Allu Arjun: చిరంజీవిని కలిసిన అల్లు అర్జున్ - కుటుంబంతో కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్లిన బన్నీ!
15 December 2024, 12:57 IST
Allu Arjun: ఆదివారం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. కుటుంబసభ్యులతో కలిసి చిరంజీవిని కలిశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన బన్నీ జైలు నుంచి రిలీజైన తర్వాత చిరంజీవిని కలవడం ఆసక్తికరంగా మారింది.
అల్లు అర్జున్
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ వార్త దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 పెయిడ్ ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళా అభిమాని మృతి చెందింది. ఆమె కొడుకు అస్వస్థతతో హాస్పిటల్ పాలయ్యాడు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైకోర్టు బెయిల్...
ఈ తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నాంపల్లి కోర్డు అల్లు అర్జున్‌కు 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు అతడిని పోలీసులు తరలించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా శుక్రవారం రాత్రి మొత్తం బన్నీ జైలులోనే గడపాల్సివచ్చింది. శనివారం ఉదయం జైలు నుంచి రిలీజయ్యాడు.
బన్నీకి పరామర్శలు...
జైలు నుంచి రిలీజైన బన్నీని సినీ ప్రముఖులు పరామర్శించారు. వెంకటేష్, సుకుమార్, బోయపాటి శ్రీనుతో పాటు పలువురు టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, హీరోలు అల్లు అర్జున్‌ను కలిశారు. ప్రభాస్, ఎన్టీఆర్‌తో పాటు మరికొందరు ఫోన్‌లోనే బన్నీని పరామర్శించినట్లు చెబుతోన్నారు. .
చిరంజీవి సతీమణి ఒక్కరే...
మెగా ఫ్యామిలీ నుంచి కేవలం చిరంజీవి సతీమణి సురేఖ ఒక్కరే శనివారం... బన్నీ ఇంటికి రావడం ఆసక్తికరంగా మారింది. మెగా యంగ్ హీరోలు సైతం ఎవరూ బన్నీ కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కుటుంబంతో మెగాస్టార్ ఇంటికి...
తాజాగా ఆదివారం అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. భార్య స్నేహారెడ్డితో పాటు పిల్లలతో కలిసి మెగాస్టార్‌ను అల్లు అర్జున్ కలిశాడు. తానే స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికి చేరుకున్నాడు. చిరంజీవి ఇంటికి బన్నీ చేరుకున్న వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
చిరు ఓదార్పు...
అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత చిరంజీవి, సురేఖతో పాటు నాగబాబు బన్నీ ఇంటికి వచ్చారు. కుటుంబసభ్యులను ఓదార్చారు.చిరంజీవికి సన్నిహితుడైన లాయర్ నిరంజన్‌రెడ్డి బన్నీకి హైకోర్టు ద్వారా బెయిల్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. బన్నీ జైలు నుంచి రిలీజ్ కావడానికి చిరంజీవి, పవన్ కల్యాణ్ సైతం పావులు కదిపినట్లు ప్రచారం జరుగుతోంది.
చిరంజీవికి కృతజ్ఞతలు...
కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన మేనమామ ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు కేసు నుంచి బయటపడటానికి ఏం చేయాలనే విషయంలో చిరంజీవి, అల్లు అర్జున్ ఫ్యామిలీస్ చర్చించుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీరి మధ్య ఎలాంటి చర్చలు జరుగతున్నాయని అన్నది ఆసక్తికరంగా మారింది.
మెగా ఫ్యామిలీతో విభేదాలు
మరోవైపు గత కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌కు విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ గొడవలపై ఇప్పటివరకు అటు మెగా ఫ్యామిలీ, ఇటు అల్లు ఫ్యామిలీ పెదవి విప్పలేదు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా మెగా ఫ్యామిలీలోని హీరోలు ఎవరూ సినిమాకుగానీ, అల్లు అర్జున్‌కుగానీ సపోర్ట్ చేస్తూ ఎలాంటి ట్వీట్స్ చేయలేదు. అల్లు అర్జెస్ సందర్భంగానే కాకుండా జైలు నుంచి రిలీజైన తర్వాత కూడా రియాక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో చిరంజీవిని బన్నీ కలవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీతో మెగా, అల్లు గొడవలకు పుల్‌స్టాప్ పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టాపిక్