Lok Sabha election results : చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ అవ్వడం ఖాయమేనా?
04 June 2024, 11:50 IST
Lok Sabha election results : చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ అవ్వడం ఖాయమేనా? తాజా ట్రెండ్స్‌ని చూడండి..
చంద్రబాబు నాయుడు..
Andhra Pradesh Assembly election results : 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కీలక పరిణామం! ఊహించిన దాని కన్నా మెరుగైన ప్రదర్శన చేస్తూ.. అధికార ఎన్డీఏకి టఫ్ ఫైట్ ఇస్తోంది విపక్ష ఇండియా కూటమి. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే.. కాంగ్రెస్- ఇండియా కారణంగా.. బీజేపీ- ఎన్డీఏకి ఊహించిన దాని కన్నా తక్కువ సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు దేశ ప్రజల చూపు ఆంధ్రప్రదేశ్‌పై పడింది. మరీ ముఖ్యంగా.. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కింగ్ మేకర్‌గా చంద్రబాబు నాయుడు..!
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి గెలుపు దాదాపు ఖరారైపోయింది. కూటమి దెబ్బకు వైసీపీకి చెందిన కొంచుకోటలు ధ్వంసమవుతున్నాయి. అయితే.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తుండటం విశేషం.
AP Lok Sabha election results : ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ట్రెండ్స్ ప్రకారం.. ఈ 25లో టీడీపీ 14 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇంకా చెప్పాలంటే.. 25 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది 17 స్థానాల్లోనే! మొత్తం మీద ఇక్కడ కూటమి 22 చోట్ల లీడింగ్‌లో ఉంది. వైసీపీ 2 చోట్ల, కాంగ్రెస్1 చోట ఆధిక్యంలో ఉన్నాయి.
అటు.. కేంద్రంలో.. ఉదయం 11 గంటల 3 నిమిషాల వరకు.. ఎన్డీఏ కూటమి 285 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. విపక్ష ఇండియా కూటమి 231 సీట్లల్లో ముందు ఉంది. ఇతరులు 26 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
లోక్‌సభలో మెజారిటీ మార్క్ 272. ఒకవేళ ప్రస్తుత ట్రెండ్ కొనసాగి.. ఎన్డీఏ కూటమి 285 సీట్లల్లోనే గెలిస్తే.. చంద్రబాబు నాయుడు టీడీపీ సంపాదించుకునే సీట్లు ఎన్డీఏలో అత్యంత కీలకంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
2024 Lok Sabha elections results : 2023 నవంబర్‌లో జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు మళ్లీ అఖండ విజయంతో దూసుకురావడం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. ఆయన జైలుకు వెళ్లడం కలిసి వచ్చింది! వైసీపీపై వ్యతిరేకత ఇంకాస్త పెరిగింది. అవే.. తాజా ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తున్నాయి.
2014 నుంచి 2019 వరకు ఎన్డీఏలో భాగంగా ఉన్న టీడీపీ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో విభేదాల కారణంగా.. కూటమిలో నుంచి బయటకు వచ్చేసింది. ఈసారి.. వైసీపీ జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా.. జేనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది.