YS Jagan In Poddutur: వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో అందరికి తెలుసు, చెల్లెళ్లతో దుష్ప్రచారం చేయిస్తున్నారన్న జగన్
27 March 2024, 19:33 IST
- YS Jagan In Poddutur: వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో కడప జిల్లాలో అందరికి తెలుసన్న సిఎం జగన్, తనను ఓడించడానికి సొంత చెల్లెళ్లను కూడా ప్రత్యర్థులు తమ వైపు తిప్పుకున్నారని ఆరోపించారు.
మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్
YS Jagan In Poddutur: తన చిన్నాన్న వివేక YS Viveka ను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, జిల్లా ప్రజలు అందరికి తెలుసని సిఎం జగన్మోహన్ రెడ్డి పొద్దుటూరు బహిరంగ సభలో అన్నారు. తనను విమర్శిస్తూ ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారిని ఎందుకు పంపించారో అందరికి రోజు కనిపిస్తోందన్నారు.
వివేకం YS Viveka చిన్నాన్నను అతి దారుణంగా చంపి ఆయన్ని, తానే చంపానని అతి హేయంగా, బహిరంగంగా తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తోంది ఎవరో రోజు చూస్తున్నామన్నారు. చంపినోడికి నెత్తిన పెట్టుకుని మద్దతిస్తున్న వారు, చంద్రబాబుతో పాటు, చంద్రబాబు మనుషులేనన్నారు. వారితో రాజకీయ స్వార్థంతో తపించిపోతున్న ఒకరిద్దరు తన సొంత వాళ్లు Relatives కూడా హంతకుడికి మద్దతు ఇస్తున్నారన్నారు.
చిన్నాన్నను ఎమ్మెల్సీ MLC ఎన్నికల్లో ఓడించిన వారితో ఇప్పుడు చెట్టాపట్టాలు వేసుకున్న వారితో తిరగడానికి అర్థం ఏమిటన్నారు. రాజకీయంగా తననను దెబ్బతీసే రాజకీయం అని వారికి వారే చెబుతున్నారంటే కలియుగం కాకుండా ఏమిటన్నారు.
ప్రజల మద్దతులేని వారు చేస్తున్న నీచ రాజకీయంతో తాను మాత్రం ప్రజల పక్షానే ఉంటానని చెప్పారు. ఆ దేవుడు,ఆ ప్రజలనే తాను నమ్ముకున్నట్టు చెప్పారు. ధర్మాన్ని న్యాయాన్ని మాత్రమే నమ్ముకున్నానని చెప్పారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర వారికి ఎక్కడ లేదన్నారు.
ఎన్నికల ప్రచారం ప్రారంభం…
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో Campaign భాగంగా వైఎస్సార్ జిల్లా పొద్దుటూరులో వైఎస్ జగన్ బహిరంగ సభ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాలో ఇంత పెద్ద మీటింగ్ ఎప్పుడు జరగలేదని, మమాసముద్రం కనిపిస్తోందని, మంచికి మద్దతు పలికే ప్రజా సైన్యం మధ్య ప్రజా జైత్రయాత్రకు ముందు వరుసలో వైఎస్సార్ కాంగ్రెస్ జెండా తలెత్తుకుని నిలబడి ఉందని చెప్పారు.
అధికారాన్ని పేదల భవిష్యత్తు కోసం, రైతుల కోసం అక్క చెల్లెమ్మల కోసం భావితరం పిల్లల కోసం మన గ్రామాల కోసం ఇంటింటి అభివృద్ధి, సంక్షేమ కోసం బాధ్యతగా 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తెచ్చి, రాష్ట్ర చరిత్రలో ఎన్నడు చూడని విధంగా 2లక్షల 70వేల కోట్ల రుపాయల్ని ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వం తమదన్నారు.
ఎవరితో పొత్తు లేదు…
2024 ఎన్నికల సమరానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వైఎస్సార్ జెండా ఏ జెండాతో జత కట్టడం లేదని, ప్రజల అజెండాగా రెపరెపలాడుతోందని చెప్పారు. పొద్దుటూరు గడ్డ మీద లక్షల సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. పేదవారి ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్న వారిని చిత్తుగా ఓడించడానికి ప్రజలంతా సిద్ధం కావాలన్నారు.
మే 13న ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి ఓట్లు వేయించాలన్నారు. అభివృద్ధి నిరోధకులు, పేదల వ్యతిరేకుల్ని ఓడించడానికి అంతా సిద్ధం కావాలన్నారు. మరో 48 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, గెలుపే లక్ష్యంగా అడుగులు వేయాలన్నారు.
అబద్దాలు చెప్పేవారు, మోసాలు చేసేవారు, అవలీలగా కుట్రలు చేసే కూటమి ప్రతిపక్షంగా ఉందని, ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డవారంతా ఏకమయ్యారన్నారు. చంద్రబాబు బృందానికి నమ్మించి నట్టేటా ముంచడంలో నలభైఐదేళ్ల అనుభవం ఉందన్నారు.
మోసాలు చేయడం, అబద్దాలు చెప్పడంలో వెన్నుపోట్లు పొడవడంలో, కుట్రలు చేయడంలో 45ఏళ్ల అనుభవం ఉందన్నారు. మ్యానిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయడంలో 14ఏళ్ల అనుభవం ఉందన్నారు. ఎన్నికలు కాగానే మ్యానిఫెస్టో చెత్తబుట్టలో పడేస్తారన్నారు. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, వెన్నుపోట్లు చేయడానికి బాగా అనుభవం ఉందన్నారు.
విశాఖ డ్రగ్స్ బాబు, పురందేశ్వరి బంధువులవే…
విశాఖలో పట్టుబడిన డ్రైఈస్ట్ డ్రగ్సకు చంద్రబాబు, పురందేశ్వరి బంధువులవే అన్నారు. చంద్రబాబు వదిన గారి చుట్టం కంపెనీకి డ్రై ఈస్ట్ రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తుంటే, సిబిఐ దాడి చేసిందని.. దాడులు జరగ్గానే దొరికిన వాళ్లు తమ వారు కాదని క్షణాల్లో దుష్ప్రచారం చేశారన్నారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలి కొడుకు, వియ్యంకుడు ఆ కంపెనీలో డైరెక్టర్లు ఉన్నారని జగన్ ఆరోపించారు. బాబు బంధువులు ఆ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. సంబంధం లేని వ్యవహారంలో బురద చల్లడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు సిద్ధంగా ఉంటారన్నారు.
ఎన్నికల్లో తనను ఎదుర్కొలేక కేంద్రం నుంచి ప్రత్యక్షంగా ఓ పార్టీ, పరోక్షంగా మరో పార్టీని అండగా తెచ్చుకుని అందరు కలిసి జగన్‌తో యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ, చంద్రబాబు, జనసేన, కాంగ్రెస్ కలిసి తనపై యుద్ధం చేస్తున్నాయన్నారు
వీరంతా కలిసి తనతో యుద్ధం చాలడం లేదని తన చెల్లెళ్లను కూడా అండగా తెచ్చుకున్నారని, వీరంతా కలిసి తనపై యుద్ధం చేస్తున్నారని, ఒకే ఒక్కడు ఇంతమందిని భయపెట్టాడని, ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి లేదన్నారు. దేవుడి దయ, కోట్ల గుండెలు అండగా ఉన్నాయని చెప్పారు.