Amitabh Bachchan 80th Birthday: అమితాబ్ బర్త్‌డే స్పెషల్.. ఆ 22 థియేటర్లలో 11 సినిమాలు
30 September 2022, 17:25 IST
- Amitabh Bachchan 80th Birthday: అమితాబ్ బర్త్‌డే సందర్భంగా దేశవ్యాప్తంగా పీవీఆర్ స్పెషల్ షోలు వేస్తోంది. దేశంలోని 17 నగరాల్లోని 22 థియేటర్లలో బిగ్ బీ 11 హిట్ సినిమాలను ప్రదర్శించనుంది.
అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan 80th Birthday: బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ త్వరలోనే తన 80వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. అక్టోబర్ 11న బిగ్ బీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని బర్త్‌డేను స్పెషల్‌గా జరుపుకోవడానికి సిద్ధమవుతోంది పీవీఆర్ సినిమాస్. అక్టోబర్ 8 నుంచి 11 వరకూ నాలుగు రోజుల పాటు అమితాబ్‌కు చెందిన 11 సినిమాలను ప్రదర్శించాలని నిర్ణయించింది.
'బచ్చన్ బ్యాక్ టు ద బిగినింగ్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించి ఈ మూవీస్‌ను ప్రదర్శించనున్నారు. దీనికోసం ఇప్పటికే అమితాబ్‌కు చెందిన ఐకానిక్ మూవీస్‌ను ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 17 నగరాల్లోని తమ 22 పీవీఆర్ సినిమాస్‌లో ఈ సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. ఇక ఈ అన్ని సినిమాలను చూడాలనుకునే అభిమానులకు కూడా ఒకే పాస్ ఇవ్వడానికి పీవీఆర్ ప్లాన్ చేస్తోంది.
వీటిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు. ఇక ముంబైలోని పీవీఆర్ జుహులో అమితాబ్ బచ్చన్‌కు చెందిన ఫొటోలు, పోస్టర్ల ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. పీవీఆర్ సినిమాస్ చేపట్టిన ఈ స్పెషల్ ప్రోగ్రామ్ అమితాబ్‌కు బాగా నచ్చింది. ఇది గడిచిపోయిన ఆ శకాన్ని మళ్లీ కళ్ల ముందుకు తెస్తుందని బిగ్ బీ ఒక ప్రకటనలో అన్నాడు.
"ఇలా ఏదో ఒక రోజు నా హిట్ సినిమాలన్నీ మరోసారి దేశవ్యాప్తంగా థియేటర్లలో ఆడతాయని ఎప్పుడూ అనుకోలేదు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, పీవీఆర్ తీసుకొన్ని గొప్ప కార్యక్రమం. ఇది నా నటననే కాదు ఆ డైరెక్టర్లు, నా సహచర నటులు, టెక్నీషియన్ల పనిని చూసే అవకాశం ప్రేక్షకులకు ఇస్తుంది. అప్పటి మరచిపోయిన శకాన్ని తిరిగి తీసుకొస్తుంది. అందుకే దేశ సినీ వారసత్వాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎన్నో వచ్చి ఇండియన్ సినిమాలో అద్భుతాలుగా మిగిలిపోయిన సినిమాలను తిరిగి బిగ్ స్క్రీన్లకు తీసుకురావాలని కోరుకుంటున్నా" అని అమితాబ్ అన్నాడు.
ఆ 11 సినిమాలు ఇవే..
అమితాబ్ 80వ పుట్టినరోజును జరుపుకోవడంలో భాగంగా ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని పీవీఆర్ లిమిటెడ్ సీఎండీ అజయ్ బాలాజీ అన్నారు. ఇక ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా అమితాబ్ బచ్చన్‌కు హిట్ సినిమాలైన కాలా పత్తర్, కాలియా, కభీ కభీ, అమర్ అక్బర్ ఆంటోనీ, నమక్ హలాల్, డాన్, అభిమాన్, సత్తే పె సత్తా, మిలీ, చుప్‌కే చుప్‌కే, దీవార్ సినిమాలను ప్రదర్శించనున్నారు.