Vishal: అధికారికి లంచం ఇచ్చిన హీరో విశాల్.. సీఎం, ప్రధానికి చెబుతున్న వీడియో వైరల్
29 September 2023, 8:34 IST
Vishal Viral Video: తమిళ స్టార్ హీరో విశాల్ వీడియో తాజాగా తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తనకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదికి విజ్ఞప్తి చేశాడు హీరో విశాల్.
అధికారికి లంచం ఇచ్చిన హీరో విశాల్.. సీఎం, ప్రధానికి చెబుతున్న వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తాజాగా నటించిన సినిమా మార్క్ ఆంటోని. సెప్టెంబర్ 15న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను హిందీలో విడుదల చేద్దామనుకున్నారు. అందుకోసం ముంబై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కోసం లంచం ఇవ్వాల్సివచ్చిందని హీరో విశాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముంబై సెంట్రల్ బోర్డ్ కార్యాలయంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం తెలియజేస్తూ ట్విటర్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు.
అవినీతి గురిచంచి వెండితెరపై చూపిస్తే బాగుంటుంది. కానీ, నిజ జీవితంలో అవినీతి చేయకూడదు. నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని ట్విటర్‍లో వీడియో రిలీజ్ చేశారు విశాల్. వీడియోలో సీబీఎఫ్‍సీ ముంబై కార్యాలయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు. తెలుగు, తమిళంలో మార్క్ ఆంటోనీ సూపర్ హిట్ కావడంతో హిందీలో విడుదల చేయాలనుకున్నట్లు విశాల్ తెలిపారు. హిందీ వెర్షన్ సెన్సార్ కోసం సీబీఎఫ్‍సీ కార్యాలయాన్ని విశాల్ సంప్రదించారు.
అయితే మార్క్ ఆంటోనీ సెన్సార్ కోసం సెంట్రల్ బోర్డ్ ముంబై కార్యాలయం ఉద్యోగి లంచం అడిగారట. మధ్యవర్తి ద్వారా మాట్లాడుకుని రూ. 6.5 లక్షలు లంచం ఇచ్చినట్లుగా విశాల్ ఆరోపణ చేశారు. రూ. 3 లక్షలు ఒక బ్యాంక్ అకౌంట్‍లో, మరో 3.5 లక్షలు ఇతర ఖాతాలో రెండు దఫాలుగా వేసినట్లు వివరించారు. బ్యాంక్ అకౌంట్స్ డీటెల్స్ సైతం విశాల్ తెలిపారు. ఈరోజే సినిమా రిలీజ్ ఉండటంతో ఏం చేయాలో తెలియక, టైమ్ లేక లంచం ఇవ్వాల్సి వచ్చిందని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
మార్క్ ఆంటోని స్క్రీనింగ్ కోసం రూ. 3 లక్షలు, సర్టిఫికేట్ ఇవ్వడానికి రూ. 3.5 లక్షలు చెల్లించినట్లుగా విశాల్ చెప్పుకొచ్చారు. కానీ, భవిష్యత్తులో ఎవరికీ తనలాంటి పరిస్థితి రాకూడదని, ఈ అవినీతి గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్ర ఏక్‍నాథ్ షిండే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకొస్తున్నట్లు, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా అవినీతిపరుల చేతుల్లో పెట్టాలా అని ప్రశ్నించారు. ఇందులో సీఎం, ప్రధాని తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు విశాల్ పేర్కొన్నారు.