తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kaun Banega Crorepati: 44 ఏళ్ల కిందటి రూ.10 అప్పు తీర్చేసిన అమితాబ్‌ బచ్చన్‌

Kaun Banega Crorepati: 44 ఏళ్ల కిందటి రూ.10 అప్పు తీర్చేసిన అమితాబ్‌ బచ్చన్‌

HT Telugu Desk HT Telugu

09 August 2022, 14:36 IST

google News
    • Kaun Banega Crorepati: బాలీవుడ్‌ షెహన్‌షా అమితాబ్‌ బచ్చన్‌ తన 44 ఏళ్ల కిందటి అప్పు తీర్చేశాడు. ఆ అప్పు ఎంతో తెలుసా? రూ.10. ఇది నిజంగా నిజం. దీని వెనుక స్టోరీ ఏంటో తెలుసుకోండి.
కౌన్ బనేగా క్రోర్ పతి షోలో ధులిచంద్, అమితాబ్ బచ్చన్
కౌన్ బనేగా క్రోర్ పతి షోలో ధులిచంద్, అమితాబ్ బచ్చన్ (Twitter)

కౌన్ బనేగా క్రోర్ పతి షోలో ధులిచంద్, అమితాబ్ బచ్చన్

అమితాబ్‌ బచ్చన్‌.. బాలీవుడ్‌ను దశాబ్దాల పాటు ఏలిన ఈ మెగాస్టార్‌ కూడా నిజానికి అప్పుల పాలయ్యాడు. ఏబీసీ నిర్మాణ సంస్థ పెట్టి అప్పట్లో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఆ తర్వాత కౌన్‌ బనేగా క్రోర్‌పతి, వరుస సినిమాలతో మళ్లీ గాడిలో పడి.. ఆ ఊబిలో నుంచి బయటపడ్డాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అప్పు దానికి సంబంధం లేదు. ఇది బిగ్‌ బీకి నేరుగా సంబంధం లేని అప్పు.

అతడు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్‌ బనేగా క్రోర్‌పతికి వచ్చిన ఓ కంటెస్టెంట్‌ 1978నాటి అప్పును బిగ్‌ బీకి గుర్తు చేశాడు. అప్పట్లో ఇతని దగ్గర అమితాబ్‌ నేరుగా చేసిన అప్పు కూడా కాదు అది. ఆ ఏడాది అమితాబ్‌ మూవీ ముకద్దర్‌ కా సికందర్‌ సినిమాకు వెళ్లినప్పుడు తన జేబులో నుంచి ఎవరో రూ.10 కొట్టేశారట. దానిని అమితాబ్‌ అప్పుల ఖాతాలో వేసేశాడు ధులిచంద్‌ అనే ఆ కంటెస్టెంట్‌.

ఈ షోలో రూ.320000 చెక్‌ను అమితాబ్‌ నుంచి అందుకునే సమయంలో.. ఇందులో రూ.10 తక్కువగా ఇస్తున్నారని ధులిచంద్‌ అనడంతో బిగ్‌ బీ ఆశ్చర్యపోయాడు. అదేంటని అడిగితే.. అతడు అసలు విషయం చెప్పాడు. చత్తీస్‌గడ్‌లోని దుర్గ్‌కు చెందిన ధులిచంద్‌ అప్పుడు జరిగిన విషయం వెల్లడిస్తూ.. "అప్పట్లో కాలేజీలో చదివేవాడిని. ఆ సమయంలో మా కుటుంబ పరిస్థితి బాగా లేక నా దగ్గర పెద్దగా డబ్బు ఉండేది కాదు. 

రూ.10 జేబులో పెట్టుకొని సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లాను. ఈ డబ్బుతోనే సినిమా చూడటంతోపాటు భోజనం తినాలి, నా సైకిల్‌లో గాలి కొట్టించాలి. కానీ టికెట్ కౌంటర్‌ దగ్గర పెద్ద క్యూ ఉంది. పోలీసులు లాఠీఛార్జ్‌ చేస్తే నేను కూడా గాయపడ్డాను. అప్పుడే ఇక ఈ సినిమా చూడకూడదు. ఆ డబ్బు మీ దగ్గర నుంచి తీసుకొని మీతోనే కలిసి చూడాలని అనుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.

ఇది విని బిగ్‌ బీ స్పందించాడు. సమయం ఉన్నప్పుడు కచ్చితంగా కలిసి సినిమా చూద్దామని చెప్పాడు. కేబీసీలోకి రావడానికి తాను 21 ఏళ్లుగా వేచి చూస్తున్నట్లు కూడా ధులిచంద్‌ చెప్పడం విశేషం. అంతేకాదు బిగ్‌ బీ అప్పుడు అతడు కోల్పోయిన రూ.10కి మరో రూ.10 కలిపి రూ.20 ఇచ్చి తన అప్పు తీర్చుకున్నాడు. చివరికి ఈ షోలో ధులిచంద్‌ రూ.25 లక్షలు గెలుచుకోవడం విశేషం.

తదుపరి వ్యాసం