Celebrity Cricket League 2023: సీసీఎల్‌లో అఖిల్ అదుర్స్.. తెలుగు వారియర్స్ బోణీ
20 February 2023, 6:09 IST
- Celebrity Cricket League 2023: సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టు బోణీ కొట్టింది. రాయపుర్ వేదికగా కేరళ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. అఖిల్ రికార్డు అర్ధశతకంతో అదరగొట్టాడు.
కేరళ స్ట్రైకర్స్ పై తెలుగు వారియర్స్ విజయం
Celebrity Cricket League 2023: సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 2023 ఇటీవలే ఆరంభమైన సంగతి తెలిసిందే. వివిధ భాషల చిత్రసీమల జట్లుగా ఏర్పడి ఆడుతున్న ఈ టోర్నీ ఐపీఎల్ మ్యాచ్‌లను తలపిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం నాడు తెలుగు వారియర్స్-కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో తెలుగు వారియర్స్ జట్టు అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. కేరళ స్ట్రైకర్స్‌పై 64 పరుగుల తేడాతో గెలిచింది. కెప్టెన్ అఖిల్ అక్కినేని 30 బంతుల్లోనే 91 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేరళ స్ట్రైకర్స్ జట్టు.. తెలుగు వారియర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో నిర్ణీత 10 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి టాలీవుడ్ 154 పరుగుల భారీ స్కోరును సాధించింది. అఖిల్ అక్కినేని తనదైన శైలిలో కేరళ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వరుస పెట్టి ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. మరో ఓపెనర్ ప్రిన్స్ కూడా 23 బంతుల్లో 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా తెలుగు వారియర్స్ భారీ స్కోరును సాధించగలిగింది.
అనంతరం లక్ష్య ఛేదనలో కేరళ స్ట్రైకర్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. ఓపెనర్లు సిద్ధార్థ్ మీనన్, రాజీవ్ పిళ్లై 38 పరుగులతో చెలరేగారు. కెప్టెన్ ఉన్ని ముకుందన్ 23 పరుగులు చేశాడు. అయితే తెలుగు వారియర్స్ బౌలర్ల దెబ్బకు కేరళ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా ప్రయాణించారు. తెలుగు వారియర్స్ జట్టులో ప్రిన్స్, తమన్ విజృంభించారు. ఫలితంగా కేరళ స్ట్రైకర్స్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 105 పరుగులకే పరిమితమైంది.
ఈ మ్యాచ్‌లో టాలీవుడ్ తారల సందడి చేశారు. హీరో విక్టరీ వెంకటేష్ దగ్గరుండి మరి జట్టుకు సపోర్ట్ చేశారు. అఖిల్ అక్కినేని ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతున్న వేళ.. స్టేడియమంతా సందడి వాతావరణం నెలకొంది.
ఫిబ్రవరి 18న ప్రారంభమైన సీసీఎల్ 2023 రెండో రోజు తెలుగు వారియర్స్-కేరళ స్ట్రైకర్స్ కాకుండా మరో మ్యాచ్ కూడా జరిగింది. రాయపుర్ వేదికగా సోనూసూద్ కెప్టెన్సీలో పంజాబ్ డీ షేర్, మనోజ్ తీవారి నేతృత్వంలో భోజ్‌పురి దబాంగ్స్ పోటీ పడ్డాయి. అయితే పంజాబ్ డీ షేర్‌పై బోజ్‌పురి జట్టు 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.