తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ‌Amaran: అమరన్ డైరెక్టర్‌కి మేజర్ ముకుంద్ ఫ్యామిలీ ఒకే ఒక రిక్వెస్ట్, సినిమాలో గోప్యంగా ఉంచిన దర్శకుడు

‌Amaran: అమరన్ డైరెక్టర్‌కి మేజర్ ముకుంద్ ఫ్యామిలీ ఒకే ఒక రిక్వెస్ట్, సినిమాలో గోప్యంగా ఉంచిన దర్శకుడు

Galeti Rajendra HT Telugu

05 November 2024, 18:45 IST

google News
  • Major Mukund family: దీపావళి రోజున విడుదలైన అమరన్ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కానీ.. తమిళనాడులోని ఓ వర్గం ప్రజలు మాత్రం సినిమాలో ఒక విషయాన్ని గోప్యంగా ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఏంటంటే? 

సాయి పల్లవి, శివ కార్తికేయన్
సాయి పల్లవి, శివ కార్తికేయన్

సాయి పల్లవి, శివ కార్తికేయన్

శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ పాజిటివ్ టాక్‌తో సౌత్‌లో దూసుకెళ్తోంది. దీపావళి రోజున విడుదలైన ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోగా.. రూ.200 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది.

ఎవరు ఈ మేజర్ ముకుంద్?

2014లో ఉగ్రదాడిలో అసువులు బాసిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌‌ని ‘అమరన్‌’గా రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించారు. 2009లో ఇందు రెబెక్కా వర్గీస్‌ను మేజర్ ముకుంద్ వివాహం చేసుకోగా.. వీరికి 2011లో అర్షియా ముకుంద్ అనే కుమార్తె జన్మించింది. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడ్రన్ మిలిటరీ హీరోస్ ఆధారంగా అమరన్‌ సినిమాని దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించారు.

ఆ విషయం గోప్యంగా

అమరన్‌లో మేజర్ ముకుంద్ వరదరాజన్‌గా శివ కార్తికేయన్ నటించగా.. ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించింది. అయితే.. ఈ సినిమా కథ చర్చ దశలోనే ముకుంద్ ఫ్యామిలీ నుంచి తనకి ఒక రిక్వెస్ట్ వచ్చినట్లు డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి తాాజాగా గుర్తు చేసుకున్నాడు. సినిమాలో ఎక్కడా ముకుంద్ క్యాస్ట్‌ ప్రస్తావన తీసుకురావొద్దని.. భారతీయుడిగా మాత్రమే చూపించాలని ముకుంద్ ఫ్యామిలీ కోరిందట.

కానీ.. ముకుంద్ తమిళనాడుకి చెందిన వ్యక్తి కావడంతో.. సినిమాలో ముకుంద్ కులాన్ని ప్రస్తావించకపోవడంపై ఓ వర్గం ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో తాను అలా కులం గురించి సినిమాలో గోప్యంగా ఉంచడానికి కారణాన్ని రాజ్ కుమార్ పెరియసామి వెల్లడించాడు.

తమిళ్ హీరో మాత్రమే

ముకుంద్ తమిళుడు కాబట్టి బలమైన తమిళ మూలాలున్న వ్యక్తిని నటింపజేయాలని ముకుంద్ భార్య ఇందు సూచించినట్లు కూడా డైరెక్టర్ పెరియసామి గుర్తు చేసుకున్నాడు. ఆమె కోరినట్లే శివ కార్తికేయన్‌ని ఎంపిక చేయగా.. చాలా సహజసిద్ధంగా నటించినట్లు ప్రశంసించాడు.

అమరన్ మూవీ ఇప్పటి వరకు రూ.140 కోట్లు వసూలు చేయగా.. తమిళనాడులో సుమారు 60% థియేటర్ల ఆక్యుపెన్సీతో కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ క, లక్కీ భాస్కర్‌ సినిమాలకి గట్టి పోటీనిస్తోంది. మిగిలిన రెండు సినిమాలతో పోలిస్తే ఎక్కువ పాజిటివ్ మౌత్ టాక్ అమరన్‌కే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్‌ కూడా అమరన్‌కి ఉపయోగపడుతోంది.

ఓటీటీలో అమరన్ ఎప్పుడంటే?

తమిళనాడులో ఇప్పటికే సీఎం స్టాలిన్, సూపర్ స్టార్ రజినీకాంత్ తదితరులు ఈ సినిమా చూసి ప్రశంసల వర్షం కురిపించారు. టాలీవుడ్‌ హీరోలు కూడా చాలా మంది అమరన్‌ మూవీపై పాజిటివ్‌గా ట్వీట్స్ చేశారు. నవంబరు చివర్లో అమరన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. 

నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకి అమరన్ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సినిమాలు రిలీజైన 4 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే.. అమరన్‌ మరి కొన్ని రోజులు థియేటర్లలో నడిచే అవకాశం ఉండటంతో.. కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలూ లేకపోలేదు. 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం