Adipurush Review: ఆదిపురుష్ మూవీ రివ్యూ - ప్రభాస్ మైథలాజికల్ విజువల్ వండర్ ఎలా ఉందంటే?
16 June 2023, 12:31 IST
Adipurush Review: ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ సినిమా శుక్రవారం (జూన్ 16) థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రామాయణ గాథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే....
ప్రభాస్
Adipurush Review: టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్(Prabhas) కెరీర్‌లోనే ప్రత్యేకమైన సినిమాగా ఆదిపురుష్ (Adipurush) శుక్రవారం (జూన్ 16) థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది.రామాయణ గాథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ఓంరౌత్ (OmRaut) దర్శకత్వం వహించాడు. ఆదిపురుష్ సినిమాలో కృతిసనన్, సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), దేవదత్తనాగ, సన్నీసింగ్ కీలక పాత్రలను పోషించారు. వరల్డ్‌వైడ్‌గా భారీ అంచనాలతో రిలీజైన ఆదిపురుష్ సినిమా ఎలా ఉంది? ఈ ఆధునిక రామాయణం ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పించిందో తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే…
వనవాసంతో మొదలు....
రామాయణగాథ ప్రతి భారతీయుడికి చిరపరిచితమే. కానీ ఆదిపురుష్ సినిమాలో మొత్తం రామాయణ కథను చూపించలేదు డైరెక్టర్ ఓం రౌత్. రామాయణంలోని అరణ్య కాండ, యుద్ధకాండలను మాత్రమే తెరపై ఆవిష్కరించారు. తండ్రి మాటకు కట్టుబడి భార్య జానకి(కృతిసనన్), సోదరుడు శేషు(సన్నీసింగ్)లతో కలిసి వనవాసం చేస్తోంటాడు రాఘవుడు(ప్రభాస్).
జానకిని మాయోపాయంతో లంకేష్ (సైఫ్ అలీఖాన్ )అపహరిస్తాడు. వానరసైన్యం సహాయంతో లంకేష్‌పై యుద్ధానికి సిద్ధమవుతాడు రాఘవుడు. లంకేష్ మాయాల్ని ఛేదిస్తూ రాఘవుడు ఈ యుద్ధంలో ఎలా విజయం సాధించాడన్నదే ఆదిపురుష్ (Adipurush Review) సినిమా కథ.
రామాయణంఎమోషన్...
రామాయణం(Ramayanam) ఓ కథ కాదు. ఎమోషన్. రాముడు కథ ఎంతో సనాతనమో అంత నిత్యనూతనమైంది. రామయణ గాథ ఆధారంగా అనేక సినిమాలొచ్చాయి. ఒక్కో దర్శకుడు ఒక్కో కోణంలో రాముడిగాథను సిల్వర్‌స్క్రీన్‌పై చూపించారు. రామాయణం ఆధారంగా గతంలో వచ్చిన సినిమాల్లో ఒంటినిండా ఆభరణాలతో నిండైన రూపంలో రాముడిని దర్శకులు చూపించారు. రామాయణంలో గ్రాంథికభాషను వాడటం, సీతారాముల ప్రేమను పవిత్రంగా చూపించడానికే ప్రాధాన్యతనిచ్చారు.
ఆ రూల్స్ బ్రేక్…
ఆదిపురుష్‌తో రామాయణం విషయంలో ఉన్న పడికట్టు సూత్రాలను బ్రేక్ చేశారు డైరెక్టర్ ఓం రౌత్. ఇప్పటి జనరేషన్‌ను రామాయణాన్ని ఎలా చూడాలని అనుకుంటున్నారో వారి అభిప్రాయలకు తగ్గట్టుగా ఆదిపురుష్ సినిమాను డిజైన్ చేశాడు. ఈ సినిమాలో సిక్స్‌ప్యాక్ లుక్‌లో మీసకట్టుతో ప్రభాస్ కనిపిస్తాడు. సీతారాముల ప్రేమకథ విషయంలో పాత సినిమాల ప్రామాణాకాల్ని పక్కనపెట్టి వారి మధ్య రాఘవ, జానకి మధ్య డ్యూయెట్ సాంగ్‌ను సినిమాలో జోడించాడు ఓంరౌత్. సినిమాలో గ్రాంథికం జోలికి వెళ్లకుండా కంప్లీట్‌గా రెగ్యులర్ భాషలో డైలాగ్స్ ఉండేలా జాగ్రత్తపడ్డాడు.
రామాయణం మూల సారాన్ని గ్రాఫిక్స్, విజువల్స్ ద్వారా ఎంత వరకు చూపించవచ్చో అంత ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఆవెంజర్స్, అవతార్ తరహాలో మన పురాణాల్ని, ఇతిహాసాల్ని ఆధునికత సాంకేతికతతో చెప్పవచ్చదని ఆదిపురుష్ ద్వారా నిరూపించాలని ఓంరౌత్ సంకల్పించాడు. ఈ ప్రయత్నంలో కొంత వరకు కొంత వరకు ఓంరౌత్ సక్సెస్ అయ్యాడు.
కల్పిత అంశాలతో కాకుండా...
రాఘవుడి జననంతో కాకుండా అతడి వానవాస దీక్షనుంచి ఆదిపురుష్ కథను చెప్పారు డైరెక్ట్ ఓంరౌత్. కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డ అతడు అసలు పేర్లతో కాకుండా మారు పేర్లుతోనే ఈ మోడ్రన్ రామయణాన్ని తెరకెక్కించారు. హనుమంతుడికి భజరంగ్, లక్ష్మణుడికి శేషు అంటూ పేర్లు మార్చడానికి కారణం అదే అనిపిస్తోంది.
జానకికి లంకేష్ అపహరించడం, భార్య దూరమై రాఘవుడు పదే మనోవేదనతో ఫస్ట్‌హాఫ్ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. భజరంగ్ సాయంతో జానకి ఆచూకీని రాఘవుడు కనిపెట్టడం, లంకా దహణం ఎపిసోడ్స్‌లో కల్పిత అంశాలకు చోటులేకుండా జాగ్రత్తపడ్డాడు. పోరాడుతారా అయితే దూకండి ముందుకు అంటూ విరామం సన్నివేశాల్లో ప్రభాస్ చెప్పే డైలాగ్స్ థియేటర్లలో ఆడియెన్స్‌కు గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయి. కానీ అలాంటి హై మూవ్‌మెంట్స్ సెకండాఫ్‌లో మిస్సయ్యాయి.
క్రియేటివ్ ఫ్రీడమ్…
రామాయణం సారంలో ఎలాంటి మార్పులు చేయని దర్శకుడు ఓంరౌత్ క్యారెక్టర్స్ లుక్స్ విషయంలో చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నాడు. జానకి, లంకేష్, భజరంగ్ ఇలా ప్రతి పాత్ర గ్రాఫిక్స్ హంగులతో కొత్తగా చూపించారు. ఆ లుక్స్ ప్రేక్షకుల్ని ఇబ్బందిపెట్టాయి. రావణుడి పాత్ర కనిపించిన ప్రతిసారి స్వేచ్ఛపాళ్లు కాస్త శృతిమించినట్లుగా అనిపిస్తాయి.
రాఘవుడి ముందే జానకిని లంకేష్ చంపినట్లుగా చూపించడం, లంకేష్ పాములతో మసాజ్ చేసుకోవడం లాంటి సీన్స్ ప్రేక్షకులు ఎంత వరకు డైజెస్ట్ చేసుకుంటారన్నది అనుమానమే. లంకేష్‌తో పాటు అతడి సమూహంమొత్తం హాలీవుడ్ సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాల్లోని నటీనటుల మాదిరిగా మోడ్రన్ లుక్స్‌తో ఉండటాన్ని జీర్ణించుకోవడం కష్టమే అనిపిస్తుంది.
గ్రాఫిక్స్ డామినేట్...
ఆదిపురుష్‌లోని ఎమోషన్‌ను గ్రాఫిక్స్ డామినేట్ చేశాయి. పోనీ అవైనా బాగున్నాయంటే అది లేదు. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌కు అలవాటుపడిన ప్రేక్షకులకు ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్ యావరేజ్ ఫీలింగ్ కలిగిస్తాయి. గ్రాఫిక్స్‌తోనే ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయాలనే తపనతో కథ, క్యారెక్టరైజేషన్స్ విషయంలో పెట్టి ఉంటే ఆదిపురుష్ ఫలితం మరోలా ఉండేది.
ఆదిపురుష్ సెకండాఫ్ పూర్తిగా యుద్ధ సన్నివేశాల చుట్టే తిరుగుతుంది. క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో ముందే తెలియడం, నిదానంగా కథాగమనం సాగడం ప్రేక్షకులకు బోర్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది. సినిమాలోని ఫైట్స్, లంక నగరం సెటప్, వానర, రావణ సైన్యం చూస్తే ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, థోర్ వంటి హాలీవుడ్ సినిమాల్ని గుర్తుకుతెస్తుంది.
ప్రభాస్ హైలైట్...
రాముడిగా ప్రభాస్ నటన, లుక్ విషయంలో పెద్దగా కంప్లైంట్స్ లేవు. అతడి డైలాగ్స్ గూస్‌బంప్స్ కలిగిస్తాయి. అయితే క్యారెక్టర్ నిడివి తక్కువ కావడంతో కొద్దిగా ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెడుతుంది. మూడు గంటల మూవీలో మహా అయితే గంటలోపే ప్రభాస్ కనిపిస్తాడు. జానకిగా కృతిసనన్ యాక్టింగ్‌కు వంక పెట్టలేం. ప్రభాస్, కృతిసనన్ మధ్య సీన్స్ విజువల్‌గా బాగున్నాయి.
లంకేష్‌గా సైఫ్ అలీఖాన్ యాక్టింగ్ కంటే ఎలివేషన్స్ ఎక్కువైపోయాయి. అనవసరపు సీన్స్‌తో సైఫ్ పాత్రను దర్శకుడు హైలైట్ చేసినట్లుగా అనిపిస్తుంది. దేవదత్త, సన్నీసింగ్, సోనాల్ చౌహాన్ ఒకే అనిపించారు. ప్రభాస్ మినహా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు లేకపోవడం కూడా సినిమాకు పెద్ద మైనస్‌గా చెప్పవచ్చు. డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అజయ్ అతుల్ అందించిన పాటలు బాగున్నాయి.
Adipurush Review -ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాత్రమే...
ఈ మోడ్రన్ రామాయణం ప్రభాస్ ఫ్యాన్స్‌ను మినహా మిగిలిన వారికి ఆకట్టుకోవడం కష్టమే. రామాయణం గురించి ప్రేక్షకుల మనసుల్లో ఉన్న ఊహలు, ఆలోచనలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా సాగుతుంది. రామాయణ గాథ తో ఇదివరకు వచ్చిన పాత సినిమాల్ని చూడని యూత్ ఆడియెన్స్ ను మాత్రం ఆదిపురుష్ మెప్పిస్తుంది.