Lok Sabha Elections Phase 5: ఐదో దశలో లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులు వీరే..
16 May 2024, 11:56 IST
Lok Sabha Elections Phase 5: లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం మే 20 వ తేదీన జరగనుంది. ఈ ఐదో దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదో దశలో బరిలో నిలిచిన ప్రముఖుల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ తదితరులు ఉన్నారు.
మే 20వ తేదీన లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్
Lok Sabha Elections Phase 5: ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి. ఇందులో ఐదో విడత పోలింగ్ సోమవారం జరగనుంది. మొదటి నాలుగు విడతలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13 తేదీల్లో జరిగాయి. చివరి రెండు విడతలు మే 25, జూన్ 1న జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన మొత్తం లోక్ సభ స్థానాలకు, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన స్థానాలకు జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఐదో దశ పోలింగ్ సమయం
మే 20న లోక్ సభ ఎన్నికల ఐదో విడతలో కూడా ఎప్పటిలాగే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు.
కీలక నియోజకవర్గాలు
ఈ 2024 లోక్ సభ ఎన్నికల్లో జరిగే ఏడు విడతల్లో ఐదో దశలో పోలింగ్ అతి తక్కువ నియోజకవర్గాల్లో జరుగుతోంది. ఈ దశలో కేవలం 49 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, ఈ 49 సీట్లలో కూడా పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఐదో దశ ఎన్నికల బరిలో మొత్తం 695 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఐదో దశలో అత్యధికంగా యూపీలోని 14 స్థానాల్లో, మహారాష్ట్రలోని 13 సీట్లలో పోలింగ్ జరుగుతోంది.
హై ప్రొఫైల్ అభ్యర్థులు
గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్ లోని అమేథీ, రాయ్ బరేలీ లోక్ సభ స్థానాలకు ఈ ఐదో దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో రాయ్ బరేలీ నుంచి వరుసగా ఐదోసారి గెలిచిన సోనియాగాంధీ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం నుంచి తన పార్టీ ఏకైక ఎంపీగా ఎన్నికయ్యారు. మరోవైపు ఆమె కుమారుడు, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు.
రాహుల్ గాంధీ (కాంగ్రెస్): రాయ్ బరేలీ
దినేశ్ ప్రతాప్ సింగ్ (బీజేపీ): రాయ్ బరేలీ
స్మృతి ఇరానీ (బీజేపీ): అమేథీ
కిశోరి లాల్ శర్మ (కాంగ్రెస్): అమేథీ
రాజ్ నాథ్ సింగ్ (బీజేపీ): లక్నో
పీయూష్ గోయల్ (బీజేపీ): ముంబై నార్త్
చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ/ఎన్డీఏ): హాజీపూర్
కరణ్ భూషణ్ సింగ్ (బీజేపీ): కైసర్ గంజ్
రాజీవ్ ప్రతాప్ రూడీ (బీజేపీ): సరన్
రోహిణి ఆచార్య (ఆర్జేడీ/ఇండియా): సరన్
ఒమర్ అబ్దుల్లా (జేకేఎన్సీ/ఇండియా): బారాముల్లా
అరవింద్ సావంత్ (ఎస్ఎస్యూబీటీ/ఇండియా): ముంబై సౌత్