో ఉన్నాడు. ఇక అమర్ దీప్ చౌదరికి 17.94 శాతం, రతికకు 8.18 శాతం, గౌతమ్ కృష్ణకు 3.21 శాతం, ప్రిన్స్ యావర్ 3.06 శాతం, శోభా శెట్టి 2.51 శాతం, షకీలకు 2.34 శాతం, టేస్టీ తేజ 2.28 శాతం ఓట్లు నమోదు అయ్యాయి. నామినేషన్లలో పల్లవి ప్రశాంత్‍ను అందరూ కలిసి జీరోను చేయాలని చూశారు. కానీ, అదే అతనికి ప్లస్ అయి హీరోలా నిలిచాడు.
ఇలానే ఓటింగ్ ఫ్లో కొనసాగితే చివరి రెండు స్థానాల్లో ఉన్న షకీల లేదా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. టేస్టీ తేజ తన కామెడీతో బాగానే అలరిస్తున్నాడు. కాబట్టి, అతను వెళ్లే ఛాన్సెస్ తక్కువగానే కనిపిస్తున్నాయి. టేస్టీ తేజ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటే.. షకీల, శోభా శెట్టిలో ఒకరు హౌజ్ నుంచి బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది.