Amaran Collections: మూడు రోజుల్లోనే వసూళ్లలో అమరన్ అరుదైన రికార్డ్.. శివ కార్తికేయన్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ
Amaran Box Office Collections: శివ కార్తికేయన్ సినిమాల్లో ఇప్పటి వరకు రెండు మాత్రమే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరగా.. ఆ మార్క్‌ని అందుకోవడానికి 12 రోజులు పైనే తీసుకున్నాయి. కానీ.. అమరన్ మూవీకి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా?
తమిళ్ హీరో శివ కార్తికేయన్ నటించిన అమరన్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు కొనసాగిస్తోంది. దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లని వసూలు చేసింది. ఇందులో ఒక్క తమిళనాడులోనే రూ.50 కోట్లకి పైగా గ్రాస్ ఉండగా.. మిగిలిన రూ.50 కోట్లలో తెలుగు రాష్ట్రాల నుంచే వాటా ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి.
తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులతో 2014లో పోరాడుతూ అసువులు బాసిన మేజర్ ముకుంద్ వరద రాజన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించారు. ఈ మూవీలో శివ కార్తికేయన్ సరసన మేజర్ భార్య ఇందు రెబెకా జాన్ వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించగా.. సీనియర్ హీరో కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. అక్టోబరు 31న విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
అమరన్ మూవీకి పాజిటివ్ మౌత్ టాక్‌తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్, తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ తదితరులు ప్రమోషన్ కల్పిస్తూ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. సినిమా చూసి.. చాలా బాగుంది అంటూ ప్రముఖులు ప్రశంసిస్తుండటంతో అమరన్ కలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే తమిళనాడులో ముప్పావు శాతం థియేటర్ల ఆక్యుపెన్సీని అమరన్ సొంతం చేసుకుంది.
3 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్
శివ కార్తికేయన్ సినిమాల్లో ఇప్పటి వరకు డాన్, డాక్టర్ సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లో ఉండగా.. ఇవి రెండూ ఆ మార్క్‌ని చేరుకోవడానికి కనీసం ఒకటి 12, మరొకటి 25 రోజులు తీసుకున్నాయి. కానీ.. అమరన్ మాత్రం కేవలం 3 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోవడం గమనార్హం. దాంతో శివ కార్తికేయన్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీ అంటూ అతని అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి అమరన్ మూవీ తొలి రోజు వసూలు చేసింది రూ.35 కోట్లు మాత్రమే. కానీ.. పాజిటివ్ టాక్ రావడం, మౌత్ పబ్లిసిటీ పెరగడం, వీకెండ్ కలిసి రావడంతో మిగిలిన రెండు రోజుల్లోనే రూ.65 కోట్లు రాబట్టేసింది. ప్రస్తుతం అమరన్ మూవీకి పోటీగా లక్కీ భాస్కర్,క మాత్రమే ఉన్నాయి. సౌత్‌లో సాయి పల్లవి క్రేజ్ కూడా ఈ సినిమాకి బాగా ఉపయోగపడుతోంది.
అమరన్ ఓటీటీపై సందిగ్ధత
అమరన్ ఓటీటీ రిలీజ్‌పై కాస్త సందిగ్ధత నడుస్తోంది. ఈ మూవీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ మూవీ రైట్స్‌ను కొనుగోలు చేయగా.. నవంబరు ఆఖర్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. కానీ.. పాజిటివ్ టాక్‌తో సినిమా ఇంకొన్ని రోజులు నడిచే అవకాశం ఉండటంతో ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమయ్యే అవకాశాలూ లేకపోలేదు. సాధారణంగా సినిమా రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.