Bagheera Movie Review: భగీరా మూవీ రివ్యూ - ప్రభుదేవా సైకో కిల్లర్ సినిమా ఎలా ఉందంటే
07 April 2023, 14:52 IST
Bagheera Movie Review: ప్రభుదేవా హీరోగా ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన భగీరా సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది.
ప్రభుదేవా, అమైరా దస్తూర్
Bagheera Movie Review: ప్రభుదేవా హీరోగా నటించిన తాజా తమిళ సినిమా భగీరా. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీ ద్వారా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సైకో కిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే...
టెడ్డీ బేర్ మర్డర్స్...
నగరంలో వరుసగా అమ్మాయిలు హత్యకు గురవుతుంటారు. వారిని ఓ టెడ్డీబేర్ సహాయంతో సైకో కిల్లర్ హతమారుస్తున్నాడని పోలీసుల ఇన్వేస్టిగేషన్‌లో తేలుతుంది. ఆ హంతకుడిని పట్టుకునేందుకు ఇన్‌స్పెక్టర్ సాయికుమార్ (సాయికుమార్) రంగంలోకి దిగుతాడు. భగీరా అనే యాప్ కారణంగా ఈ అమ్మాయిలందరూ హత్యకు గురవుతున్నారని సాయికుమార్ తెలుసుకుంటాడు.
మరోవైపు వేదవల్లి, రిణు, పల్లవి, అలియాలను వివిధ పేర్లతో ప్రభు (ప్రభుదేవా) ప్రేమిస్తాడు. అతడు ప్రేమించిన ఆ అమ్మాయిలు అందరూ కనిపించకుండా పోతారు. వారి అదృశ్యం వెనుక భగీరా (ప్రభుదేవా) హస్తం ఉందా? భగీరా, ప్రభు ఒకే పోలికలతో ఉండటానికి కారణమేమిటి?
ప్రభు సోదరుడు మురళి (శ్రీరామ్)ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నాడు? అమ్మాయిలపై పగను పెంచుకున్న సైకో కిల్లర్ వారిని చంపడానికి కారణం ఏమిటి? అతడిలో రమ్య(అమైరా దస్తూర్) ఎలా మార్పు తీసుకొచ్చిందన్నదే భగీరా(Bagheera Movie Review)సినిమా కథ.
సైకో కిల్లర్ ఫార్ములా...
సైకో కిల్లర్ కథాంశాలతో తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో పలు సినిమాలు రూపొందాయి. భాషలు, హీరోలు, దర్శకులు వేరైనా ఈ సినిమాల కాన్సెప్ట్‌లు దాదాపు ఒకే రీతిలో సాగుతుంటాయి. తమ ఫ్యామిలీ, సన్నిహితులకు జరిగిన అన్యాయాన్ని సహించలేని ఓ వ్యక్తి సైకోగా మారి హత్యలు చేయడం, దాని వెనుక ఫ్లాష్‌బ్యాక్ ..ఇలా ఈ కథలకు ఓ టెంప్లేట్ ఫార్మెట్ ఫిక్స్ అయిపోయింది.
భగీరా కూడా ఆ కోవలో సాగే రొటీన్ సైకో కిల్లర్ మూవీ. ప్రేమ పేరుతో అమ్మాయిలు చేసే మోసాన్ని సహించలేని ఓ యువకుడు సైకోగా మారి హత్యలు చేయడమనే పాయింట్‌తో దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ భగీరా కథను రాసుకున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీతో పాటు రొమాన్స్ దండిగానే ఉండేలా చూసుకుంటూ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమాను తెరకెక్కించాడు.
గందరగోళం...
భగీరా ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రభుదేవా మారువేషాల్లో ఒక్కో అమ్మాయిని ట్రాప్ చేసే సన్నివేశాలతో నడిపించారు దర్శకుడు. వివిధ గెటప్‌లు, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒకదాని తర్వాత మరొకటి ఎంట్రీ ఇస్తూ తికమకపెడతాయి. ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుందో...భగీరా ఎందుకు హత్యలు చేస్తున్నాడో అంతుపట్టదు.
ఈ చిక్కుముడులన్నింటికి సెకండాఫ్‌లో విప్పుకుంటూ వెళ్లాడు డైరెక్టర్. ఆ హత్యలకు రీజన్ అంటూ అన్నదమ్ముల బాండింగ్ పేరుతో నైంటీస్ కాలం నాటి రొటీన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో ఓపికకు పరీక్ష పెట్టాడు డైరెక్టర్. కథకు కీలకమైన ఆ ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా ప్రజెంట్ చేయలేకపోయాడు.
ఎన్నో సినిమాల్లో చూసిన కామన్ పాయింట్‌తో ఈ ఫ్లాష్‌బ్యాక్ సాగుతుంది. క్లైమాక్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసేలానే ఉంటుంది. సింపుల్ పాయింట్‌ను రివర్స్ స్క్రీన్‌ప్లేతో కొత్తగా చెప్పాలని అనుకున్న దర్శకుడి ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది.
నెగెటివ్ షేడ్స్‌లో...
ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో ప్రభుదేవా నటించాడు. కథానుగుణంగా వివిధ గెటప్‌లలో కనిపించాడు. పసలేని కథ కావడంతో ఈ సినిమా కోసం అతడు పడిన శ్రమ మొత్తం వృథాగా మారింది. శ్రీరామ్ క్యారెక్టర్ లెంగ్త్ తక్కువే. ఈ సినిమాలో మొత్తం ఏడుగురు హీరోయిన్లు ఉన్నా ఒక్క అమైరా దస్తూర్ తప్ప మిగిలిన వారందరూ గెస్ట్ రోల్స్‌లోనే నటించారు.
Bagheera Movie Review- ప్రేక్షకులకు టార్చర్...
ప్రేక్షకుల్ని టార్చర్‌కు గురిచేసే సైకో కిల్లర్ సినిమా ఇది. ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ వరకు గందరగోళంగా సాగుతుంది. కథ నుంచి హీరో క్యారెక్టరైజేషన్‌తో పాటు అతడి గెటప్‌లు, మిగిలిన పాత్రలు అన్ని సహనానికి పరీక్ష పెడతాయి.
టాపిక్