తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Purandeswari On Tdp Jsp Alliance : సీట్ల సర్దుబాటుపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత, పొత్తులపై స్పందించిన పురందేశ్వరి

Purandeswari On TDP JSP Alliance : సీట్ల సర్దుబాటుపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత, పొత్తులపై స్పందించిన పురందేశ్వరి

10 March 2024, 14:45 IST

google News
    • Purandeswari On TDP JSP Alliance : టీడీపీ, జనసేన పొత్తుపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. టీడీపీ, జనసేనతో పొత్తు కుదరడం సంతోషమన్నారు. ఒకట్రెండు రోజుల్లో సీట్ల అంశంపై స్పష్టత వస్తుందన్నారు.
పురందేశ్వరి
పురందేశ్వరి

పురందేశ్వరి

Purandeswari On TDP JSP Alliance : ఏపీలో పొత్తులు కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ, టీడీపీ, జనసేన(BJP TDP JSP) వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు మూడు పార్టీలు శనివారం పొత్తులపై ఉమ్మడి ప్రకటన చేశాయి. ఈ పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeswari) స్పందించారు. పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనతో పొత్తు కుదరడం సంతోషమన్నారు. అయితే సీట్ల సర్దుబాటుపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. శ్రీరాముడికి కూడా ఉడుత సాయం అవసరమైందని, ఏపీలో అరాచక పాలన అంతం చేయడానికి అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే ఈ పొత్తులని స్పష్టం చేశారు.

మేనిఫెస్టో పై ప్రజాభిప్రాయ సేకరణ

మేనిఫెస్టో (BJP Manifesto)రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనున్నామని పురందేశ్వరి తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారనే అంశంపై అభిప్రాయ సేకరణకు రెండు బాక్సులు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్టు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని, వారంతా పొత్తును అర్థం చేసుకుంటారని పురందేశ్వరి అన్నారు.

సీట్ల సర్దుబాటుపై ఊహాగానాలు?

వచ్చే అసెంబ్లీ(AP Assembly Elections), లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) 8 పార్లమెంటు స్థానాలు, 30 అసెంబ్లీ నియోజక వర్గాల్లో జనసేన, బీజేపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాకినాడ (Kakinada)లోక్‌సభ స్థానం నుంచి పవన్ కల్యాణ్ బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే 8 నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపిక కూడా కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది. మిగిలిన 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. అయితే 25 లోక్ సభ స్థానాల్లో 8 సీట్లను బీజేపీ, జనసేనలకు కేటాయించేందుక టీడీపీ ప్రాథమికంగా అంగీకరించిందని తెలుస్తోంది. 8 సీట్లలో బీజేపీ 6 స్థానాల్లో, 2 చోట్ల జనసేన బరిలో దిగే అవకాశం ఉంది. 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, 6 చోట్ల బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ లోక్ సభ సీట్లపై మాత్రమే దృష్టి సారించిందని సమాచారం. ఈ సీట్ల సర్దుబాటుపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.

చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదు- విజయసాయి రెడ్డి

ఏపీలో పొత్తులపై వైసీపీ స్ట్రాంగ్ రిప్లై ఇస్తోంది. వైసీపీ (Ysrcp)ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ...చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదన్నారు. చంద్రబాబు దేశంలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. గతంలో ఎన్డీఏ(NDA)లో ఉన్న చంద్రబాబు ఏపీకి ఏం మేలు చేశారో చెప్పాలన్నారు. ఇప్పుడు పొత్తుతో కొత్తగా చంద్రబాబు చేసేది ఏం ఉండదన్నారు. చంద్రబాబు పొత్తుల్లో నిజాయితీ ఉండదన్న విజయసాయి రెడ్డి... సిద్దాంతాలు ఆధారంగా ఈ పొత్తులు లేవన్నారు. సీఎం జగన్ ను ఓడించాలనే అందరినీ కలుపుకున్నారంటూ ఆరోపించారు.

తదుపరి వ్యాసం